మేం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేసేది, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామనేది తెలుపుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఉద్యోగ కేలెండర్ ను ప్రకటిస్తాం. జూన్ 02 నాటికి అన్ని శాఖల్లోని ఖాలీలను గుర్తించి జాబ్ కేలెండర్లో పొందుపరిచి, ప్రతి ఏటా సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇదే మేము అమలు చేయబోయే జాబ్ కేలెండర్ ” అంటూ మేనిఫెస్టోలో రెండు దశలుగా ప్రతి ఏటా జారీ చేసే నోటిఫికేషన్లను తేదీలతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు నిరుద్యోగుల్లో విశ్వాసం నింపడంకోసం దీనిపై రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సంతకాలు చేసి మరీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేత నిరుద్యోగులకు దీన్ని అందేలా చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ అదృష్టమో, నిరుద్యోగుల దురదృష్టమో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరిప్పటికి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది, తాము హామీ ఇచ్చిన జాబ్ కేలండర్ ఇప్పటికీ జాడ, పత్తా లేదు. ఇది నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది.
అంతేకాదు గత ఏడాది ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరిరోజున 2024 – 2025 ఉద్యోగాల భర్తీ వివరాలను విడుదల చేసింది. దీనిపై కనీసం పరీక్షల నిర్వహణ ఛైర్మన్ సంతకం కూడా లేదు. ఇటువంటి చట్టబద్ధత లేని ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఒకవేళ ప్రభుత్వ ప్రకటనే చట్టబద్ధమైనదైతే, ఈ జాబితాలోని ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? కనీసం నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ కేలండర్ హామీపై అసెంబ్లీలో చర్చకు కూడా అనుమతించకపోవడం గమనార్హం. మళ్లీ ఈ జాబ్ కేలండర్‌పై గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమీ లేదు.
“ఎస్సీ వర్గీకరణ సాకుతో ఇంత కాలం ఉద్యోగాల నోటిఫికేషన్లకు బ్రేకులు వేసిన సర్కార్ ఇటీవల తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. రోజులు గడుస్తున్నాయి తప్ప, ప్రభుత్వం జాబ్ కేలండర్ ఊసెత్తడం మానేసింది. ఇప్పటికే ఉద్యోగుల పదవి విరమణతో 9 వేల ఖాలీలు ఏర్పడగా వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం..”
“ వాగ్దానాలు నీటిపై రాతలైతే ప్రభుత్వాలనునమ్మేదెట్ల ” అంటూ అర్థశాస్త్ర ఆచార్యులు కార్తీక మురళీధరన్ ఓ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఏళ్లుగా కుటుంబాలకు దూరంగా ఉంటూ నిరుద్యోగులు ప్రభుత్వ జాబ్ కేలండర్‌పై నమ్మకంతో గ్రంథాలయంలో రాత్రి పగలూ తేడా లేకుండా అధ్యయనంలోనే కాలం గడుపుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ అమలుకు నోచకపోవడం నిరుద్యోగుల్లో తీవ్ర నైరాశ్యానికి కారణమవుతోంది. కంటి తుడుపు హామీల ద్వారా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడకూడదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలి. ఇత్తేసి పొత్తుకూడినట్టు.. అనే నానుడికి సరైన అర్ధాన్ని తామే ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉండడం చూస్తుంటే నిరుద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొద్దో గొప్పో మొత్తంగా ఆరు వేల పోస్టులను జోడించి మొత్తంగా 60 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిగా తమ ఖాతాలో వేసుకున్న తీరులో చూస్తే కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనం కనిపిస్తోంది.
ప్రతియేటా యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగాలనోటిఫికేషన్ తేది, దరఖాస్తు గడువు, పరీక్ష తేదీ లాంటివివరాలతో కూడిన సమగ్ర వివరాలతో కూడిన నియామక కేలెండర్ ను యూపీఎస్సీ ప్రకటిస్తుంది. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలెండర్ నుపరిశీలించిన అనంతరం చాలామంది ప్రభుత్వాన్ని అభినందించిన మాట వాస్తవం! అయితే దీనిపై అనుమానాలు వ్యక్తం చేసినవారు కూడా లేకపోలేదు! చివరకు వీరి అనుమానమే నిజమైంది. ఇప్పుడు జాబ్ కేలండర్ ఎక్కడంటూ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ కేలెండర్ కు చట్ట బద్ధత కల్పిస్తానని ఇచ్చిన హామీకి తూట్లు పొడిచిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఆరు హామీల ప్రతం మాదిరిగానే జాబ్ కేలండర్ కూడా చెత్తబుట్టలో వేసినట్టే భావించాల్సి వస్తోంది. ఎందు కంటే ఈ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరి! ఎస్సీ వర్గీకరణ సాకుతో ఇంత కాలం ఉద్యోగాల నోటిఫికేషన్లకు బ్రేకులు వేసిన సర్కార్ ఇటీవల తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. రోజులు గడుస్తున్నాయి తప్ప, ప్రభుత్వం జాబ్ కేలండర్ ఊసెత్తడం మానేసింది.
ఇప్పటికే ఉద్యోగుల పదవి విరమణతో 9 వేల ఖాలీలు
ఏర్పడగా వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. దీనికితోడు ఆర్ధిక భారంతో ఇంకో విధంగా ఉద్యోగుల పదవి విరమణ వయసును ఏడాది పెంచాలని చూడడం నిరుద్యోగులను కలవరానికి గురిచేస్తున్నది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగ అర్హతకు వయస్సు రీత్యా చివరి అంకంలో ఉండగా, మరికొందరి వయస్సు దాటిపోయింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది యువత గ్రూపు 01,02,03,04 , పోలీస్, టీచర్, గురుకుల టీచర్, వైద్య సిబ్బంది, రెవెన్యూ విభాగాల్లో ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేయకపోతే నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి, మరింత పోటీ ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జాబ్ కేలండర్‌ను అమలు చేయాలి.
ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 2014 వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని అందులో తెలంగాణ వాటాగా కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందనే అపవాదును కాంగ్రెస్ పార్టీ మూటకట్టుకుంది. ఎప్పటినుంచో కొనసాగుతున్న నిరుద్యోగిత రేటు ప్రభావం కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన కె.సి.ఆర్. ప్రభుత్వంపై పడింది. అనుకున్న స్థా యిలో ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయింది. ఈ సాకును చూపి కాంగ్రెస్ పార్టీ కె.సి.ఆర్.పై చేసిన దాడి అంతా ఇంతా కాదు. మరిప్పుడు తాను చేస్తున్నదేంటో కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాను చెప్పిన విధంగానే జాబ్ కేలండర్ విడుదల చేసి, తన నిబద్ధతను చాటుకోవాలి.
జాబ్ క్యాలెండర్ విడుదల బాధ్యతను యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పగించాలే కానీ, నిరుద్యోగులకు బ్రహ్మపదార్థం అందించినట్లు తమ అభయహస్తంఎన్నికల మేనిఫెస్టో మాదిరి ప్రకటించడం సరికాదు. ప్రజల మాదిరి నిరుద్యోగులను ఎక్కువ కాలం ఉద్యోగాల భర్తీ విషయంలో మభ్యపెట్టడం అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం తెలుసుకోవాలి. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక రాజకీయ పార్టీగా హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత. అలా చేయనప్పుడు క్షమాపణకోరే సత్సంప్రదాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అనుసరించాలి. లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎదురీత తప్పదు.
పిన్నింటి విజయ్ కుమార్,
9052039109
9052039109
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేత.





