“వరస కరువులతో బుక్కెడు బువ్వ కోసం తెలంగాణా ప్రాంతం నుండి మూడున్నర శతాబ్దాల క్రితం ముంబయికి (అప్పటి బొంబాయి) వలస వెళ్ళి, అక్కడ నిలదొక్కుకొని, తాము జీవితంలో ఎదగడమేకాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య రంగాల్లో శిఖరాగ్రాలను అందుకున్న వారెందరోఉన్నారు.. కానీ, ప్రాంతీయ వివక్షల వల్లనో, పాలకుల ఆధిపత్య నిర్లక్ష్యం వల్లనో అలాంటి తెలంగాణా దివిటీలను కూడా మనం క్రమేపీ మరిచిపోతున్నాం..”
ఇరుగు పొరుగు
అట్లా మనం మరిచిపోత్నున అద్భుత వ్యక్తుల్లో శీలం సయాజీరావ్ ఒకరు..!
శీలం సయాజీరావు 18 మే, 1896లో ముంబైలోని కమాటిపురాలో జన్మించారు. వీరి స్వస్థలం నాగ్‌పూర్ జిల్లాలోని కార్ఖేలి గ్రామం. అప్పట్లో నాగ్‌పూర్ జిల్లా నిజాం ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. ‘పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్నట్లు,’ తన 12 ఏట విల్సన్ హై స్కూల్‌లో చదువుతున్నప్పుడే వి.ఆర్. బుసరథ్ లాంటి మిత్రబృందంతో కలిసి ‘తెలుగు బాలక్ జ్ఞానోత్తేజక్ సమాజ్’ అనే సంస్థను స్థాపించి, వ్యాసరచన, వ్యక్తృత్వ, మేధోపర, క్రీడాపోటీలను నిర్వహించేవారు. తెలుగువారన్నా, తెలుగు సాహితీ సంస్కృతులన్నా చెవికోసుకునే సయాజీరావ్, 1917లోనే అదే మిత్రబృందం సహకారంతో ‘తెలుగు మిత్ర’ అనే మాసపత్రికను వెలువరించారు. ఆ పత్రిక ఎక్కువ కాలం నడవలేకపోయినప్పటికీ, పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. బి.ఏ., ఎల్.ఎల్.బి. చదివిన శీలం సయాజీరావు మేధావిగా, మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారు.
గాంధీజీ 64వ జన్మదినోత్సవం సందర్భంగా, అక్టోబర్ 2, 1932 నాడు, అంటరాని తనం నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా వారం రోజులు దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. ఆ దీక్షల ప్రభావం కమాటిపురాలోని తెలుగు ప్రముఖలపై కూడా పడిరది. ఆ కాలంలో కమాటిపురంలో మున్నూరు కాపులు నిర్మించిన ఏడు దేవాలయాలు ఉండేవి. ఈ దేవాలయాల్లోకి కూడా అస్పృశ్యుల్ని అనుమతించాలనీ మరో తెలంగాణ మూలాలున్న ముంబై ప్రముఖుడు పుప్పాల శంకర్‌రావు ప్రతిపాదించాడు. పుప్పాల శంకర్‌రావు, శీలం సయాజీరావ్ చొరవతో గాంధీజీ పుట్టిన రోజు నాడే పండిత మదన్‌మోహన్ మాలవీయ అధ్వర్యంలో తొలిసారిగా అస్పృశ్యులకు మందిర ప్రవేశం కలిగించారు. ఈ రకంగా సామాజిక సమతుల్యత కోసం యుక్తవయస్సులోనే సయాజీరావ్ కృషి చేశారు.
ముంబయి సమీపంలోని కళ్యాణ్ నగరంలో నిర్వహించిన ‘సామాజిక పరిషథ్’ సమావేశాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనీ తీర్మానించారు. అయితే ఈ తీర్మానాలతో మద్యపాన నిషేధం అమలు కావడం చాలా కష్టమనీ, అందుకోసం సమిష్ఠిగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన సయాజీరావ్ అందుకోసం నడుం బిగించారు. పైమెరుగులకంటే మూలాలను నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో మద్యం తయారుదార్లపై, మద్యవిక్రయ కేంద్రాలకు వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించారు. సమాజాన్ని భ్రష్టుపట్టించేవాటిలో మద్యపానం ఒకటని సయాజీరావ్ బలంగా నమ్మేవాడు. అందుకే మద్యపాన నిషేధ అమలుకోసం ఏర్పాటు చేసిన ‘సమారోహ సమితి’ అధ్యక్షుడిగా ఆయననే నియమించారు.
ఇటు సామాజిక సేవలతో పాటు అటు రాజకీయాల్లో కూడా సయాజీరావ్ క్రియాశీలకంగా ఉండేవారు.
రాజకీయ రంగంలో..
మొదట్నుంచి రాజకీయ రంగం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన శీలం సయాజీరావు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సమర్థవంతుడైన, నిజాయితీ గల నాయకుడని గుర్తింపు పొందారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రత్యేక మహారాష్ట్ర ఏర్పడకముందు ‘స్టేట్ ఆఫ్ బాంబే’ కి ఆయన స్పీకర్‌గా వ్యవహరించారు. 21 నవంబర్ 1956 నుండి 16 జూన్ 1957 వరకు ఆయన స్పీకర్‌గా కొనసాగారు. ఆ తరువాత 1 మే, 1960లో మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా మొదటి స్పీకర్‌గా శీలం సయాజీరావే ఎన్నికయ్యారు. ఆయన హయాన్ని మహారాష్ట్ర శాసనసభ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఇప్పటికీ పేర్కొంటారు. ఆయన హయాంలోనే మహారాష్ట్ర పునర్నిర్మాణానికి చెందిన ఎన్నో మహత్వపూరితమైన తీర్మానాలు చేయబడ్డాయి. ఆయన కాంగ్రెస్ తరఫున ఎన్నికైనప్పటికీ, ఏనాడుకూడా ఏ పార్టీకి చెందిన సభ్యుడు కూడా ఆయన పై పక్షపాత ఆరోపణలు చేయలేదు. శాసన సభలో ఆయన మాటకు ఎదురుండకపోయేది. అప్పట్లో అన్ని పార్టీలవారు రాజకీయాలకు అతీతంగా మహారాష్ట్ర నిర్మాణం కోసంపాటు పడే మేధావులే శాసనసభ్యులుగా ఉండేవారు. చర్చలు తీవ్రాతితీవ్రంగా జరిగినప్పటికీ చివరగా స్పీకర్ సయాజీరావు ఆర్డర్‌తో అంతా సద్దుమణిగేది. అసందర్భ, అనవసర ప్రసంగాన్ని సయాజీరావ్ అడ్డుకునేవారు. ఎంత గొప్పనాయకుడైన ఆయన ‘కూర్చొండి’ అంటే ఎదురు చెప్పకుండా కూర్చోవల్సిందే..!
అప్పట్లో కూడా శాసన సభలో అవినీతి పై చర్చలు జరిగేవి. అవినీతి ఆరోపణలు ఎదొర్కుంటున్న సభ్యుడు స్పీకర్ సయాజీరావు ముందుకు రావడానికి వణికిపోయేవాడు. నీతి నియమాలకు, క్రమశిక్షణకు సయాజీరావు పెట్టింది పేరుగా ఉండేవారు. అందుకే సయాజీరావ్ పట్ల అందరు సభ్యులు ఎంతో గౌరవంగా మెదిలేవారు. ‘దైనిక్ మరాఠా’ సంపాదకులు, శాసన సభ్యులు ఆచార్య ఆత్రే ‘స్పీకర్ పదవిలో ఉన్నందువల్ల సయాజీరావుకు గౌరవం లభిస్తోందా.. లేక సయాజీరావ్ కూర్చున్నందువల్ల ఆ పదవికి గౌరవం లభిస్తుందా..? అన్నది తేల్చుకోవడం చాలా కష్టం..’ అని తన వ్యాసంలో పేర్కొన్నారు. సభాగౌరవాన్ని కాపాడడం అంటే రాష్ట్ర గౌరవాన్ని కాపాడడం అనేది సయాజీరావ్ నమ్మిన సిద్ధాంతంగా ఉండేది.
మహారాష్ట్ర శాసనసభ కార్యనిర్వహణ మరాఠీ భాషలోనే సాగాలనీ, అందుకోసం అవసరమైన పదప్రయోగాల డిక్షనరీని రూపోందించాలనీ సయాజీరావ్ శీలం ప్రతిపాదించారు. ఆయన కృషి వల్లే ‘పద్‌నామ్ కోశ్’, ‘ప్రశాసన్ వాక్యప్రయోగ్’ అనే పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. ఆ పుస్తకాల ఆధారంగానే 1966 నుండి మహారాష్ట్ర శాసనసభ కార్యకలాపాలు మరాఠీలో ప్రారంభమయ్యాయి. స్పీకర్ సయాజీరావ్ చూపించిన చొరవకు, ఆయన చేసిన కృషిని మెచ్చుకుంటూ శాసనసభలో స్పీకర్ అభినందన తీర్మానం ఆమోదించి ఆయనను గౌరవించారు. శాసనసభ్యుల సౌకర్యం కోసం ఎమ్మెల్యే హాస్టల్‌లో క్యాంటీన్ నిర్మాణంకూడా సయాజీరావ్ ప్రయత్నం వల్లే నెరవేరింది.
స్వరాజ్యమే నా జన్మహక్కు అన్న లోకమాన్య బాలగంగాధర తిలక్ అంటే సయాజీరావుకు ఎంతో అభిమానం. తిలక్ అంత్యక్రియలు జరిగిన గిర్‌గావ్ బీచ్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలనీ యువకుడైన శీలం సయాజీరావ్ కాంగ్రెస్ కమిటీలో ప్రతిపాదించాడు.ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ సయాజీరావ్ వెనుకంజ వేయకపోవడంతో ఆయనకు ఒక సంవత్సర కాలం కారాగారా శిక్ష విధించారు. చివరకు 1922లో అక్కడ తిలక్ విగ్రహస్థాపనకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది. విగ్రహప్రతిష్ఠాపన కమిటీకి కార్యదర్శిగా ఉన్న సయాజీరావ్ దివారాత్రులు శ్రమించి అనుకున్న సమయంలో విగ్రహాన్ని స్థాపించిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నారు.
ముంబయి ఉపనగరమైన బాంద్రా (ప్రస్తుతం ఠాక్రేల నివాసస్థలం..) ప్రాంతం అప్పట్లో సముద్ర తీర పాయలతో నిండి చిత్తడిచిత్తడి గా ఉండేది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి అక్కడ జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే సంస్థను స్థాపించేందుకు సయాజీరావ్ ఎంతో కృషి చేశారు. కళాకారులకు, పాత్రికేయులకు, రచయితలకు ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టించి ఇవ్వడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. బాంద్రా ప్రాంతాన్ని ఒక కళాకేంద్రంగా వికసింపచేయాలన్నదే సయాజీరావ్ సంకల్పంగా ఉండేది. ఆయన కల నెరవేరక ముందే ఆయనను పాండిచ్చేరి గవర్నర్‌గా నియమించడం జరిగింది. ఆయన కల నెరవేరలేదు.
( మిగతా రేపటి సంచికలో ..)





