రాష్ట్రంలో జ‌న‌గ‌ణ‌న తొలిద‌శ‌!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారి జ‌న‌గ‌ణ‌న తొలిద‌శ ఈ ఏడాది మే 11న ప్రారంభం కానుంది. ఈ ద‌శ‌లో  గృహాల వివ‌రాలు సేక‌రించి జాబితాను త‌యారుచేయ‌నున్నారు. ఈ గృహ జాబితా త‌యారీ కార్య‌క్ర‌మం (హెచ్ ఎల్‌ ఓ) 9వ‌ర‌కు కొన‌సాగనుంది. అయితే ఈ హెచ్‌ ఎల్ ఓ ప్రారంభానికి 15 రోజుల ముందు అంటే ఏప్రిల్ 26న సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ ద‌శ మొద‌లవుతుంది. ఈ ద‌శ‌లో ప్ర‌జ‌లు త‌మ‌కు సంబం ధించిన వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది . ఆ త‌ర్వాత మే 11నుంచి ఇళ్ల జాబితా త‌యారీ మొద‌లై జూన్ 9తో ముగుస్తుంది.

ఇక రెండోద‌శ జ‌న‌గ‌ణ‌న కార్య‌క్ర‌మం రాష్ట్రంలో 2027 ఫిబ్ర‌వ‌రి 9న మొద‌లై 28 వ‌ర‌కు కొన‌సాగుతుంది. దేశ చ‌రిత్ర‌లో మొట్ట‌మొద‌టిసారి జ‌న‌గ‌ణ‌ను పూర్తిగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో చేప‌ట్ట‌నున్నారు. ఇందుకు మొబైల్ అప్లికేష‌న్ ద్వారా రియ‌ల్ టైమ్ డేటాను సేక‌రిస్తారు. గ‌త 70 సంవ‌త్స‌రాల్లో మొద‌టిసారి జ‌న‌గ‌ణ‌న‌తో పాటు కుల‌గ‌ణ‌న‌కూడా చేప‌ట్ట‌డం విశేషం. ఈ మొత్తం ప్ర‌క్రియ కోసం ఉపాధ్యా యుల‌తో స‌హా 88 వేల నుంచి 99వేల మంది సిబ్బంది ప‌నిచేస్తారు. నివాస‌, నివాసేతర భ‌వ‌నాల‌ జియో-ట్యాగ్ చేయ‌డానికి వీలుగా డిజిట‌ల్ మ్యాపింగ్ టూల్స్ ను ఉప‌యోగించ‌నున్నారు.

నిజానికి ఈ జ‌న‌గ‌ణ‌న 2021లోనే జ‌ర‌గాల్సింది. కానీ కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇది వాయిదాప‌డుతూ వొచ్చి ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది మొద‌ల‌వుతోంది. బిహార్ ఎన్నిక‌లకు ముందునుంచే కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు కుల‌గ‌ణ‌న కూడా చేప‌ట్టాల‌ని కేంద్రంపై విప‌రీత ఒత్తిడి తీసుకువొచ్చాయి. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ దీన్ని వ్య‌తిరేకించ‌డంతో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న  క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల్లో కుల‌గ‌ణ‌న జ‌రిపారు. అంత‌కు ముందే బిహార్ ప్ర‌భుత్వం కులాల‌వారీ జ‌నాభా వివ‌రాలు చేక‌రించింది. ఎట్ట‌కేల‌కు విప‌క్షాల ఒత్తిడికి త‌లొగ్గిన కేంద్ర ప్ర‌భుత్వం, జ‌న‌గ‌ణ‌న‌తో పాటు కుల‌గ‌ణ‌న‌కు కూడా అంగీకారం తెల‌ప‌డంతో ఇప్పుడు కుల‌గ‌ణ‌న‌కు మార్గం సుగ‌మ‌మైంది. జ‌న‌గ‌ణ‌న అంటే సాధార‌ణంగా గ‌త సెన్సెస్‌తో పోల్చి జ‌నాభా, లింగ‌నిష్ప‌త్తి, అక్ష‌రాస్య‌త‌, మౌలిక స‌దుపాయాల వంటి అంశాల‌పై సామాన్యుల్లో ఆస‌క్తి క‌ల‌గ‌డం స‌హ‌జ‌మే. ఈ మొత్తం జ‌న‌గ‌ణ‌న పూర్త‌యి వివ‌రాలు అందేస‌రికి మ‌రో రెండేళ్లు ప‌ట్ట‌వొచ్చు. ఈ నేప‌థ్యంలో జ‌నాభా త‌దిత‌ర అంశాల‌పై తాజాగా విడుద‌లైన కొన్ని అంచ‌నాల‌ను ప‌రిశీలిస్తే, సుమారుగా కొన్నిఅంశాల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.

 జ‌నాభా ప‌రంగా నేష‌న‌ల్ క‌మిష‌న్ ఆన్ పాపులేష‌న్ తాజా గ‌ణాంకాల ప్ర‌కారం 2011నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో జ‌నాభా 3.6 నుంచి 3.8 మిలియ‌న్ల వ‌ర‌కు పెరిగి ఉంటుందని  అంచ‌నా. అంటే 2011లో రాష్ట్ర జ‌నాభా 35003674 (సుమారు 3.5కోట్లు) కాగా, 2026 నాటికి 38665000 (సుమారు 3.87 కోట్లు)కు చేర‌వొచ్చు. 2027 నాటికి ఇది 38779000 (సుమారు 3.88కోట్లు)కు పెరిగే అవ‌కాశ‌ముంది. అంటే 2011తో పోలిస్తే రాష్ట్ర జ‌నాబా 10.8% పెరిగే అవ‌కాశ‌ముంది. 2001-2011 మ‌ధ్య‌కాలంలో జ‌నాభా పెరుద‌ల 13.58%తో పోలిస్తే ఈసారి 0.3% తక్కువ పెర‌గ‌డం, వృద్ధిరేటు క్ర‌మంగా త‌గ్గుతున్న‌ద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. తెలంగాణ వృద్ధికి చోద‌క‌శ‌క్తిగా ప‌రిగ‌ణిస్తున్న హైద‌రాబాద్ జ‌నాభా 7.7మిలియ‌న్ (2011) నుంచి 11.5 మిలియ‌న్ (2026)కు చేరుతుంద‌ని అంచ‌నా.

ప్ర‌పంచంలోని చాలాదేశాల్లో మాదిరిగానే తెలంగాణ‌లో వృద్ధుల జ‌నాభా 2041 నాటికి రెట్టింపు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండగా , ఇదే కాలంలో 5-12 సంవ‌త్స‌రాల పిల్ల‌ల జ‌నాభా 16% ప‌డిపోతుందని కూడా అంచ‌నా. ఇక జ‌న‌నాల శాతం కూడా క్ర‌మంగా క్షీణ‌త‌ను న‌మోదు చేసే అవకాశాలున్నాయి. 2011-15 మ‌ధ్య‌కాలంలో ఈ జ‌న‌నాల రేటు 15.7% ఉండగా , 2031-35 నాటికి 10.2%కు ప‌డిపోయే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది.
ఇక స్త్రీల జ‌నాభా 2011 (1.74కోట్లు)తో పోలిస్తే, 2026 (1.92కోట్లు)లో వృద్ధి న‌మోదు చేసే అవ‌కాశ‌ముంది.

ఇక లింగ నిష్ప‌త్తిని ప‌రిశీలిస్తే 2001-11 మ‌ధ్య‌కాలంలో ప్ర‌తి వెయ్యిమంది పురుషుల‌కు స్త్రీల జ‌నాభా 971 నుంచి 988కి పెరిగింది. ఈ పెరుగుద‌ల ఇదేవిధంగా కొన‌సాగ‌వొచ్చ‌ని అంచ‌నా. అయితే 80పై వ‌య‌సు గ‌ల మ‌హిళ‌ల జ‌నాభా 2036 నాటికి 95.8% పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా. అంటే పునరుత్ప‌త్తి సామ‌ర్థ్య‌మున్న స్రీల‌కంటే వ‌యోవృద్ధ మ‌హిళ‌ల జ‌నాభా పెర‌గ‌డం ఇక్క‌డ కీల‌కం. ఇదే వ‌య‌స్సు క‌లిగిన పురుషుల్లో ఈ వృద్ధి కేవ‌లం 64.3% మాత్ర‌మే ఉండనుంద‌ని ఈ అంచ‌నా పేర్కొంది. మ‌రో విష‌య‌మేంటంటే తెలంగాణ లో 70-74 వ‌య‌స్సుగ‌ల వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఆరోగ్య స‌దుపాయాలే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ఫెర్టిలిటీ రేటు విష‌యానికి వొస్తే 2031 నాటికి ఇది 1.5% ప‌డిపోయే అవ‌కాశాలున్నాయి.

జ‌నాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు 2.1% ఉండాలి. కానీ మ‌హిళ‌ల్లో విద్యావంతులు పెర‌గ‌డం, లేటు వివాహాలు లేదా సోలో జీవితాల‌పైనే మ‌క్కువ చూప‌డం వంటివి ఇందుకు ప్ర‌ధాన కార‌ణం! మొత్తంమీద ప‌రిశీలిస్తే రాష్ట్రంలో లింగ‌నిష్ప‌త్తి బాగా మెరుగైన‌ప్ప‌టికీ 0-6 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్కులైన పిల్ల‌ల్లో లింగ‌నిష్ప‌త్తి 2001లో 957 నుంచి 2011 నాటికి 932కు ప‌డిపోయింది. మ‌రి 2026 నాటికి ఈ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ది తెలియాల్సి ఉంది . 2011 జ‌న‌గ‌ణ‌లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పురుషుల కంటే మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువ న‌మోదైంది. 2025లో నిర్వ‌హించిన కులగ‌ణ‌న ఆధారంగా రాష్ట్రంలో ప్ర‌తి వెయ్యిమంది పురుషుల‌కు 999 మంది మ‌హిళ‌లు ఉన్న‌ట్లు తేలింది.   మొత్తంమీద ప‌రిశీలిస్తే 2026 నాటికి పురుషుల జ‌నాభా 19.43 మిలియ‌న్లు, స్త్రీల జ‌న‌భా 19.24 మిలియ‌న్లు ఉండవొచ్చున‌న్న‌ది అంచ‌నా. ఏది ఏమైనా 2027 జ‌న‌గ‌ణ‌న‌లో ఈ జ‌నాభాపై పూర్తి స్ప‌ష్ట‌త వొచ్చే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *