తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు శరాఘాతమే!

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధానాలు బహుముఖంగా ఉంటున్నాయి. ఏ ఉద్దేశంతో ఆయుధం బయటికి తీస్తుందో అంతు పట్టదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు (2013)నోటిఫై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాలు వెనుక ఎవరు ఉన్నారో తెలియడం లేదు. అయితే కర్ణాటక మాత్రం ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే ప్రయత్నాల్లో ఉంది. దానికి దోహద పడే విధంగా ఈ చర్యకు దిగిందనిపిస్తోంది. ఇలాంటి నీటి వివాదాల చిక్కు ముళ్లు చాలా ఉన్నా  వీటి పైన దృష్టి పెట్టక పోవడం ఒకింత ఆశ్చర్యమే.

వాస్తవంలో ఆంధ్ర ప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల మధ్య వంశధార నదీ జలాల వివాదం ఉంది. 2017 లో ట్రిబ్యునల్ ముసాయిదా విడుదల చేసింది. తమకు సమ్మతం కాదని ఒడిషా 2019 లో సుప్రీంకోర్టు కెక్కింది. అయితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వ లేదు. ట్రిబ్యునల్ 2021 లో తుది తీర్పు ఇచ్చింది. తీర్పు ఆంధ్ర ప్రదేశ్ కు అనుకూలంగా ఉంది. ఇది ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అదే విధంగా ఒడిషా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రల మధ్య మహానది జలాలపై వివాదం ఉంది. ఇలాంటి లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తుదకు సుప్రీంకోర్టు స్టే లేని వంశధార ట్రిబ్యునల్ తీర్పు అమలుకు కేంద్రం చొరవ చూప కుండా సుప్రీంకోర్టు స్టే ఉండి  పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అంటే తెలంగాణ అవశేష ఆంధ్ర ప్రదేశ్ తీవ్ర నష్టం కలిగే ట్రిబ్యునల్ తీర్పు అమలు పూనుకోవడమంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.

ఈ తీర్పు అమలు జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతాయి. కర్ణాటక మహారాష్ట్ర బాగా లాభ పడతాయి. గత నెలలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కృష్ణ బేసిన్ లోని భాగస్వామ్య రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. కాని భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటంతో వాయిదా పడింది. తిరిగి ఈ 18 వతేదీ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతో పాటు అధికారులు కూడా సమావేశానికి రావాలని కోరారంటే పట్టుదలగా వున్నట్లు భావించాలి. బేసిన్ లోని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకీ భావం సాధించి తీర్పును నోటిఫై చేయ దలచినట్లు వార్తలు వచ్చాయి.

2013 లో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కి తీర్పు నోటిఫై కాకుండా స్టే తెచ్చింది. ఈ తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం కలిగించేదిగా వుందని ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా వుందనే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుండి నేటి వరకు ఈ కేసు పరిష్కారం కాలేదు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం వున్న రోజుల్లో సుప్రీంకోర్టు లో స్టే వెకేట్ చేయించేందుకు తీవ్ర యత్నాలు జరిగాయి. కొన్ని షరతులకు లోబడి తీర్పు అమలుకు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును  కోరాయి. కాని ఫలితం లేక పోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరంగా యత్నాలు సాగుతున్నాయి.

” కృష్ణ జలాల వాటాల అంశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు వైషమ్యాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఎగువ రాష్ట్రాల జల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడ వలసి ఉంది. లేకుంటే మున్ముందు రెండు రాష్ట్రాలు నష్టపోవలసి ఉంటుంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ తీర్పు తో నిమిత్తం లేకుండా వ్యవహరించాల్సి ఉంది. ఈ తీర్పు(2013) నోటిఫై జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నికరంగా దక్కేది 38 టీఎంసీలు మాత్రమే. తెలంగాణకు చెందిన జూరాలకు తొమ్మిది టిఎంసిలుఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగు గంగకు 25  టిఎంసిలు, ఆర్డీయస్ నాలుగు టీఎంసీల మాత్రం నికరంగా లభిస్తాయి. అయితే ఎందుకూ కొరకాకుండా మేక చన్నులాగా 150 టిఎంసిలు క్యారీ ఓవర్ కింద ఇవ్వబడ్డాయి. తెలంగాణ లో చాల మంది క్యారీ ఓవర్ కింద వున్న టిఎంసిల పై ఆశలు పెట్టుకొని ఉన్నారు. .”  

కృష్ణ జలాల వాటాల అంశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు వైషమ్యాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఎగువ రాష్ట్రాల జల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడ వలసి ఉంది. లేకుంటే మున్ముందు రెండు రాష్ట్రాలు నష్టపోవలసి ఉంటుంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ తీర్పు తో నిమిత్తం లేకుండా వ్యవహరించాల్సి ఉంది. ఈ తీర్పు(2013) నోటిఫై జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నికరంగా దక్కేది 38 టీఎంసీలు మాత్రమే. తెలంగాణకు చెందిన జూరాలకు తొమ్మిది టిఎంసిలు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగు గంగకు 25 టిఎంసిలు, ఆర్డీయస్ నాలుగు టీఎంసీల మాత్రం నికరంగా లభిస్తాయి. అయితే ఎందుకూ కొరకాకుండా మేక చన్నులాగా 150 టిఎంసిలు క్యారీ ఓవర్ కింద ఇవ్వబడ్డాయి.

తెలంగాణ లో చాల మంది క్యారీ ఓవర్ కింద వున్న టిఎంసిల పై ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇది ఆకాశంలో మబ్బులు చూచి కుండలో నీళ్లు పార బోసుకున్నట్లు ఈ సమయంలో వ్యవహరించ కూడదు. ఉమ్మడి రాష్ట్రంలో మిగులు జలాల ఆధారంగా ( బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు మేరకు) చేపట్టబడిన ప్రాజెక్టులకు ఈ తీర్పు నీటి కేటాయింపులు చేయ లేదు. కాని మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులు భిన్నంగా ఉన్నాయి. పైగా మరి కొన్ని అంశాలు మెడ మీద కత్తిలా ఉన్నాయి. కృష్ణ లో చుక్క మిగులు జలాలు లేకుండా నికర మిగులు జలాలన్నింటిని 448 టిఎంసిలను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ తీర్పు నోటిఫై జరిగితే 2050 సంవత్సరం వరకు ఈ విధానం అమలులో ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొనే అవకాశం లేదు. ప్రస్తుతం అమలులో వున్న బచావత్ ట్రిబ్యునల్ స్థానంలో ఈ తీర్పు అమలులోనికి వస్తుంది.

కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి జలాశయం నిర్మించిన తర్వాత సాధారణంగా జూలై ఆఖరు ఆగస్టు నెలలో గాని కృష్ణలో వరద రావడం లేదు. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయం 519 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేస్తున్నారు. ఈ తీర్పు నోటిఫై చేయ బడితే ఆల్మట్టి జలాశయం ఎత్తు 525 మీటర్లకు పెంచుకుంటారు. అదనంగా మరొక 130 టీఎంసీలు నిల్వ చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. అంటే కృష్ణకు వరద రావడం మరింత ఆలస్యమౌతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనూహ్యంగా 65 శాతం నీటి లభ్యత కింద 2293 టిఎంసిలు వుంటాయని లెక్కించి బచావత్ ట్రిబ్యునల్ లెక్కించిన నికర జలాలు 2130 తీసి వేయగా మిగిలిన 163 టిఎంసిలను నికర జలాలుగా లెక్కింది. సరాసరి నీటి లభ్యత కింద 2578 టిఎంసిలుగా లెక్కించింది. ఇందులో నుండి 65 శాతం నీటి లభ్యత 2293 టిఎంసిలు పోగా మిగిలిన 285 టిఎంసిలు మిగులు జలాలుగా లెక్కించి మొత్తం 448 టిఎంసిలను అన్ని రాష్ట్రాలకు పంపకం చేసి నదిలో చుక్క మిగులు నీరు లేకుండా చేసింది.

మరో వైపు కర్ణాటక కు 65 శాతం నీటి లభ్యత కింద 65 టిఎంసిలు సరాసరి నీటి లభ్యత కింద 105 టీఎంసీలు మొత్తం 170 టిఎంసిల తో పాటు ఏడు టిఎంసిలు ఆవిరి పారుదల కింద మొత్తం 177 టిఎంసిలు కేటాయించింది. పైగా ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుండి 525 మీటర్లకు పంచుకొనే అవకాశం కల్పించింది. అదే మహారాష్ట్ర కు 65 శాతం నీటి లభ్యత కింద 43 టిఎంసిలు నికర జలాలు సరాసరి నీటి లభ్యత కింద 35 టియంసిలు మిగులు జలాలు ఆవిరి పారుదల కింద 3 టిఎంసిలు కలిపి మొత్తం 81 టిఎంసిలు కేటాయించింది.

దుర్మార్గమేమంటే మహారాష్ట్రకు కేటాయించిన మేరకైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించకుండా వినియోగానికి కేవలం 38 టిఎంసిలు (9+25+4=38)  మాత్రమే కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 65 శాతం నీటి లభ్యత కింద 39 టిఎంసిలు సరాసరి నీటి లభ్యత కింద 145 టిఎంసిలు ఆవిరి పారుదల కింద 6 టీఎంసీలు మొత్తం 190 గణాంకాల కింద చూపినా ఎందుకూ కొరగాని క్యారీ ఓవర్ కింద 150 టిఎంసిలు చూపి అరచేతిలో స్వర్గం చూపింది. బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉపయోగించుకొనే స్వేచ్ఛ ఇస్తే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చుక్క నీరు లేకుండా అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది.

పైగా ఈ తీర్పు అమలు లోనికి రాగానే ఇప్పుడు కృష్ణ నుండి 258 టిఎంసిల (177+81=258) జలాలను ఎగువ రాష్ట్రాలు తన్నుకు పోతాయి.ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు తమ మధ్య వున్న వివాదాలు పక్కన బెట్టి సమిష్టిగా ఈ తీర్పు అమలు వ్యతిరేకించ వలసి ఉంది. ఈ తీర్పు పున: పరిశీలన జరిగితే కృష్ణలో అతి తక్కువ వాటా వున్న తెలంగాణకు మరింత న్యాయం జరగ వచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *