ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్న పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం గత ఏప్రిల్‌లో తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల సుప్రీంకోర్టులో ఈవీఎంలపై మరో వ్యాజ్యం దాఖలయి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. దీనిపై జనవరి 20వ తేదీతో ప్రారం భమయ్యే వారంలో విచారణ జరగనుంది. న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ప్రకటించింది. ఇదే తరహా ఉపశమనం కోరుతూ దాఖలైన పిటిషన్‌లను కోర్టు గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఎన్నికల విధానాలు, ఈవీఎంల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి, ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెరమీదకు తెస్తోంది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలైన తర్వాత కూడా అదే జరగుతోంది. ఈవీఎంల గురించి తన ఆందోళనా స్వరాన్ని పెంచింది. అయితే, ఎన్నికల సమగ్రతకు సంబంధించి ఈవీఎం అంశం ఒక్కటే లేదు.
ఇంకా చాలా అంశాలున్నాయని కాంగ్రెస్ తెలుసుకోవాలి. వాటి పట్ల భారత ఎన్నికల సంఘం స్వచ్ఛంగా వుండాల్సిన అవసరముంది. వీటిపై మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. వాస్తవానికి ఈవీఎంలను ఎలక్ట్రానిక్ ట్యాంపరింగ్ చేసే ముప్పు ఈ జాబితాలోకి రాదు. కాంగ్రెస్ ఓ తప్పుడు అంశంపై గొంతెత్తుతోంది. అది కూడా ఎంపిక చేసుకున్న అంశాలపైనే, అందులోనూ ఓడిపోయిన వాటిపైనే మాట్లాడుతోంది. ఈవీఎంలకు సంబంధించి అవకతవకల ముప్పు వుందని సూచించేలా పరోక్షంగా లేదా ముందుగానే ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ట్యాంపరింగ్ జరిగి వుంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ నేతలే కొందరు బహిరంగంగా అభిప్రాయపడ్డారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ కూడా ఈ ఆరోపణలతో తమకు సంబంధం లేదని విడగొట్టుకున్నారు. ఈవీఎంలలో చాలా కచ్చితంగా, తెలివిగా అవకతవకలకు పాల్పడ్డారని భావించేందుకు వీల్లేదు. ఎందుకంటే, కొన్ని రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించింది, మరికొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ లాజిక్ పని చేయడం లేదు. ఇదంతా కాకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయింది.
పైగా, ఈ ఫలితాలన్నీ మరీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర, జార్కండ్ ఫలితాలు సామాజిక, రాజకీయ సమీకరణలు ఎలా పనిచేసినవో సరిగానే వివరించాయి. ఈవీఎంలలో అవకతవకల గురించి పదే పదే లేవనెత్తడం ద్వారా ఎన్నికల సమగ్రతకు సంబంధించిన నిజమైన, తీవ్రమైన అంశాలు వెనక్కి పోతున్నాయి. ప్రతిపక్షాల పోలింగ్ ఏజెంట్లు లేని పోలింగ్ బూత్‌లలో, ఒక పార్టీ ఆధిపత్యమే వున్న చోట ఈవీఎంలను ఎత్తుకుపోవడానికి గల అవకాశాలనేవి వాటిలో ఒకటి. పోలింగ్ ముగిసే సమయంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదు కావడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇది సందర్భోచితమైన అంశంగా వుంది. ఈ ధోరణిని ఎన్నికల కమిషన్ సంతృప్తికరమైన రీతిలో వివరించడం లేదు. దీనికి తోడు పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు నమోదు కావడం, తొలగించడమనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోన్న ధోరణిగా వుంది. ఎన్నికల కమిషన్ దీన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది.
ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న దిల్లీలో, ముస్లిం ఓటర్ల పేర్లను ఎంపిక చేసి మరీ తొలగించినట్లు ఆరోపణలున్నాయి. యు.పి ఉప ఎన్నికల్లో, బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఊహించిన ఓటర్లను నిలువరించేందుకు పోలీసులు పక్షపాతంతో వ్యవహరించడం వివాదాస్పదమైంది. ఇక ఎన్నికల షెడ్యూలు అనేది మరో తీవ్రమైన అంశం. ఎన్నికల కమిషన్ దీనిపై పారదర్శకంగా వ్యవహరించడం లేదు. దేశంలో, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న దేశం ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించింది. దీనివల్ల లబ్ది పొందింది బిజెపి మాత్రమే. ఈ అంశాల్లో కొన్ని స్థానికమైనవి, మరికొన్ని బిజెపి, ప్రతిపక్షం మధ్య గల సామర్ధ్య అంతరం భారీగా వుండడానికి సంబంధించినవి. మరికొన్ని ఎన్నికల కమిషన్ కోర్టులో వున్నవి. ఎన్నికల సమగ్రతకు సంబంధించిన వాస్తవిక అంశాలపై ప్రతిపక్షం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వుంది. అంతేకానీ ఈవీఎంలపై భయాలు ఈ వాస్తవిక అంశాలను మరుగుపరిచేవిగా వుండకూడదు.
-ముప్పిడి సత్యం





