- 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
- రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏఐ, ఫ్యూచర్ సిటీలు, రీజినల్ రింగ్ రోడ్డు
- క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3 : తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి , వ్యవసాయ రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవించిందన్నారు . స్వచ్ఛమైన శక్తి వనరుల వినియోగంలో ముందడుగు వేస్తూ, తెలంగాణ 11,399 గ్రీన్ పవర్ సామర్థ్యాన్ని సొంతం చేసుకుని, 2030 నాటికి 20,000 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతోందన్నారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు
విస్తరిస్తున్న పట్టణ జనాభా అవసరాలను తీర్చే ఆకుపచ్చ, స్థిరమైన పట్టణ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక కృత్రిమ మేధస్సు. స్మార్ట్ టెక్నాలజీలతో ఆధునిక నగర అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దుతూ లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫోర్త్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్‌తో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ పవర్‌హౌస్‌గా మారుస్తున్నాయని చెప్పారు.
పునరుత్పత్తి శక్తి సామర్థ్యాలు..
ప్రస్తుత పునరుత్పత్తి శక్తి సామర్థ్యం 11,399 మెగావాట్లు ఉందని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. అందులో 7,889 మెగావాట్ల సౌరశక్తి, 2,518 మెగావాట్ల జలశక్తి, 771 మెగావాట్ల పునరుత్పత్తి శక్తి, 221 మెగావాట్ల ఇతర పునరుత్పత్తి శక్తి (128 మెగావాట్లు పవన శక్తి) ఉందని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల్లో పంప్డ్ స్టోరేజ్ వున్నాయి. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వంటి ఆధునిక పరిష్కారాలు పరిశీలనలో ఉన్నాయన్నారు. 54,717 మెగావాట్ల గాలివస్తు సామర్థ్యం కలిగి, దేశంలో టాప్-8 రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందని తెలిఆపరు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్రంలో 872 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్ల నుంచి 2030 నాటికి 24,215 మెగావాట్లు, 2035 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
2030 నాటికి 20,000 మెగావాట్ల లక్ష్యం
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చేందుకు స్వచ్ఛమైన, సరసమైన, స్థిరమైన శక్తి వనరులు ముఖ్యమైనవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 54,717 మెగావాట్లకు పైగా గాలివస్తు సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదనంగా, సూర్యకాంతి 300 రోజులు అందుటులో ఉంటుంది. రాష్ట్రం ఫోటోవోల్టిక్ సోలార్ ప్రాజెక్టులకు అనుకూలమైన ప్రాంతంగా నిలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, పంప్‌డ్ స్టోరేజ్ వంటి ఆధునిక పద్ధతులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం 872కి చేరుకుంది. పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, చెల్లింపుల సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. అంతేకాక, వ్యర్థాలను శక్తిగా మార్చడం వంటి ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగు పరచడం తో పాటు శక్తి వినియోగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ క్రమంలో రాష్ట్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని చెప్పారు. తెలంగాణ పునరుత్పత్తి శక్తి రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఈ రంగంలో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి. ప్రస్తుత పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టుల ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వొచ్చాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం సుస్పష్టమైన విధానాలను అమలు చేస్తోంది. 2030 నాటికి 20,000 మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా, తెలంగాణ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.




