‘మేకిట్ న్యూ’ అనే పిలుపునిచ్చాడు ఎజ్రాపౌండ్. ఈ పిలుపు అనేకచోట్ల, అనేకవిధాలుగా సాహిత్యంలో ప్రతిఫలించింది ఆధునిక ఉద్యమమైంది. గతంతో తెగదెంపులు చేసుకుంది. పాత సాంప్రదాయలను వదిలి పెట్టమని ఉద్బోధించింది. కొత్తరూపాలను ఆవిష్కరించింది. కవులను, కళాకారులను నూతన పద్ధతులను, కొత్తపుంతలను అనుసరించేట్లు చేసింది. మహాకవి దాశరధి కూడా ‘పునర్నవం’ అని పిలుపునిచ్చాడు. తెలుగు కవులు ఏ మేరకు స్పందించారో తెలియదు. దాశరథి కవితాదృష్టి, సృష్టి నవనవోన్మేషమే. నూతనాన్వేషణే. దూరాన పొడిగాలి దెబ్బలకు/ తునాతునకలైపోయిన ఆకులతో/ ముసలి మొహం పడిన వృక్షం మీద/ యౌవనం చిగురించడం కవిత్వం’’ అన్నాడు. రోజూ కనపడే నక్షత్రాల్లో రోజూ కనపడని కొత్తదనం చూచి రోజూ పొందని ఆనందానుభూతి ప పొందడం అంటేనే కవిత్వం’’ అని నిర్వచించాడు. మనసు మల్లెపొద అన్నాడు. దాంట్లోంచి పసందైన వాసనలు వీచాలన్నాడు. ఆ వాసనలు ‘పద్యాల సీసాల్లో అనంతకాలం నిలిస్తే కవిత్వం’ అవుతుందని చెప్పాడు. దాశరధి కవిత్వానికి ఒక శాశ్వతత్వాన్ని ఊహించాడు. ఆ మహాకవి శతజయంతి సందర్భంలో తిరిగి ఆయన ఇచ్చిపోయిన కవిత్వాన్ని చదువుతున్నప్పుడు పారవశ్యం కలుగుతుంది.
ఉద్యమకవిగా ప్రసిద్ధుడైన కవిని అత్యంత హృద్యమైన భావాలు పొదిగినకవిగా గుర్తించడంలో, ప్రశంసించడంలో విశ్లేషించి చెప్పుకోవడంలో వెనక పడ్డామనిపిస్తుంది. బహుశా తెలుగులో కొద్దిమంది కవులకు మాత్రమే ఇటువంటి ఉద్యమ నేపథ్యం ఉంది. జాతీయోద్యమంలో మాతృదేశారాధన, దేశభక్తి, బ్రిటీషు పాలనను తీవ్రంగా నిరసిస్తూ రాసిన కవులు కనుమరుగయ్యారు. గత వైభవకీర్తన, పునరుద్ధరణ భావనలు వెలువరించిన కవులను అడపాదడపానైనా చెప్పుకుంటున్నాం గానీ మిగిలినకవులు, జైళ్లలో మగ్గిపోయిన కవుల సాహసాలను అంతగా స్మరించుకోవడం లేదు. తెలుగుపద్యానికి విశ్వనాథ, జాషువా, కరుణశ్రీలు చేసిన దోహదాన్ని అదేపనిగా చర్చ చేస్తాం కాని, దాశరధి అద్దిన సొగసుగూర్చి ప్రస్తావన చేయడానికి నోరు పెగలదు. దాశరధిని తెలంగాణకు పరిమితం చేయడం సమంజసమైనదేనా? అనే ప్రశ్న ఇవ్వాళ మనం వేసుకోవలసి ఉంది. ఒక పోతన, ధూర్జటి, ఒక దాశరధి, రాజ్యంతో, రాచరిక వ్యవస్థలతో తలపడిన తీరు అధిక్కార ప్రకటనలు నిత్యస్ఫూర్తిదాయకాలు. దాశరధి కవిత్వం విషయంగా మనం’ ‘అగ్నిధార’ రుద్రవీణలను దాటి రాలేకపోయామేమోనని సందేహం. కవితాపుష్పకం, తిమిరంతో సమరం, పునర్నవం, ఆలోచనాలోచనాలు, మహాబోధి వంటివాటిని మరింత విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
