స్త్రీవాద తెలుగు సాహిత్యం ఎన్నెన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ చాలాదూరం ప్రయాణించింది. హేళనలు, వెటకారాలు అన్నిటినీ సహిస్తూ, కొన్ని సార్లు తిప్పి కొడుతూ వచ్చింది తప్ప ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోలేదు. అనేక రూపాలు ధరిస్తూ స్త్రీ వాద సాహిత్యం ఇపుడు పోస్ట్ లిబరలైజేషన్ దశకు ఉందని భావించవచ్చు. అర్బన్ దృక్పథం ప్రభావం, వర్క్ ప్లేస్ లో జెండర్ పరంగా ఎదురయ్యే సమస్యలు,సంప్రదాయ, మోడరన్ ప్రపంచాల మధ్యన ఇరుక్కోవలసి రావడం వంటి వాటిని పోస్ట్ లిబరలైజేషన్ అంశాలుగా చూడవచ్చేమో.
స్త్రీల బాధల్ని అక్షరీకరించడం నుంచి, తమకేం కావాలో సాధికారకంగా ప్రకటించే దశకు స్త్రీవాద సాహిత్యం చేరింది. స్త్రీల సెక్సువాలిటీ, మానసిక సంక్లిష్టతలు, తమ శరీరం మీద తమ హక్కుల ప్రకటన, ప్రేమ, పెళ్ళి రాజకీయాలు, స్త్రీ పురుషుల విషయంలో సమాజం ఆడే నాటకాలు.. ఇవన్నీ ఒకప్పుడు రాయడానికి వెనుకాడే అంశాలుగా ఉన్నా, ఇప్పుడవి స్త్రీవాద సాహిత్యంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కులం, వర్గం, సెక్సువాలిటీ, పరంగా కూడా స్త్రీల ఐడెంటిటీని స్పష్టంగా ప్రకటిస్తున్నది స్త్రీవాద సాహిత్యం. ప్రస్ఫుటంగా స్త్రీల రచనల్లో కనిపిస్తున్న మార్పు, దళిత, గ్రామీణ, శ్రామిక స్త్రీలు కూడా తమ గొంతుల్ని వినిపించే స్థాయికి చేరడం. గోగు శ్యామల, జూపాక సుభద్రల స్వరాలివే కదా స్త్రీవాద సాహిత్యంపై పైకి అభినందనలు ప్రకటిస్తూ, వెనుక నవ్వుకునే పురుష స్వరాలను పట్టించుకోవడం, విలువ ఇవ్వడం ఎన్నడో మానేశారు రచయిత్రులు.





