- గుర్తుండిపోయే మధుర స్మృతిగా రైలు ప్రయాణం
- ఇది కేవలం ప్రారంభం మాత్రమే..
దేశంలో త్వరలో మొదటి బుల్లెట్ రైలు
- 2014లో 4 నగరాల్లో మెట్రోలు.. ఇప్పుడు.. 17 నగరాలకు విస్తరణ
- వేల సంఖ్యలో ఆర్వోబిలు, అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం
- చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ
- హాజరైన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 : వికసిత భారత్ సంకల్పంలో రైల్వేల అభివృద్ధి కీలకమని, రైల్వే ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధురస్మృతిగా నిలిచిపోయేలా చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌తోపాటు.. జమ్మూకశ్మీర్, ఒడిశా రాష్ట్రాల్లో వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్‌గా సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా గురుగోవింద్ సింగ్ ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగోవింద్ సింగ్ ఆలోచనలు, వారి జీవితం మనకు స్ఫూర్తి దాయకమని అన్నారు. ఇక రైల్వేల గురించి మాట్లాడుతూ.. 2025 ప్రారంభం నుంచే భారతదేశం కనెక్టివిటీ వేగాన్ని పెంచిందన్నారు. దిల్లీ ఎన్సీఆర్ లో నమో భారత్ రైలు పనితీరును పరిశీలించానని, దిల్లీ మెట్రోకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ప్రారంభించినట్లు చెప్పారు. మన దేశంలో వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వొచ్చాయని తెలిపారు. ఉత్తరాన జమ్మూకశ్మీర్, తూర్పులో ఒడిశా.. దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన సందర్భమిది అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో ఆధునిక పురోగతికి బాటలు పడ్డాయి.
ఇకపై దేశమంతా అడుగులో అడుగేస్తూ ముందుకెళ్తోంది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రం అమల్లో విశ్వాసపూరితంగా ముందుకెళ్తోందన్నారు. ఈ సందర్భంగా ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఒడిశా ముఖ్యంత్రి మోహన్ చరణ్ మాఝీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వికసిత్‌భారత్ సంకల్పంలో రైల్వేల అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా దేశంలో రైల్వేల పురోగతి వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. తాము నాలుగు అంశాలమీద రైల్వేల పురోగతి చేస్తున్నాం. రైల్వేల మౌలికసవతుల ఆధునీకరణ, ప్రయాణికులకు ఆధునిక వసతులు, మారుమూల ప్రాంతాలకు అనుసంధానత, రైల్వేల ద్వారా ఉపాధి కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం అనే అంశాలపై ముందుకెళ్తున్నామన్నారు.
ఇవాళ్టి ఈ మూడు కార్యక్రమాల ద్వారా.. 21వ శతాబ్దంలో అవసరమైన మౌలికవసతుల కల్పన జరుగుతోంది. కొత్త ఉపాధి కల్పన కూడా పెరుగుతుంది. 2014లో భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే సంకల్పంతో పని ప్రారంభించాం. వందేభారత్ రైళ్ల సౌకర్యం, అమృత్ భారత్, నమో భారత్ రైళ్ల సౌకర్యం.. భారతదేశానికి కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాం.
నేడు ప్రజలకు ఎక్కువ దూర ప్రయాణాలు సైతం తక్కువ సమయంలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా మేం పనిచేస్తున్నాం. వందేభారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూసి చాలా సంతోషం కలిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రైల్వేల ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధుర స్మృతిగా నిలిచిపోయేలా చేస్తాం. రైల్వేల కనెక్టివిటీ కూడా పెంచుతున్నాం. 2014 వరకు దేశంలో 35% రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. నేడు దాదాపుగా 100 ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకోబోతున్నాం. రైల్వేల రీచ్ ను కూడా విస్తృతం చేస్తున్నాం. 30 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ కొత్త రైళ్లు వేశాం. వేల సంఖ్యలో రైల్ ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేశాం. డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ నిర్మిస్తున్నాం. దీని ద్వారా సామాన్య ట్రాక్ లపై ఒత్తిడి తగ్గి.. ప్రజల ప్రయాణ సమయం తగ్గేందుకు వీలుంటుంది.అని మోదీ తెలిపారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, రైల్వే స్టేషన్ల పై సోలార్ ప్యానెళ్ల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి వంటి నిర్ణయాలను విజయవంతంగా అమలుచేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన.. ముడిసరుకులను.. అవి అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి చేరవేస్తున్నాం. దీని వల్ల పారిశ్రామికీకరణకు కూడా ప్రోత్సాహం అందుతోంది.
జమ్మూ డివిజన్ ద్వారా.. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలు, లేహ్ లద్దాఖ్ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా లాభం చేకూరుతోంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ ను అనుసంధానం అవుతుంది. ఈ ప్రాంతంలో కీలకమైన చారిత్రాత్మక బ్రిడ్జ్ ల నిర్మాణం పూర్తయింది. జగన్నాథుడి ఆశీస్సులతో ఒడిశాకు సముద్ర తీరంతోపాటు.. విస్తృతమైన ఖనిజాల అవకాశాలున్నాయి. అందుకోసం.. అక్కడ రైల్వే అనుసంధానత కు సంబంధించి 70వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఒడిశాలో ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించిన అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతంగా సాగుతున్నాయి. పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు బాటలు పడతాయి. మరీ ప్రత్యేకంగా దక్షిణ ఒడిశా ప్రాంతంలోని ప్రజలకు కొత్త డివిజన్ ఏర్పాటు ఎంతో ఉపయుక్తం కానుంది.
తెలంగాణలోని చర్మినల్ టర్మినల్ ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి బాటలు పడతాయి. స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ స్టేషన్ సౌర విద్యుదుత్పత్తి చేస్తుంది. ప్రయాణికులకు, పరిశ్రమలకు ఈ చర్లపల్లి టర్మినల్ ఎంతో ఉపయుక్తం కానుంది. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 150కు చేరింది. 2014లో 4 నగరాల్లో మెట్రో ఉంటే.. ఇప్పుడు.. 17 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు మెట్రో సేవలు విస్తరిస్తాం. రోడ్ నెట్ వర్క్ కూడా చాలా వేగంగా ముందుకెళ్తోందన్నారు. అనుసంధానత విషయంలో మేం రాజీపడకుండా పనిచేస్తున్నామని, మనమంతా కలిసి ఈ దిశలో మరింత వేగంగా ముందుకెళ్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.