యువత దృక్ఫథం మారాలి

“ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియలు మానవ నిర్మిత అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు. మనిషి సృష్టించిన టెక్నాలజీని మాయచేసి, వైరస్ లను ప్రవేశపెట్టి సాంకేతికతో నడుస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రమాదం లేకపోలేదు. ఏ.ఐ తో రాగల ముప్పును క్షణాల్లో నిలువరించ గల సామర్థ్యం లేక పోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్ మరియు కంప్యూటర్ల లోకి వైరస్లు ప్రవేశించి, డేటాను విచ్ఛిన్నం చేయడం,వివిధ వ్యవస్థలు స్తంభించి పోవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధతో నడిచే కంప్యూటర్ల వలన, యంత్రాల వలన భారీ విపత్కర పరిణామాలు సంభవించగలవని ఆందోళన నెలకొని ఉంది.”
యువత ఉద్యోగ భద్రతపై కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం గగనకుసుమంగా మారిన నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగాలపై కూడా వేటు పడనుందా? ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యువత పాలిట శాపంగా మారనుందా? అనే మీమాంస బయలు దేరింది.ఒకప్పుడు టెకీల గురించి,వారి సంపాదన గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. టెక్ నగరాలంటే ఎంతో మక్కువ ప్రదర్శించే రోజులవి. వ్యవసాయ రంగం  తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, కుటుంబ బాధ్యతలను  నెట్టుకురావడం కష్టసాధ్యమైన సందర్భంలో యువత కొంతమంది మధ్యవర్తుల సాయంతో  అమెరికా పయనమై, కొంతకాలం పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి,తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసి ఎంతో కష్టపడి ఆర్ధికంగా నిలదొక్కుకుని, తల్లి దండ్రులకు డబ్బు పంపిస్తూ, వారు  ఆర్ధికంగా  పరిపుష్ఠి కావడానికి దోహదం చేసేవారు.
అప్పట్లో సాఫ్ట్ వేర్ రంగం స్వర్ణ యుగాన్ని చవి చూసింది. బెంగుళూరు,హైదరాబాద్,చెన్నై,పూనే వంటి నగరాల్లో టెక్ కంపెనీలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. అయితే ఇదంతా ఒక గతం. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. సాఫ్ట్ వేర్ రంగం సంక్షోభాన్ని చవిచూస్తున్నది. ఒకప్పుడు వందలాది మంది సాఫ్ట్ రంగం వైపు పరుగెడితే, నేడు భారత్ లో కూడా లక్షలాది మంది సాఫ్ట్ వేర్ రంగం పట్ల మక్కువ చూపుతున్నారు.  వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తున్నాం. కంప్యూటర్ల వైపు యువత ఇంకా పరుగులు తీస్తున్నది.
       సాంకేతిక రంగంలో అనేక మార్పులు సంభవించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఎఐ’ చాప క్రింద నీరులా  చొచ్చుకు వచ్చింది. కృత్రిమ మేథను అందిపుచ్చుకుని, అందులో ప్రావీణ్యత సంపాదించగలిగితేనే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు నిలబడతాయి. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ కంపెనీలు కృత్రిమ మేథను ప్రవేశపెట్టాయి. మరి కొద్ది సంవత్సరాల్లో కృత్రిమ మేథ సాంకేతిక రంగాన్ని శాసించబోతున్నది. ఇప్పటికే ఎఐ  సాఫ్ట్ వేర్ రంగం పై తన ప్రభావాన్ని,ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టింది.అమెరికాలో టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లో తీసుకోవద్దని ఇప్పటికే ట్రంప్ హుకుం జారీ చేయడం జరిగింది.  ఇదే సందర్భంలో ఏఐ వలన ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకంగా మారింది.గూగుల్,మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.  అయినప్పటికీ యువతలో ఇంకా సాఫ్ట్ వేర్ పట్ల మక్కువ పోకపోవడం వాస్తవాన్ని గ్రహించక చేస్తున్న తీవ్రమైన తప్పిదం.  నకిలీ సర్టిఫికెట్లతో,ఫేక్ ఎక్స్ పీరియన్స్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించడం ఇక సాధ్యపడదు.
     రోబో శకం ప్రారంభమైంది. మానవ శక్తి స్థానంలో యాంత్రిక శక్తి అత్యంత ఖచ్చితత్వంతో,వేగవంతంగా పనులు చేస్తూ సత్ఫలితాలు సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది మంది చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్  సహాయంతో కేవలం ఒక్కరితో సుసాధ్యం చేసే విప్లవాత్మక మార్పులు చోటు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా గతంలో మాదిరిగా బట్టీ చదువులతో, మార్కుల కోసం కుస్తీ పడడం, ఇందు కోసం  లక్షలాది రూపాయలను కిండర్ గార్డెన్ స్థాయి నుండే  విద్యార్థులపై  వెచ్చించడం సహేతుకం కాదు. ఉన్నతమైన, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి.వివిధ రంగాల్లో నెలకొన్న  సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, అధిక ఖర్చులకు కళ్లెం వేయడం, సమయాన్ని ఆదా చేయడం, ఉత్పాదకత పెంచడం, అలసట ఎరుగని రోబోలతో 24 గంటలు పని చేయించడం కృత్రిమ మేథ వలన సుసాధ్యం కాగలదు.కృత్రిమ మేథ వేగవంతమైన ప్రపంచంలో ఉత్తమమైన సేవలను అందిస్తుంది. ఏఐ ప్రపంచం లోకి ఇప్పటికే అడుగులు పడ్డాయి.
ఇక  ఏఐ  వలన లాభ నష్టాలు 
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియల వలన సాంకేతికత కు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడుతుంది.కమ్యునికేషన్,రవాణా,వైద్య తదితర రంగాల్లో  గణనీయమైన మార్పులు సంభవించి ఆర్ధిక ఎదుగుదల,నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయి.సాంకేతికత సామర్ధ్యంతో వ్యాపారం మెరుగు పడుతుంది, రోగులను ఖచ్చితమైన ప్రమాణాలతో డయాగ్నోసిస్ చేయడం,సత్వర చికిత్సలు,శస్త్రచికిత్సలు  చేయడం,ఇంటి వద్ద నుండే వైద్య పరీక్షలు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. కృత్రిమ మేథ  ప్రభావంతో  రాగల రోజుల్లో ప్రతిభావంతులైన యువత ఉపాధికి ఏ విధమైన నష్టం జరగదనే అభిప్రాయముంది. నైపుణ్యత లేని చదువులతో డిగ్రీలు సంపాదించి, కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా మారుతున్న వారికి భవిష్యత్తులో కృత్రిమ మేథ ఒక శరాఘాతంలా పరిణమించవచ్చు. కృత్రిమ మేథ వలన ఉద్యోగావకాశాలు తగ్గి, రోబోల ఆధిపత్యం మొదలయ్యే అవకాశం ఉంది.మానవ భద్రతకు, వివిధ దేశాల రక్షణ వ్యవహారాలకు కృత్రిమ మేథ వలన ఒక విధంగా లాభం,మరొక విధంగా నష్టం జరిగే అవకాశ ముందనే వార్తల్లో నిజమెంతో తెలియాలి. భవిష్యత్తులో మనం ఉపయోగిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాలు,ఇతర రవాణా వ్యవస్థలు ఏ.ఐ సహకారంతో నడిచే అవకాశాల వలన భారీ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముంది.
    ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియలు మానవ నిర్మిత అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు. మనిషి సృష్టించిన టెక్నాలజీని మాయచేసి, వైరస్ లను ప్రవేశపెట్టి  సాంకేతికతో నడుస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రమాదం లేకపోలేదు. ఏ.ఐ తో రాగల ముప్పును క్షణాల్లో  నిలువరించ గల సామర్థ్యం లేక పోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్ మరియు కంప్యూటర్ల లోకి వైరస్లు ప్రవేశించి, డేటాను విచ్ఛిన్నం చేయడం,వివిధ  వ్యవస్థలు స్తంభించి పోవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధతో నడిచే కంప్యూటర్ల వలన, యంత్రాల వలన భారీ విపత్కర పరిణామాలు సంభవించగలవని ఆందోళన నెలకొని ఉంది.  మనిషి మాయమై మరబొమ్మలే ప్రాణం పోసుకుని, మనిషి జీవితాన్ని చక్రబంధంలో ఇరికించే ముప్పు పొంచి ఉంది.
కీలక వ్యవస్థలు కృత్రిమ మేధతో పని చేస్తే, కంప్యూటర్ ప్రోగామింగ్ లో లోపాలున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా సంభవించే పరిణామాలు ఊహాతీతం.రాబోయే దశాబ్ద కాలంలో కృత్రిమ మేధ  వలన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది  ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందనే నిపుణుల వాదనలో నిజం లేక పోలేదు.కృత్రిమ మేధ  ప్రవేశంతో టెక్నాలజీ రూపు రేఖలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. ప్రపంచ మానవ జీవన క్రమంలో    అనేక విప్లవాత్మక మార్పులు  సంభవించే అవకాశాలున్నాయి.  కాబట్టి  కృత్రిమ మేధ  వలన తలెత్తే పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కృత్రిమ ఎం , మేధ  మానవ జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చాలి.  ఉద్యోగ అవకాశాలను పోగొట్టకుండా, పెరుగుతున్న విద్యావంతుల ఉపాధికి నష్టం లేకుండా చూడాలి. ఎంతవరకు కృత్రిమ మేధ  అవసరముందో, అంతవరకే వినియోగించాలి. ఏఐ  ప్రవేశం  కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా  మారకూడదు. మానవ శక్తికి వీలు కుదరని చోట్ల, ప్రమాదకరమైన పనుల్లోను, ఇతర సంక్లిష్టమైన కార్యకలాపాల్లోను  కృత్రిమ మేధ ను వినియోగించి, అభివృద్దిని సాధించవచ్చు. ఈ దిశగా  కంప్యూటర్ రంగంలోని నిష్ణాతులు, ఏ. ఐ నిపుణులు  తమ ఆలోచనా పరిధిని విస్తృతం చేయాలి.యువత దృక్ఫథం కూడా మారాలి.

  – సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్ )             
తూ.గో.జిల్లా
ఆంధ్రప్రదేశ్

   మొ9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *