తెలంగాణ రాజకీయాలిప్పుడు బిసి రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకిప్పుడిది ఒక అస్త్రంగా మారింది. రిజర్వేషన్ల కోసం పోరాడి సాధించిన పార్టీగా పేరు తెచ్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ తంటాలు పడుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు, వొస్తాయనుకుంటున్న పదకొండు స్థానాల్లో ఉపఎన్నికలకు ఆయా పార్టీలకు ఒక ఆయుధంగా ఇది సంక్రమిస్తుందన్న భావనలో ఉన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించే విషయంలో ఇప్పటికే ఆయా పార్టీలు కార్యాచరణను అమలు చేయడంలో మునిగిపోయాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పై భారతీయ జనతా పార్టీ శనివారం నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధానిలో నిర్వహించింది.
రాష్ట్రప్రభుత్వం రాజ్యంగ వ్యతిరేకంగా, తన రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్లపై పట్టుపడుతోందని బిజేపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. రిజర్వేషన్ల విషయంలో బిసిలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదంటున్నారు. 42 శాతం రిజర్వేషన్‌లో పదిశాతం ముస్లింలకు కేటాయించడాన్ని తాము ఒప్పుకునేదిలేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ మొత్తాన్ని హిందూ బిసీలకే కల్పించాలన్నది బిజెపి వాదన. రాష్ట్రంలో తాము అధికారంలోకి వొచ్చిన వెంటనే అదే విధానాన్ని అమలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొంటే, 9వ షెడ్యూల్‌లో చేర్చినప్పుడే దానికి చట్టబద్దత ఉంటుందని ఆపార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. అయితే 9వ షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యంకాదంటూ ఆయన వ్యాక్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి.
బిసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సమాజంలోని అసమానతలను దృష్టిలో పెట్టుకుని, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి అణగారిన వర్గాల వారికి అన్ని రంగాల్లో చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అధికారంలోకి రాలేకపోయినా తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన హామీని ఇక్కడ అమలు పర్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన లో 56 శాతం బిసీలున్నట్లు తేలింది. అందులో హిందూ బిసీలు 46.25శాతం కాగా, ముస్లిం బీసీలు 10.08 శాతంగా తేలింది. దాన్నిబట్టి బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్దపడింది. అందులో భాగంగానే అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. బిల్లును ఆమోదింపజేయడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సహచర పార్టీలతో దిల్లీలో ఇప్పటికే ఒకసారి ధర్నాచేసిన కాంగ్రెస్, తాజాగా దిల్లీలో మూడు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఈనెల 6న బిసీ వర్గాలతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు ప్రతీ జిల్లా నుండి కనీసం 25 మంది కార్యకర్తలను తీసుకుని సోమవారం ప్రత్యేక రైల్‌లో దిల్లీ బాటపట్టారు. అయితే దానికన్నా ముందు ఈ నెల 5న పార్లమెంటులో బిసీ బిల్లుపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తోంది. చివరగా ఆగస్ట్ 7న అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆయోదించిన బిసీ బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించే కార్యాచరణను కాంగ్రెస్ చేపట్టింది. ఇదిలా ఉంటే బిసీల రిజర్వేషన్‌ల విషయంలో తామేమీ వెనుకబడలేదన్నట్లు భారత రాష్ట్ర సమితి కూడా ఈ నెల 8వ తేదీన కరీంనగర్‌లో పెద్ద ఎత్తున బిసీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్దమైంది. బిజెపి, కాంగ్రెస్ కలిసి బిసీలను మోసం చేస్తున్నారంటూ బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 50శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్‌లు ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏదిఏమైనా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెడితే తప్ప వీటికి చట్టబద్దత లభించదంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ల మీద కదలడానికి తమ పోరాటాలే కారణమంటున్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన 72 గంటల ధర్నా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బిఆర్ అంబేడ్కర్, పూలే, ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించి ఆమె ధర్నాను ప్రారంభించారు. బిసీల విషయంలో తాము వెనుతిరగని పోరాటం చేస్తున్నామంటున్న కవిత, తమ డిమాండ్ మేరకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. తమ పోరాటం కారణంగానే సావిత్రీబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అసెంబ్లీలో జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటుకు పట్టుపడితే దాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టారన్నారు. బిసీల ఆత్మగౌరవం కోసం ఈరోజు పోరాటం జరుగుతున్నదని, సమాజంలో సగమున్న బిసీలకు రాజకీయాల్లో సమప్రాతినిద్యం ఉండాలన్నదే తన డిమాండ్‌గా చెప్పారు. కేంద్రం ఈ బిల్లును ఆమోదించకపోతే పెద్ద ఎత్తున దిల్లీలోకూడా ధర్నా చేపడతామంటున్నారు కవిత. మొత్తంమీద బిసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలను పరుగులు పెట్టిస్తున్నది. త్వరలో రానున్న స్థానిక ఎన్నికలు ఈ రిజర్వేషన్‌లతో ముడివడి ఉండడంతో పార్టీలకు ఆ బాట పట్టిన పరిస్థితి ఏర్పడింది.