గాలిబ్ గీతాలకి ఖ్యాతి వచ్చినప్పటికీ ఏవో అభ్యంతరాలు, నసుగుళ్లు వినిపిస్తుంటాయి. ఒక వైదేశిక ప్రక్రియను మరో భాషా, సాహిత్య సాంస్కృతిక తరానికి పరిచయం చేయాలనుకోవటం ఆయనకు రూపభేదంతో కూడిన కవిత్వ ప్రక్రియలు ఎన్ని ఎక్కువగా ఉంటే అంతగా వైవిధ్యం, నవ్యత సృజనాత్మకత పెరుగుతుందనే ఆకాంక్షకు నిదర్శనం. అట్లాగే గజల్ రుబాయీల విషయంగానూ చెప్పుకోవాలి. వాటికొక కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన సంగతిని విస్మరిస్తాం. దువ్వూరి రామిరెడ్డిని లెక్కకు మించి ప్రస్తావిస్తాం. కానీ, దాశరధి దోహదమేమీ లేదా! క్షోభ లేనిదే రాయలేను అన్నాడు. ఆ క్షోభను, పరివేదనను కవిత్వంగా పలికాడు. ‘‘ఓ స్మశాన వాటి ఆ నిశాలైల్యమ్ము/ మహాశిశిరమ్ములెన్ని నాళ్ళు/ ఈ క్షుధాజ్వరంబు లీ వ్యధా భారంబు/ లీ బికారి బతుకులెన్నినాళ్ళు’’ అని అగ్నిధార ‘అంతర్నాదము’లో’ వేసిన ప్రశ్న తెలంగాణ దుస్థితిని కళ్ళకు కడుతుంది. దీర్ఘకాలం విస్తరించి వచ్చిన ‘మహాశిరము’ అంతరించి పోవాలనే సంకల్పం దాశరథిలో ప్రగాఢం.
‘‘ దగా కోరు బటాచారు – రజాకారు పోషకుడవు/ వూళ్ల కూళ్ళకగ్గి పెట్టి – ఇళ్లన్నీ కొల్లగొట్టి,/ తల్లి పిల్ల కడుపుకొట్టి- నిక్కిన దుర్మార్గమంత/ నీ బాధ్యత నీ బాధ్యత’’ అంటూ నిజాం రాజు దురాగతాలను ఎండగట్టాడు. ప్రజాకంటకుడైనరాజును ‘దిగిపోవోయ్, దిగిపోవోయ్’ అని ఎలుగెత్తాడు. నేను పోతన కవీశాను గంటములోని/ఒడుపుల కొన్నింటి బడసినాను’ అన్న కవి ఆ పోతనామాత్యుల నుంచి అందుకున్నవి ఏమిటి? మొదటిది రాజ్యవ్యతిరేకత, ప్రజానుకూలత. రెండవది పోతన శబ్దార్థాలంకార పద్యధార, దాశరధి పద్యం ఒక సంభాషణ. ఒక సంవాదం ఒక సంఘర్షణ.
ఓ జనతా నతాంజలి పుటోజ్వల దివ్యకవోష్ణ రక్త ధా/ రా జలసిక్త పాద కమల ద్వయ శోధి మనోజ్ఞ దేహరే/ఖాజాయ భారతీ! యుగయుగమ్ముల పున్నెపు పంట/ నీవు నీ పూజకు తెచ్చినాడ నిదె పొంగిన గుండియ నిండు పద్దెముల్’’ ఈ పద్యం దాశరథి అకుంఠిత దేశభక్తిని, ఎత్తి చూపటమే కాకుండా ఆయన పాండిత్యాన్ని ప్రదర్శిస్తుందని వ్యాఖ్యానించారు తిరుమల శ్రీనివాసాచార్య పద్యం రెండున్నర చరణాలు దీర్ఘ సమాసమే.
అలంకార ప్రయోగంలోనూ దాశరథి ఏ ప్రాచీన, అధునాతన కవికి తీసిపోడు. ‘‘దాశరధి యొద్ద పూర్వాంధ్ర ప్రబంధకవుల పోకడలును ఉన్నవిబీ అధునాతన కవుల రాకడలు నున్నవి’’ అని మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రశంసిస్తారు. ‘‘తెలంగాణలో దేశాభిమాన ప్రబోధక గీతములాలపించిన కవి కుమారులలో దాశరథిదే అగ్రస్థానము. ఇతడు తెలంగాణ సాహిత్యసీమలో క్రొత్తపుంతలు తొక్కే క్రొత్త పొలాలు నిర్మించిన ఉత్తమ సాహిత్య కర్షకుడు. ఇతని కవిత్వము లలిత పద చమత్కార సంపన్నమై చదివిన కొద్ది చవులూరించుచుండును’’ అన్నారు. దాశరథి కవిత్వంలోని భావావేశము పఠితలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దేశారాధన పూర్వక కవిత్వంలో ఈ లక్షణం మరింత అధికం. తెలంగాణ అంటే చాలు. ఒక గాఢమైన అనురాగం పెల్లుబుకు వస్తుంది. తరచుగా ఉదహరింపబడినదే అయినా ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అన్నప్పుడు ఆ భావావేశం, ఆ వేగం, తీవ్రతలు మనసును తాకుతాయి. నూతనమైన ఆలంకార పదబంధ చమత్కృతి దాశరధి కవిత్వలో మెండు.
ఒకవైపు రాజరికము మీద తిరుగుబాటు, మరొకవైపు పెట్టుబడిదారీ విధానాల మీద తిరుగుబాటు జమిలిగా కొనసాగుతున్న సమయంలో దాశరధి ఈ రెంటినీ సమంగా అంది పుచ్చుకున్నాడు. ఒకవిధంగా తెలంగాణలో సాహిత్యం ద్వారా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు ఇద్దరు. ఒకరు దాశరధి కాగా, రెండవవారు కాళోజి. పీడత ప్రజల సమస్యలకు అగ్రపీఠం దాశరథి కవిత్యంలో కనిపిస్తుంది. అట్లాగే వారికి ఒక ధైర్యవచనంగా కూడా నిలిచింది.
ఆ పీడితుల హృదయాలలోని ఆవేశాలను, భావాగ్నులను, ఆకాంక్షలను దాశరథి అంత శక్తిమంతంగా వ్యక్తీకరించినవారు అరుదు. దౌష్ట్యం, దౌర్జన్యం, ఆధిపత్యం, అన్యాయం, అక్రమాదుల మీద దాశరథి దండయాత్ర చేశాడు. జాతీయోద్యము భావాలను ఒకవైపు ప్రకటిస్తూ, తెలంగాణ ప్రజల కడగండ్లను మరోవైపు వ్యక్తీకరిస్తూ అంతర్జాతీయ పరిణామాలను ఆకళింపు చేసుకుని ప్రజా విముక్తి పోరాటాలకు అండగా నిలిచాడు. దాశరథి కవిత్వంలో నిశితంగా పరిశీలిస్తే గ్రీష్మ, శిశిరాల ప్రస్తావన ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఈ రెంటిని ఆధిపత్యం, పీడన, అధికారాలకు ప్రతీకగా కూడా భాసింప చేస్తాడు. ‘పాడుటెండాకాలపు దుండగుడుబీ నన్ను పాడుకోనీడు పూవుల జాడలందు’ అనే విచారం ఇందులో భాగమే.
జైల్లో అనే ఖండికలో..
‘‘ఈ యెండ కాలములో యెన్ని వర్షాలు దాగి ఉన్నావా! చూడ సాగినాను ఆ యెడారి పొలాలలో యెన్ని గంగలు పొంగునో! యని చూడ బోయినాను ఆయాస పడు జైలులో యెన్ని ప్రజల రాజ్యములున్నవో! యని యరసి నాను నిరుపేద వాని నెత్తురు చుక్కలో నెన్ని విప్లవాలో! యని వెదికినాను’’ అన్నాడు.
ఈ విప్లవపథంలో రుద్రవీణల వెచ్చని గీతాలు పలికాయి. అగ్నిధారలు కురిసాయి, చరిత్రకు అప్రమత్త జాగురూక నయనాలు ఇచ్చాను, అని పలికిన కవి దాశరథి. ఇటీవల కె. శ్రీనివాస్ శత జయంతుల గురించి రాస్తూ కొన్నిప్రశ్నలు వేశారు. ‘‘దాశరథి స్థానం తెలంగాణ సాహిత్యంలో లెక్కించటం సరే, మొత్తం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనకు సరైన స్థానమే దొరికిందా? తెలంగాణా నేపథ్యం ఆయన గౌరవాన్ని కుదించలేదా? బ్రిటిష్ ఆంధ్రాలో వెల్లివిరిసిన ఆధునిక సాహిత్యాన్ని ప్రాతిపదికగా చేసుకుని నిర్మించిన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో దాశరథి ఏ కోవకు చెందుతారు? అన్ని తెలుగు ప్రాంతాల సాహిత్య వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని సాహిత్య చరిత్రను నిర్మించే ప్రయత్నం చేస్తే, దాశరథి ఇప్పుడున్న దానికంటే ఆయన ఎక్కువ గుర్తింపుకు అర్హుడు కాదా?’’ ఈ ప్రశ్నలు సమంజసమైనవి. శతజయంతి సందర్భాన దాశరథి స్థానం గురించి జరగాల్సిన చర్చ ఎంతో ఉంది. సరైన రీతిలో సమాధానాలు వెతకాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది.
-తెలగాణమ్మున గడ్డి పోచయును సంధించెన్ కృపాణమ్ము!రా
జలలాముండను వానిపీచమడచన్ సాగించె యుద్ధము!భా
తిలిపోయెన్ జగమెల్లయ్యే యగునో తెమింగరాకన్! దిశాం
చలముల్ శక్రధను : పరంపరలతో సయ్యాట లాడెన్ దివిన్!”
-మాపు సాంతము కురిసిన మంచులోన
రేపు సాంతము మంటలు రేగునంట!
కప్పుకొన దుప్పటి లేని కవి కలాన
గప్పుమని నిప్పుమంటలు క్రమ్మునంట!”
-”ఏది కాకతీ? ఎవటే రుద్రమా? ఎవరు రాయలు? ఎవడు సింగనా? అన్నీ నేనే! అంత నేనే! తెలుగు నేనే! వెలుగు నేనే!’’
-”కానుగ చెట్లనీడల నొకానొక స్వప్నపు సెజ్జమీద ని
ద్రాణత హాయిగొల్పగ సదా శయినింపగ నీ మహాంధకా
రాన మనస్సు శాంతిగొనె, రాను భవత్ కమనీయ కాంతి సౌ
ధానకు, నన్ను పిల్వకుము తన్వి! విభా విభవాభిరామవై!”
-”ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
అచ్చోట మధుమాస మవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
ఆ వేళల వసంత మందగించు
ఇరులె మయూరులై ఎట నాట్యమాడునో
అటనే నవాషాఢ మావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆ రోజు కార్తిక మ్మాగమించు”
-”రమ్మంటె చాలుగానీ
రాజ్యాలు విడిచి రానా
నీచిన్న నవ్వు కోసం
స్వర్గాలు గడిచి రానా”
నను బంది చేసినారు
ఎనాటికైన గానీ
ఈగోడ పొడిచి రానా’’
-సీతారాం





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల