“హరిత శక్తి ” వైపుగా తెలంగాణా అడుగులు ..!

తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ రంగంలోనే కాకుండా, ఇంధన రంగంలో కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గ్రీన్ ఎనర్జీ (హరిత శక్తి) కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ నుండి పర్యావరణ హితమైన సౌర, పవన శక్తి వైపు మళ్లడం ఇప్పుడు ఒక అవసరంగా మారింది. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ పరివర్తన, దాని ప్రభావం మరియు భవిష్యత్తు పరిశోధనల అవశ్యకతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. విద్యుత్ లభ్యత, ఖర్చు వ్యవసాయ ఉత్పాదకతను శాసిస్తాయి. గ్రీన్ ఎనర్జీ ప్రవేశంతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వొస్తున్నాయి: ప్రభుత్వ  పథకాల ద్వారా రైతులు తమ పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల పగటిపూట ఉచిత విద్యుత్ అందడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు… గ్రామాల్లో ఏర్పాటు చేసే రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు సోలార్ విద్యుత్‌తో నడవడం వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సోలార్ ప్యానెళ్ల అమరిక, నిర్వహణ మరియు బయో-గ్యాస్ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక ఉపాధి కూడా లభిస్తుంది.
   బొగ్గు నుండి సోలార్ వైపు పయనం ప్రస్తుత కాలంలో  ఒక అనివార్య మార్పు. తెలంగాణలో సింగరేణి వంటి సంస్థలు బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు కాలుష్యం దృష్ట్యా ప్రభుత్వం డికార్బనైజేషన్  వైపు అడుగులు వేస్తోంది. సాంప్రదాయ ఇంధన వనరుల తో  బొగ్గు కాల్చడం  వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ వంటి విషవాయువులు విడుదలవుతున్నాయి. అది ప్రజారోగ్యం పై  ప్రతికూల ప్రభావం పడుతుంది. పైగా  బొగ్గు నిల్వలు శాశ్వతం కావు. భవిష్యత్తు తరాల ఇంధన భద్రత కోసం ప్రత్యామ్నాయాలు వెతకక తప్పదు.తెలంగాణ భౌగోళికంగా అధిక ఉష్ణోగ్రత  ప్రాంతం. ఇది సౌరశక్తి ఉత్పాదనకు ఎంతో అనుకూలం. రామగుండంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ (నీటిపై తేలే సౌర విద్యుత్ కేంద్రం) దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ఇది భూమి వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, నీటి ఆవిరిని కూడా అరికడుతుంది.
    గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాదు, వ్యర్థాల నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నగరాలు మరియు గ్రామాల నుండి వొచ్చే తడి వ్యర్థాలను  ఉపయోగించి బయో-సిఎన్‌జి  మరియు విద్యుత్ తయారు చేయడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. సోలార్ ప్యానెల్స్, లిథియం బ్యాటరీల కాలపరిమితి ముగిసిన తర్వాత అవి పర్యావరణానికి ముప్పుగా మారకుండా వాటిని రీసైకిల్ చేసే సాంకేతికతపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. . స్థిర శక్తి ఉత్పత్తి కోసం  గ్రీన్ ఎనర్జీ రంగంలో నిరంతర పరిశోధనలు   జరిగితేనే ఇది దీర్ఘకాలంలో విజయవంతమవుతుంది. ఉదాహరణకు  సూర్యుడు లేని సమయంలో కూడా విద్యుత్ సరఫరా చేయడానికి సమర్థవంతమైన, తక్కువ ధర కలిగిన బ్యాటరీల (ఉదా: సాలిడ్ స్టేట్ బ్యాటరీస్) తయారీపై పరిశోధనలు జరగాలి.
 నీటి అణువులను విడగొట్టి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయడం భవిష్యత్తులో రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేయగలదు. ప్రతి గ్రామం తనకై తాను విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ‘స్మార్ట్ మైక్రో గ్రిడ్స్’ అభివృద్ధి చేయాలి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను “గ్రీన్ ఎకానమీ”గా మార్చడం వల్ల పర్యావరణానికే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి దోహదపడుతుంది. బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, సోలార్ మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి వనరుల వైపు మళ్లడం ద్వారా రాష్ట్రం ఇంధన స్వయం సమృద్ధిని సాధించగలదు. ప్రభుత్వ ప్రోత్సాహం, శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు ప్రజల భాగస్వామ్యం తోడైతే తెలంగాణ హరిత శక్తికి చిరునామాగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం 2025లో ప్రకటించిన “క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ” ద్వారా రాష్ట్రం ఇంధన రంగంలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసేలా లక్ష్యాలను నిర్దేశించుకుని  రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *