వెంటిలేటర్ మీద తెలంగాణ ఆర్థిక వ్యవస్థ!  

“విద్యార్థుల ఫీజుల రియింబర్స్ మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఆరు సంవత్సరాలుగా పేరుకు పోయాయనీ, అవి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైనే ఉంటాయనీ తెలుస్తున్నది. అలాగే విభిన్న వర్గాల పేద, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించే ఆరోగ్యసేవల పథకం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు హాస్పిటల్స్ కు  ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటాయని తెలుస్తున్నది. రియింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల రూపకల్పన లోనే లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాలని సూచనలు వస్తున్నప్పటికీ, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల, హాస్పిటల్స్ ల  ప్రయోజనాలు నెరవేర్చడానికి వాటిని గత ప్రభుత్వాలు కొనసాగించాయి, ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది.”

telanganardham ఈ వారం బైటపడిన రెండు మూడు వార్తలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం గురించి తీవ్రమైన సందేహాలకు, ఆందోళనలకు దారి తీస్తున్నాయి. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు తమకు ప్రభుత్వం బకాయి పడిన రియింబర్స్ మెంట్ ఫీ వేల కోట్ల రూపాయలు చెల్లించకపోతే ప్రత్యక్ష చర్యకు దిగుతామని హెచ్చరించాయి. సరిగ్గా అదే సమయంలో తమకు చెల్లించవలసిన ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్ల రూపాయలు చెల్లించకపోతే తాము ఇక నుంచి ఆరోగ్య సేవలు అందించబోమని  హాస్పిటల్స్  యాజమాన్యాలు ప్రకటించాయి. నిర్మాణ, సేవా రంగాలలో ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా తమకు రావలసిన బకాయిలు రావడం లేదని ఆందోళన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చివరికి ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనల బిల్లులు పత్రికలకు, ఛానళ్లకు కొన్ని వందల కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉండగా దాదాపుగా రెండు సంవత్సరాలుగా బకాయిలు పేరుకు పోయినట్టు తెలుస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాను తప్పనిసరిగా చెల్లించవలసిన, బాకీ పడిన బిల్లులు చెల్లించకపోవడానికి కారణం నానాటికీ దిగజారుతున్న ఆర్థిక స్థితే. ప్రభుత్వం కేవలం అప్పుల మీదనే కాలం గడుపుతున్నదని, చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలానికి అనుమతించిన అప్పులో 85 శాతం ఆరు నెలల్లో చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలు కేవలం 15 శాతం అప్పులతో గడపవలసిన దుర్భర స్థితి రాబోతున్నదని వార్తలు సూచిస్తున్నాయి.

నిజానికి ఈ దుస్థితి ఒక్కరోజులో ఏర్పడినదేమీ కాదు, గత ప్రభుత్వ కాలం నుంచి వారసత్వంగా వచ్చినది కూడా ఉండవచ్చు. ఉంది. కాని ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుండగా పదే పదే పాత ప్రభుత్వం సాకు చూపెట్టడం భావ్యం కాదు. ఈ రెండు సంవత్సరాలలో గత ప్రభుత్వాల కన్నా భిన్నమైన ఆర్థిక విధానాలను పాటించడానికి, భిన్నమైన ఆదాయ వ్యయ మార్గాలు అనుసరించడానికి చేసిన ప్రయత్నమేమీ లేదు.

విద్యార్థుల ఫీజుల రియింబర్స్ మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఆరు సంవత్సరాలుగా పేరుకు పోయాయనీ, అవి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైనే ఉంటాయనీ తెలుస్తున్నది. అలాగే విభిన్న వర్గాల పేద, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించే ఆరోగ్యసేవల పథకం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు హాస్పిటల్స్ కు  ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటాయని తెలుస్తున్నది. రియింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల రూపకల్పన లోనే లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాలని సూచనలు వస్తున్నప్పటికీ, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల, హాస్పిటల్స్ ల  ప్రయోజనాలు నెరవేర్చడానికి వాటిని గత ప్రభుత్వాలు కొనసాగించాయి, ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది.

ప్రభుత్వమే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ , వైద్యశాలలు, వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు ప్రైవేటు హాస్పిటల్స్  లలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని, అందుకు మూల్యం తాను చెల్లిస్తానని ప్రకటించింది. అంటే సాముదాయక, ప్రజా ప్రయోజనం స్థానంలో వ్యక్తిగత ప్రయోజనానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఊరందరికీ వైద్య, ఆరోగ్య సేవలు అందించే హాస్పిటల్  నిర్మించే బదులు, విడివిడిగా వ్యక్తుల ఆరోగ్యసేవకు అవకాశం కల్పిస్తానని ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించింది. సమాజ ప్రయోజనం స్థానంలో వ్యక్తిగత స్వార్థానికి ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విధానం వల్ల ఆరోగ్యం ఒక అమ్మకపు సరుకు అయిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్  తామర తంపరగా పుట్టుకొచ్చి, ఆరోగ్యశ్రీ అనే బంగారు గుడ్ల బాతును జాగ్రత్తగా పెంచుకొచ్చాయి. వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మొదలైన ఈ పద్ధతి రాష్ట్ర విభజన జరిగినా, ఈ లోగా ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, విభజిత రాష్ట్రంలో ఇద్దరిద్దరు ముఖ్యమంత్రులు మారినా, పథకం పేరు మార్చడానికి ప్రయత్నాలు జరిగినా, మారకుండా కొనసాగుతున్నది.

“ఈ ఆర్థిక అనారోగ్యానికి కారణం గత ప్రభుత్వమే అని ప్రస్తుత ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద నెపం వేస్తూ ఉంటుంది. అందులో కొంత వాస్తవం ఉన్నమాట నిజమే గాని, ఈ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నా బండి ఎందుకు గాడిలో పడలేదో జవాబు చెప్పాలి. విభజన నాటికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వపు మొత్తం రుణభారం ఒక లక్షా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు కాగా, అందులో 18 వేల కోట్ల రూపాయల మీద వివాదం ఉండింది. మిగిలిన రు. 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్రాలకూ పంచగా తెలంగాణ వాటాగా రు. 61,711 కోట్ల అప్పు ఉండింది. అది తెలంగాణ రాష్ట్ర సమితి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో సరిగ్గా పది రెట్లు పెరిగి రు. 6.71 లక్ష కోట్లు అయింది. గడిచిన ఇరవై నెలల్లో ఈ రుణభారానికి కాంగ్రెస్ ప్రభుత్వ మరొక రు. 1.66 లక్షల కోట్లు చేర్చిందని అంచనా. ఈ అప్పులన్నీ కూడా వేరు వేరు వడ్డీ రేట్లతో, ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వ్యవధిలో తెలంగాణ ప్రజలు చెల్లించవలసినవే. అంటే మన వర్తమానం కోసం భవిష్యత్తును, మన తరం భవిష్యత్తును మాత్రమే కాదు, తర్వాతి తరం భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నామన్నమాట. ఈ అప్పులు పుట్టకపోతే ప్రభుత్వ భూముల అమ్మకం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ వంటి మార్గాలు వెతకవచ్చు గాని అవి కూడా భవిష్యత్తును తాకట్టు పెట్టేవే, రద్దు చేసేవే.”

ఇది ప్రజల ఆరోగ్యాల సంరక్షణ మీద ప్రేమ కాదు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే శ్రద్ధా కాదు. అచ్చంగా ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్  యాజమాన్యాల మీద ప్రేమ. వారు తిరిగి ఇచ్చే ముడుపుల మీద, ఎన్నికల నిధుల మీద ప్రేమ. ఒక అంచనా ప్రకారం ఆరోగ్యశ్రీ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం కనీసం నెలకు వందకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. గత పదకొండు సంవత్సరాలలో కేవలం గుండె జబ్బుల చికిత్సకే రు. 1629 కోట్ల రూపాయలు చెల్లించిందని తెలుస్తున్నది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్  యాజమానుల బొక్కసాలకు చేరింది. ఈ నిధులలో నిజంగా ఆ ఆరోగ్య సేవల ఖరీదు ఎంతో, ప్రజాధనం నుంచి అందుతున్నది గదా అని రూపాయికి రెండు రూపాయలు వసూలు చేసినది ఎంతో తెలియదు. ఈ పథకం వల్ల కొందరు వ్యక్తులకు మెరుగైన ఆరోగ్య సేవలు అంది ఉండవచ్చు. కాని ఆ మేరకు ప్రభుత్వం మొత్తంగా ప్రజలకు ఆరోగ్యాసేవలు అందించవలసిన బాధ్యత నుంచి వైదొలగింది. సామాజిక ప్రయోజనం, సామాజిక సంక్షేమం, సామాజిక ఆస్తుల కల్పన, ప్రభుత్వ బాధ్యత అనే విలువల స్థానంలో వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత స్వార్థం, ప్రైవేటు వ్యక్తుల ఆస్తి పెరుగుదల, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అనే విలువలు వచ్చిచేరాయి. అదే స్థాయిలో అవినీతికి తలుపులు బార్లా తెరిచినట్టయింది. ఆరోగ్యశ్రీ బదులు జిల్లాకు ఒక సమగ్రమైన సౌకర్యాలతో ప్రభుత్వ రంగంలో హాస్పిటల్  ఏర్పాటు చేసినా ఇంత ఖర్చు అయి ఉండేది కాదు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యసేవలు ఉచితంగానో, చౌకగానో అంది ఉండేవి. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాలు జరిగి పెద్ద ఎత్తున ఉద్యోగకల్పన జరిగి ఉండేది. ప్రభుత్వానికి, ప్రజలకు ఆ ఆస్తులు మిగిలి ఉండేవి.

సరిగ్గా ఇటువంటి కథే కాలేజీల రియింబర్స్ మెంటుకు సంబంధించినది. ఇందులో ఆరు సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోయాయని కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. రాష్ట్రంలో రెండు వేలకు పైగా కాలేజీలు ఇలా రియింబర్స్ మెంట్ నిధులు అందుకుంటున్నాయని, అందులో ఒక వెయ్యి డిగ్రీ, పీజీ కాలేజీలు, 175 ఇంజనీరింగ్ కాలేజీలు, 120 ఫార్మసీ కాలేజీలు, 250 ఎంబిఎ, ఎంసిఎ కాలేజీలు, వగైరా ఉన్నాయంటున్నారు. రియింబర్స్ మెంట్ నిధులు అందక మూతబడిపోయిన చిన్న కాలేజీలు కూడా కొన్ని ఉండవచ్చు గాని, అక్రమాలతో, అవినీతితో నిధులు సంపాదించి, కాలేజీలను ఇతర పైరవీలకు వినియోగిస్తూ, ఏళ్ల తరబడి రియింబర్స్ మెంట్ అందకపోయినా నడుస్తున్న కాలేజీలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆయా విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని నియమించి, సామాజిక ప్రయోజనంగా విద్యా సౌకర్యాలు కల్పించవలసిన ప్రభుత్వం తన బాధ్యత నుంచి వైదొలగి, ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యాపారుల లాభార్జన దయాదాక్షిణ్యాలకు విద్యార్థులను బలి చేస్తున్నది. ఆ విద్యా వ్యాపారులలో అత్యధిక భాగం రాజకీయ నాయకత్వాలలో కూడా ఉండి, ప్రభుత్వాల విద్యా విధాన రూపకల్పనలో భాగం పంచుకుంటున్నారు.

ఈ ఆరోగ్య, విద్యా వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ పథకాలు తయారైనప్పటికీ, ప్రభుత్వం వారికి అనుకూలంగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆర్థిక స్థితే గందరగోళంలో పడినందువల్ల ఇప్పుడు ఘర్షణ వాతావరణం కనబడుతున్నది. మరి ప్రభుత్వ ఆర్థిక స్థితి ఎలా ఎందుకున్నది? ఆదాయం అంచనా వేసినంత రాకపోయినా, వ్యయం మాత్రం తప్పదు. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, రుణాల అసలు, వడ్డీ చెల్లిపులు వంటి ఖర్చులలో ఏ ఒక్కటీ తప్పించుకోవడానికి వీలు లేదు. ఉదాహరణకు ఏప్రిల్ 2025 ఒక్క నెలలోనే జీత భత్యాలకు రు. 3968 కోట్లు, రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకు రు. 2260 కోట్లు, పెన్షన్లకు రు. 1569 కోట్లు, సబ్సిడీలకు రు. 4187 కోట్లు, ఇతరాలు అన్నీ కలిపి రు. 15,262 కోట్లు వ్యయం ఉండగా, ఆ నెల ఆదాయం రు. 11,238 కోట్లు మాత్రమే ఉండింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే రు. 4,024 కోట్లు లోటు ఉండింది. అందువల్ల అప్పు చేయక తప్పదు.

రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రు. 64,539 కోట్ల రుణాలు సేకరించాలని అంచనాలు వేసింది. కాని ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంట్ (ఎఫ్ ఆర్ బి ఎం) చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంత రుణం తీసుకోవచ్చునో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎఫ్ ఆర్ బి ఎం చట్టాన్ని చూపెట్టి ఆంక్షలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తన దగ్గరికి వచ్చేసరికి ఆ పరిమితులను దాటి ఎడాపెడా అప్పులు చేస్తున్నదనేది మరొక కథ. ఆ కథను ప్రస్తుతానికి పక్కన పెట్టి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమే చూస్తే, రుణ సేకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనాను తగ్గించి, రు. 54,009 కోట్ల రుణం తీసుకోవడానికి మాత్రమే అనుమతించింది. అందులో సెప్టెంబర్ 23 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రు. 45,900 కోట్లు అప్పు తీసుకుంది. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగల అప్పు రు. 8,109 కోట్లు మాత్రమే. జూన్ నుంచి ఏ ఒక్క నెల చూసినా నెలలో తీసుకున్న అప్పు కన్న తక్కువ మాత్రమే వచ్చే ఆరు నెలల్లో తీసుకోవలసి ఉంటుంది.

ఈ ఆర్థిక అనారోగ్యానికి కారణం గత ప్రభుత్వమే అని ప్రస్తుత ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద నెపం వేస్తూ ఉంటుంది. అందులో కొంత వాస్తవం ఉన్నమాట నిజమే గాని, ఈ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నా బండి ఎందుకు గాడిలో పడలేదో జవాబు చెప్పాలి. విభజన నాటికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వపు మొత్తం రుణభారం ఒక లక్షా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు కాగా, అందులో 18 వేల కోట్ల రూపాయల మీద వివాదం ఉండింది. మిగిలిన రు. 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్రాలకూ పంచగా తెలంగాణ వాటాగా రు. 61,711 కోట్ల అప్పు ఉండింది. అది తెలంగాణ రాష్ట్ర సమితి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో సరిగ్గా పది రెట్లు పెరిగి రు.

6.71 లక్ష కోట్లు అయింది. గడిచిన ఇరవై నెలల్లో ఈ రుణభారానికి కాంగ్రెస్ ప్రభుత్వ మరొక రు. 1.66 లక్షల కోట్లు చేర్చిందని అంచనా. ఈ అప్పులన్నీ కూడా వేరు వేరు వడ్డీ రేట్లతో, ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వ్యవధిలో తెలంగాణ ప్రజలు చెల్లించవలసినవే. అంటే మన వర్తమానం కోసం భవిష్యత్తును, మన తరం భవిష్యత్తును మాత్రమే కాదు, తర్వాతి తరం భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నామన్నమాట. ఈ అప్పులు పుట్టకపోతే ప్రభుత్వ భూముల అమ్మకం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ వంటి మార్గాలు వెతకవచ్చు గాని అవి కూడా భవిష్యత్తును తాకట్టు పెట్టేవే, రద్దు చేసేవే. వెంటిలేటర్ మీద ఉన్న రోగి తనకు తాను ఏ బాధలు అనుభవిస్తారో గాని, చుట్టూ చూసేవారికి, వారి మీద ఆధారపడినవారికి ఎక్కువ, బంధుమిత్రులకు, భార్యాబిడ్డలకు ఎక్కువ ఆందోళనను కలిగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *