ఏఐ స‌ద‌స్సులో తెలంగాణ మెరుపులు!

దేశ‌రాజ‌ధాని ప్ర‌గ‌తి మైదాన్‌లోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన‌  కృత్రిమ మేధ (ఏఐ) స‌దస్సులో తెలంగాణ ప్ర‌భుత్వం చాలా చురుగ్గా పాల్గొని, ఏఐ గ‌వ‌ర్నెన్స్ కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బ్లూ ప్రింట్‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో విజ‌యం సాధించింది. ఈ రంగంలో భాగ‌స్వాముల‌ను ఆక‌ర్షించ‌డంలో విజ‌యం సాధించ‌డ‌మే కాదు, ‘ఏఐ-రెడీ ‘ రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డం విశేషం. నిజానికి ఈ స‌ద‌స్సు ఈనెల 16 నుంచి 20 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉంది. కానీ దీనికి వెల్లువెత్తిన డిమాండ్ నేప‌థ్యంలో 21వ తేదీన కూడా కొన‌సాగిస్తుండ‌టం విశేషం.  ఈ సంద‌ర్భంగా మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఏడ‌బ్ల్యుఎస్ వంటి అంత‌ర్జాతీయ స్థాయి టెక్‌దిగ్గ‌జాల‌తో పాటు, వివిధ విద్యాసంస్థ‌ల‌తో ఏఐ మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించి 26 అవ‌గాహ‌నా ఒప్పందాల‌ను కుదుర్చుకుంది.

హైద‌రాబాద్‌-జ‌కార్తా టెక్నాల‌జీ స్కిల్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కారిడార్ ఏర్పాటుకు ఇండొనేసియా ప్ర‌తినిధుల‌తో జ‌రిపిన స‌మావేశం ఇందులో ప్రధానంగా చెప్పుకోద‌గింది. ఈ స‌మావేశంలో ప‌ర‌స్ప‌ర సాంకేతిక మార్పిడి, స్టార్ట‌ప్‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. యు.ఎస్‌-ఇండియా బిజినెస్ కౌన్సిల్ స‌మావేశంలో ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు పెట్టుబ‌డుల‌కు తెలంగాణ స్వ‌ర్గ‌ధామంగా ఏవిధంగా రూపొందిందో స్ప‌ష్టంగా ఆక‌ట్టుకునేలా వివ‌రించారు. దీని ఫ‌లితంగా ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంపై యు.ఎస్‌.లోని ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌ల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డానికి వీలైంది. దేశ ఏఐ వ్యూహానికి తెలంగాణ ఒక గొప్ప చోద‌క‌శ‌క్తిగా అద్భుతంగా ప్ర‌ద‌ర్శించ‌గ‌లిగారు.

