“ఎన్నికల ఫలితాల మీద ప్రతి ఒక్కరికీ భయమూ అనుమానమూ ఉన్నాయి గాని ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా నిజంగా ఎన్నికలకు వెళ్లాలని లేదు. అటువంటి వైఖరి అధికారపక్షానికి మరింత ఎక్కువగా ఉంది. ఎన్నికలను జరపక పోవడం ద్వారా గ్రామాల మీద ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కాక ప్రభుత్వాధికారులకే అధికారం వస్తుంది. అంటే ప్రభుత్వానికి నిధుల కేటాయింపు, పంపిణీ తలనొప్పి తగ్గుతుంది. ఎన్నికలు జరపకపోవడం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు అధికారం ఇవ్వకపోవడం అక్రమం, అప్రజాస్వామికం అని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తుంటాయి గాని, రాష్ట్ర ప్రభుత్వ అధికారం తమ చేతుల్లో లేనప్పుడు గ్రామీణ అధికారం మీద పెద్దగా శ్రద్ధ ఉండదు గనుక, స్థానిక స్వయం పరిపాలన అనే ఉదాత్త గాంధేయ ఆదర్శం మీద గౌరవం ఏమీ లేదు గనుక అవీ ఎన్నికలు జరపాలని పట్టుబట్టవు.”
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? జరిగినా, వెనుకబడిన కులాలకు ప్రభుత్వం జి. ఓ. నం. 9 ద్వారా కల్పించదలచిన రిజర్వేషన్ అమలవుతుందా? ప్రస్తుతం ఆ సమస్యను విచారిస్తున్న రాష్ట్ర హైకోర్టు ఈ రిజర్వేషన్ ను అంగీకరిస్తుందా? అక్టోబర్ 8న హైకోర్టు వైఖరి ఎలా ఉండబోతుంది? రిజర్వేషన్ జి. ఓ. ను ఆమోదిస్తుందా? కొట్టివేస్తుందా? ఇప్పటికైతే అమలు కానివ్వండి, తుది తీర్పులో చూసుకుందాం అని సందిగ్ధ స్థితిని పెంచుతుందా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినట్టుగా అక్టోబర్ 9న నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందా? లేక హైకోర్టు ఆదేశాలను బట్టి అది తారుమారు అవుతుందా? ఒకవేళ ప్రక్రియ కొనసాగవచ్చునని, తర్వాత తుది తీర్పు ఇస్తామని హైకోర్టు అంటే, గెలిచిన అభ్యర్థుల మెడమీద తమ పదవి ఎప్పుడు పోతుందో అనే అనిశ్చిత కత్తి ఎన్నాళ్లు వేలాడుతుంది? ఎన్నెన్నో ప్రశ్నలు. ఏ ఒక్క ప్రశ్నకూ నిస్సందేహమైన జవాబు చెప్పగల స్థితి లేదు.
సెప్టెంబర్ 30 లోగా డిలిమిటేషన్ పూర్తి చేసి, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని తెలంగాణ హైకోర్టు జూన్ 25న ఇచ్చిన ఆదేశం శిలాక్షరంగా భావించి, సెప్టెంబర్ 29ననే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రకటించింది. దాని ప్రకారం అక్టోబర్ 9 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలై, ఐదు విడతలుగా సాగి, నవంబర్ 11న ఫలితాల ప్రకటనతో ముగుస్తుంది. కాని ఈ వ్యవహారంలో అనేక చిక్కుముడులున్నాయి. రాజకీయ, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ఆ చిక్కుముడులలో ఎన్ని ఈ వారంలో విప్పుకుంటాయో, మరెన్ని కొత్త ముడులు పడతాయో తెలియదు. ఒకవేళ హైకోర్టు జి. ఓ. నం. 9 చెల్లుతుందని ప్రకటిస్తే, అంటే 42 శాతం బీసీ రిజర్వేషన్ ను ఆమోదిస్తే, దానికి దేశవ్యాప్త పర్యవసానాలుంటాయి.
మొట్టమొదట, ఈ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికి ఇరవై నెలల కిందనే జరగవలసినవి. గతంలో గ్రామ పంచాయత్ ఎన్నికల 2019 జనవరిలో, జిల్లా పరిషత్, మండల పరిషత్ ల ఎన్నికలు 2019 మేలో జరిగాయి. అంటే గ్రామ పంచాయత్ పదవీకాలం 2024 జనవరిలో, జెడి పిటిసి, ఎంపిటిసిల పదవీకాలం 2024 జూలై లో అయిపోయింది. గ్రామపంచాయత్ లకు ఇరవై రెండు నెలల కింద, జెడ్ పిటిసి, ఎంపిటిసి లకు పదిహేను నెలల కింద ఎన్నికలు జరగవలసి ఉండింది. ఇన్నాళ్లుగా గ్రామాల, మండలాల, జిల్లాల పాలన ఎన్నికైన ప్రజా ప్రతినిధుల చేతుల్లో కాక, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల చేతుల్లో ఉంది.
ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకో, న్యాయస్థానాలకో సంబంధించిన సమస్య కాదు. నిజంగా జనాభాలో ఎవరి వాటా ఎంతో, విద్యలో, ఉద్యోగాలలో, పరిపాలనలో వారికి అంత వాటా ఉండాలనే కనీస ప్రజాస్వామిక సూత్రం మీద వీరిలో ఏ ఒక్కరికీ గౌరవం లేదు. ప్రతి ఒక్కరూ ఈ వర్గాన్ని, వర్గాలను బుజ్జగించడం ద్వారా తమకు ఏ రాజకీయ ప్రయోజనం దక్కుతుందా అని మాత్రమే చూస్తున్నారు. ఇది అందరికందరూ కలిసి చేస్తున్న వంచనా ప్రక్రియగా, ప్రహసనంగా, నాటకంగా మారిపోయింది.
ఎన్నికల ఫలితాల మీద ప్రతి ఒక్కరికీ భయమూ అనుమానమూ ఉన్నాయి గాని ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా నిజంగా ఎన్నికలకు వెళ్లాలని లేదు. అటువంటి వైఖరి అధికారపక్షానికి మరింత ఎక్కువగా ఉంది. ఎన్నికలను జరపక పోవడం ద్వారా గ్రామాల మీద ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కాక ప్రభుత్వాధికారులకే అధికారం వస్తుంది. అంటే ప్రభుత్వానికి నిధుల కేటాయింపు, పంపిణీ తలనొప్పి తగ్గుతుంది. ఎన్నికలు జరపకపోవడం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు అధికారం ఇవ్వకపోవడం అక్రమం, అప్రజాస్వామికం అని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తుంటాయి గాని, రాష్ట్ర ప్రభుత్వ అధికారం తమ చేతుల్లో లేనప్పుడు గ్రామీణ అధికారం మీద పెద్దగా శ్రద్ధ ఉండదు గనుక, స్థానిక స్వయం పరిపాలన అనే ఉదాత్త గాంధేయ ఆదర్శం మీద గౌరవం ఏమీ లేదు గనుక అవీ ఎన్నికలు జరపాలని పట్టుబట్టవు. అలా ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్టు ఎన్నికలు రెండు సంవత్సరాలు ఆలస్యం అయినా ఎవరికీ పట్టలేదు. పదవీకాలం ముగిసిన కొందరు గ్రామ సర్పంచ్ లు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల ఆలస్యం మీద హైకోర్టుకు వెళితే, జూన్ 25న ఇచ్చిన తీర్పులో, ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశం వెలువడిన జూన్ 25 నుంచి సెప్టెంబర్ 30 వరకూ గడిచిన మూడు నెలల్లో ఈ అంశానికి సంబంధించి అనేక నాటకీయమైన, చిత్రమైన పరిణామాలు సంభవించాయి.
కుల గణన జరిపి, విద్యలో, ఉద్యోగాలలో, స్థానిక స్వపరిపాలనా సంస్థలలో వెనుకబడిన కులాల న్యాయమైన వాటా ఇస్తామని అంతకు ముందు నుంచీ చెపుతూ వస్తున్న కాంగ్రెస్, 2024 నవంబర్ లో సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, కుల సర్వే జరిపింది. పూర్తి నివేదిక బైటపెట్టకపోయినా, వెనుకబడిన కులాల జనాభా 56.33 శాతంగా (ముస్లిం బీసీల జనాభా 10.08 శాతంగా) నిర్ధారించింది. ఈ సర్వే ఫలితాలను 2025 ఫిబ్రవరిలో ప్రకటించి, ఆ నిర్ధారణకు తార్కిక ఫలితంగా స్థానిక సంస్థలలో బీసీల కోటా 42 శాతానికి పెంచడానికి ఒక ఆర్డినెన్సు తయారు చేసి జూలై 14న గవర్నర్ కు పంపింది. అప్పటికే జూన్ 25న స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయమని రాష్ట్ర హైకోర్టు ఆదేశం నేపథ్యంలోనే ఈ ఆర్డినెన్సు తయారు చేసి ఉండవచ్చు. ఒక నిర్ణీత పరిమితికి మించి రిజర్వేషన్ పెంచడం రాష్ట్రపతి ఆమోదించవలసిన నిర్ణయం గనుక గవర్నర్ ఆ ఆర్డినెన్సును ఆగస్ట్ 1న రాష్ట్రపతికి పంపారు. నెల రోజులు గడిచినా రాష్ట్రపతి నుంచి జవాబు లేదు. శాసనసభ సమావేశాలు జరగని రోజుల్లో విడుదల చేసే ఆర్డినెన్సును, సభ సమావేశాలు మొదలు కాగానే బిల్లుగా మార్చాలి గనుక, ఆగస్ట్ 31న ఆ ఆర్డినెన్సు యథాతథంగా బిల్లు రూపం ధరించి, శాసనసభ ఆమోదం పొంది, మళ్లీ గవర్నర్ సంతకానికి చేరింది. గవర్నర్ ఈ బిల్లును కూడా సెప్టెంబర్ లో రాష్ట్రపతికి పంపారు. ఇప్పటికీ ఆ బిల్లు మీద రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టంగా మారలేదు.
ఒకవైపు హైకోర్టు విధించిన సెప్టెంబర్ 30 గడువు సమీపిస్తుండగా, బీసీల కోటా తేలకుండా ఎన్నికలకు వెళ్లలేని స్థితి ఉండగా, సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. నం 9 ద్వారా అంతకుముందరి ఆర్డినెన్సులో, బిల్లులో ఉన్న విషయాన్నే మరొకరూపంలో ముందుకు తెచ్చింది. ఆర్డినెన్సు పోయి బిల్లు వచ్చె డడ్డంక డాం, బిల్లు పోయి జీవో వచ్చె డడ్డంక డాం అన్నట్టయింది. ఆ జి. ఓ. లోని 42 శాతం రిజర్వేషన్ ను సవాలు చేస్తూ కనీసం రెండు పిటిషన్లు రాగా, హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి, విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. తర్వాత మూడు రోజులకే రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది.
అంటే అక్టోబర్ 8-9 తేదీలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకూ, బీసీ రిజర్వేషన్ కూ కీలకం కానున్నాయి. ఒకవైపు గవర్నర్ – రాష్ట్రపతిలతో, అంటే కేంద్ర ప్రభుత్వంతో, మరొక వైపు హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తలపడుతున్నదా, లేక బీసీలను మోసగించే ప్రక్రియలో అందరికందరూ పాత్రధారులుగా తమ వంతు పాత్రలను అద్భుతంగా పోషిస్తున్నారా కూడా ఆ రెండు తేదీల్లో తేలుతుంది.
బీసీల జనాభా 56 శాతం అని గుండు గుత్త లెక్క చెప్పడమే తప్పు. బీసీ ముస్లింలతో సహా అంటే, ముస్లింలు కానీ బీసీల సంఖ్య 46 శాతం అంటున్నారన్నమాట. 1931 జనగణన తర్వాత కచ్చితమైన అంకె లేదు గనుక, ఇప్పటివరకూ అందరూ అది 52 శాతం నుంచి 60 శాతం వరకు ఎంతయినా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పూర్తి నివేదికను బైటపెట్టని ప్రభుత్వం ఒక కాకి లెక్క చెపుతున్నది. రాష్ట్ర జనాభాలో 17 శాతం షెడ్యూల్డ్ కులాలు, 10 శాతం షెడ్యూల్డ్ తెగలు గనుక, “అగ్రవర్ణాలు” అనబడే ఆధిపత్య కులాల జనాభా 17 శాతం ఉన్నదని చెప్పదలిచారా? అది పూర్తిగా అసంగతం. ఆధిపత్య కులాల జనాభా 10 శాతానికి ఎట్టి పరిస్థితిలోనూ మించదు.
సరే, ఆ గణాంకాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, 46 శాతం (లేదా ముస్లింలతో కలిపి 56 శాతం) ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిర్ణయానికి ఆధారం ఏమిటి? రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు 15, 8 శాతాలు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అది జనాభా ఆధారంగానే నిర్ణయించారు. ఆయా రాష్ట్రాలలో ఈ అంకెలు కాస్త అటూ ఇటూ కావచ్చు గాని, స్థూలంగా జనాభాకు తగిన వాటా అనే సూత్రాన్నే అమలు చేస్తున్నారు. మరి బీసీల విషయానికి వచ్చేసరికి జనాభా సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయడంలేదు? జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అనేది ఇవాళ వెల్లువెత్తుతున్న ప్రజాస్వామిక నినాదం.
అది అలా ఉంచి, ఇప్పుడు న్యాయస్థానం ముందున్న సమస్య ఇంకా చిత్రమైనది. ఎప్పుడో మూడు దశాబ్దాల కింద సుప్రీం కోర్టు ఇచ్చిన అర్థరహితమైన తీర్పులో మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించగూడదు అని ఒక సూత్రం తయారు చేసింది. దాని ప్రకారం, ఇప్పటివరకూ ఎస్సీ ఎస్టీలకు 23 శాతం పోగా, మిగిలిన 27 శాతం బీసీలకు ఇస్తున్నారు. (కొన్ని చోట్ల ఇతర కారణాలతో అది కూడా ఎగ్గొడుతున్నారు, అది వేరే విషయం). ఇప్పుడు 42 శాతం కోటా బీసీలకు ఇస్తే, మొత్తం 67 శాతం అవుతుందని, అందువల్ల అది సుప్రీం కోర్టు పరిమితి దాటుతుందనీ అభ్యంతరం చెపుతున్నారు.
కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రాజ్యాంగ సవరణ చేసి మరీ, ఆర్థికంగా బలహీన వర్గాలు అనే పేరు మీద ఆధిపత్య కులాలకే 10 శాతం అదనపు రిజర్వేషన్ కల్పించినప్పుడు, ఈ సుప్రీం కోర్టు పరిమితి ఎవరికీ గుర్తు రాలేదు. ఆ 10 శాతం ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ను టి ఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా 2021 నుంచీ అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు బీసీలకు వారి జనాభాకు తగిన, తగినంత కూడా కాదు, దాదాపు పది శాతం తక్కువ, వాటా అడిగినప్పుడు మాత్రమే సుప్రీం కోర్టు పరిమితి అనే అవరోధం కనబడుతున్నది.
ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకో, న్యాయస్థానాలకో సంబంధించిన సమస్య కాదు. నిజంగా జనాభాలో ఎవరి వాటా ఎంతో, విద్యలో, ఉద్యోగాలలో, పరిపాలనలో వారికి అంత వాటా ఉండాలనే కనీస ప్రజాస్వామిక సూత్రం మీద వీరిలో ఏ ఒక్కరికీ గౌరవం లేదు. ప్రతి ఒక్కరూ ఈ వర్గాన్ని, వర్గాలను బుజ్జగించడం ద్వారా తమకు ఏ రాజకీయ ప్రయోజనం దక్కుతుందా అని మాత్రమే చూస్తున్నారు. ఇది అందరికందరూ కలిసి చేస్తున్న వంచనా ప్రక్రియగా, ప్రహసనంగా, నాటకంగా మారిపోయింది.
ఇక్కడ నలబై సంవత్సరాల కిందటి అనుభవం పంచుకోవాలి. బీసీ కోటా అధ్యయనం కోసం నియమించిన మురళీధరరావు కమిషన్ సిఫారసుల ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు 1986 జూలై లో 44 శాతం రిజర్వేషన్ ప్రకటించారు. ఆ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఆధిపత్య వర్గాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి, హైకోర్టుకు వెళ్లగా, హైకోర్టు ఆ రిజర్వేషన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లవలసిన రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదు. అప్పీలుకు వెళ్లమని ముఖ్యమంత్రిని కోరడానికి వెళ్లిన పౌరసమాజ ప్రతినిధి బృందంతో ఆయన, “ఎందుకు బ్రదర్ అనవసరమైన రచ్చ? బీసీ సోదరులకు మేలు చేయాలనే సదుద్దేశం మనకు ఉందని బీసీ సోదరులకు తెలిసింది. అది చాలు గదా” అన్నారట!
శూన్యప్రియాల, శుష్క హస్తాల వంచనల లోకం ఇది. నాలుగు దశాబ్దాలు గడిచినా మారలేదు!





ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!