     జాతీయ స్థాయిలో ఏఐ వార్ రూమ్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తెచ్చారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా శ‌ర‌వేగంగా ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలించ‌డ‌మే కాకుండా, కేంద్రం-రాష్ట్రాల మ‌ధ్య మ‌రింత స‌మ‌న్వ‌యం సాధించేందుకు ఈ వార్ రూమ్ దోహ‌ద‌ప‌డుతుంది. ఏఐకి సంబంధించి కేంద్ర‌స్థాయిలో ఒక ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు. దీంతో పాటు ఇండియా ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, ఈ రంగానికి త‌గిన ప్రోత్సాహం అందించ‌డం వ‌ర్త‌మాన ప‌రిస్థితుల్లో చాలా అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.  తెలంగాణాలో జాతీయ ఏఐ స్టార్ట‌ప్ విలేజ్ ఏర్పాటు చేయ‌డానికి త‌మ ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ద‌ని చెప్ప‌డం ద్వారా రాష్ట్రం కృత్రిమ‌మేధ‌ విష‌యంలో ఎంత‌టి శ్ర‌ద్ధ చూపుతున్న‌దీ తెలియ‌జేశారు. హైద‌రాబాద్‌కు స‌మీపంలో ఏర్పాటు చేయ‌నున్న ఏఐ యూనివ‌ర్సిటీ అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన ఏఐ శ్రామిక‌శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌దు. భార‌త్ ఫ్యూచ‌ర్‌సిటీ, ఏఐ చోదిత తెలంగాణ డిజిట‌ల్ ఎక్స్చేంజ్‌, భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వంటి వాటి ద్వారా కృత్రిమ‌మేధ‌ను వ్య‌వ‌సాయం, ఆరోగ్యం, ప‌ట్ట ణాబివృద్ధి రంగాల్లో స‌మీకృతం చేయ‌డంలో మ‌న రాష్ట్రం దేశానికే ఒక రోల్‌మోడ‌ల్‌గా నిలిచేందుకు య‌త్నించింది. ఓపెన్ ఏఐ, ఎన్విడియాల‌తో పాటు కేంద్ర నాయ‌కులు, రాష్ట్రం కృత్రిమ‌మేథ రంగంలో విస్తార‌మైన టాలెంట్ పూల్‌ను క‌లిగిఉందంటూ  ప్ర‌శ‌సించ‌డం గ‌మ‌నార్హం.
మౌలిక స‌దుపాయాల ప్ర‌ణాళిక‌లో తెలంగాణ ముందంజ‌లో ఉండగా  స్టార్ట‌ప్‌ల సాంద్ర‌త, వెంచ‌ర్ క్యాపిట‌ల్ ప్ర‌వాహం  విష‌యంలో బెంగ‌ళూరు త‌న ఆధిప‌త్యాన్ని నిలుపుకుంది. మ‌హారాష్ట్రలోని న‌వీ ముంబ‌యిలో టాటా సంస్థ‌ 11బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో ఇన్నోవేష‌న్ సిటీని ఏర్పాటు చేయ‌నుంది. ప్ర‌స్తుతం ఇన్నొవేష‌న్ రంగంలో గ్లోబ‌ల్ హ‌బ్‌గా రూపొందాల‌నుకుంటున్న తెలంగాణ‌కు ఇది గొప్ప పోటీని ఇవ్వ‌గ‌ల‌దు. దీన్ని త‌ట్టుకొని నిల‌బ‌డేందుకు ప్ర‌భుత్వం వేగంగా ముందుకు సాగాల్సి ఉంటుంది . కాగా బెంగ‌ళూరు, మ‌హారాష్ట్రల్లో బ్యూరోక్ర‌సీ లేయ‌ర్లు ఎక్కువ‌. అందువ‌ల్ల ఒప్పందాలకు సంబంధించిన కార్యా చ‌ర‌ణ ఆల‌స్యమ‌వ‌డం గ‌మ‌నార్హం. అదే తెలంగాణ విష‌యానికి వొస్తే ఫాస్ట్ ట్రాక్ లో ప‌నులు పూర్తికావ‌డంతో 26 అవ‌గాహ‌నా ఒప్పందాల‌పై సంత‌కాలు జ‌రిగాయి. ఈ విష‌యంలో తెలంగాణ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. ఇన్‌ఫ్రాకీ సంస్థ‌తో ప్ర‌భుత్వం రూ.70వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ సంస్థ ఏఐ రెడీ డేటా సెంట‌ర్‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌నుంది. ఇది కృత్రిమమేధ‌కు సంబంధించి ఇంజిన్ వంటిద‌నే చెప్పాలి.
    బెంగ‌ళూరు అభివృద్ధిలో ఒక ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం వ‌ల్ల‌, క‌ర్బ‌న ఉద్గారాలు విప‌రీతంగా పెరుగుతున్నాయి. అదే తెలంగాణ‌లో ప్ర‌తిపాదించిన ఏఐ సిటీ ప‌ర్యావ‌ర‌ణానికి మిత్రుడిగా ఉండనుంది.  క‌ర్బ‌న ఉద్గారాల‌కు తావులేని రీతిలో గ్రీన్ ఫీల్డ్ టెక్నాల‌జీతో నిర్మించ‌నున్నారు. గ‌తంలో నిర్మించిన టెక్ హ‌బ్‌ల్లో మాదిరిగా విప‌రీత‌మైన జ‌న‌సాంద్ర‌త ఇక్క‌డ క‌నిపించ‌దు. అంతేకాదు బెంగ‌ళూరు, పూణెల‌తో పోలిస్తే హైద‌రాబాద్‌లో జీవ‌న వ్య‌యం 10% నుంచి 20% వ‌ర‌కు త‌క్కువ‌. గ్లోబ‌ల్ కెపాసిటీ సెంట‌ర్లు న‌గ‌రంప‌ట్ల ఆక‌ర్షితం కావ‌డానికి ఇదొక అద్భుతమైన సానుకూల‌త‌. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ఏర్పాటు చేస్తున్న సంప్ర‌దాయ ఐటీ పార్క్ ల‌కు మ‌న ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఏఐ సిటీ పూర్తి భిన్నంగా ఉండబోతున్న‌ది. అయితే బెంగ‌ళూరు ఐటీ ఎకోసిస్ట‌మ్‌లో ప‌రిపూర్ణ‌త సాధించ‌డం వ‌ల్ల అక్క‌డ ఏఐకి సంబంధించిన స్టార్ట‌ప్‌ల సంఖ్య అధికం. ఇక త‌మిళ‌నాడు వాట‌ర్ మ‌నేజ్‌మెంట్‌, త‌యారీ రంగాల్లో ఏఐని ఉపయోగిస్తోంది.
ఇక మ‌న‌రాష్ట్రం ప్ర‌జాసేవా రంగాల్లో అత్య‌ధికంగా ఏఐని ప్ర‌వేశ‌పెట్టాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం 200 ఎక‌రాల్లో ఏఐ సిటీని అభివృద్ధి చేయనుంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున నిపుణుల త‌యారీకోసం ఒక ప్ర‌త్యేక ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌నుంది. ఇక రాష్ట్రంలో అత్యున్న‌త‌స్థాయి కృత్రిమ‌మేధ ప‌రిశోధ‌న‌కు అవ‌స‌ర‌మైన హార్డ్ వేర్ కోసం ఎన్‌టీటీ డేటా రూ.10,500 కోట్ల‌తో ఒక డేటా సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నుంది. ఈవిధంగా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు స‌మ‌న్వ‌యంతో ఏఐ స‌ద‌స్సులో తెలంగాణ త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకోవ‌డ‌మే కాకుండా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల‌కు ఏఐ రంగంలో గ‌ట్టి పోటీదారుగా, దేశ కృత్రిమ‌మేధ వ్యూహానికి ఒక చోద‌క‌శ‌క్తిగా త‌న‌ను తాను సువ్య‌వ‌స్థితం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *