ఐటీ రంగం ఎగుమతుల విషయంలో తెలంగాణ దూసుకు పోతున్నది. 2024-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఎగుమతుల్లో బెంగళూరు తర్వాత స్థానాన్ని ఆక్రమించగా మహారాష్ట్ర మూడో స్ధానంలో నిలిచింది.అన్ని రంగాల ఎగుమతులను పరిగణలోకి తీసుకుంటే మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2023-24 ఆర్థిక సంవత్స రంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు ఏకంగా రూ.2.68లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని ఎస్‌టీపీఐ యూనిట్ల నుంచే ఏకంగా రూ.1.45లక్షల కోట్ల ఎగుమతులు జరిగినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం మీద ఎగుమతుల్లో తెలంగాణ వాటా 12.8%గా నిలవడం గమనార్హం.
రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ పురోగతిని పరిశీలిస్తే ఏటా 11.3% నుంచి 15% వరకు ఉంటుంది . దీన్ని గమనిస్తే రాష్ట్రం ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో చాలా వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నదని అర్థమవుతుంది. ఐటీ ఎగుమతుల పరంగా రూ.4.8లక్షల కోట్ల ఎగుమతులతో కర్ణాటక ప్రథమ స్థానంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణరూ.2.68 లక్షల కోట్లతో రెండోస్థానాన్ని, మహారాష్ట్ర రూ.1.84లక్షల కోట్లతో మూడోస్థానాన్ని ఆక్రమించాయి. ఇక సాఫ్ట్ వేర్ యూజ్ ఏ సర్వీస్ రంగంలో తమిళనాడు 0.81లక్షల కోట్లతో కీలకపోటీదారుగా నాలుగోస్థానంలో వుంది. 2025-26 ఆర్థిక సంవత్స రంలో ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం దేశం మొత్తం మీద ఉద్యోగాల కల్పనలో తెలంగాణ వాటా 16%గా నమోదైంది. నీతి ఆయోగ్ ఎక్స్ పోర్ట్ ప్రిపేర్డ్ నెస్ ఇండెక్స్-2024 ను ఈ ఏడాది తొలినాళ్లలో విడుదల చేశారు. దీని ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతుల విషయంలో తెలంగాణ దేశంలో 8వ ఉత్తమ రాష్ట్ర ర్యాంకు సాధించింది. మౌలిక సదుపాయాలు, ఎగుమతులకు సానుకూల విధానాల అమలులో తెలంగాణ పనితీరు అద్భుతంగా ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
రాష్ట్రం అమలు చేస్తున్న రెండవ ఐసీటీ పాలసీ (2021-26) ప్రకారం 2026 చివరినాటికి ఐటీ ఎగుమతులు రూ.3లక్షల కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశిస్తున్నది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం చివరినాటికే ఈ లక్ష్యాన్ని ఛేదించే అవకాశాలున్నాయన్న అంచనాలు ఐటీ రంగంలో రాష్ట్రం శరవేగంగా ముందుకెళుతోందన్న అంశం స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఐటీ ఎగుమతుల్లో 36 నుంచి 38% వాటాను కలిగివుండి ఈ రంగంలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు ఏఐ సెక్యూరిటీ, గేమింగ్ రంగాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఐటీ రంగం అభివృద్ధికి కేవలం హైదరాబాద్ మాత్రమే కేంద్రంగా ఉండటం ప్రధాన లోపంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో వరంగల్ వంటి టైర్-2 నగరాలను కూడా ఐటీ హబ్‌లుగా మర్చే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఏవిధంగా చూసినా తెలంగాణలో ఐటీ ఎగుమతి అంశాలు బలంగా వున్నాయి. అభివృద్ధిలో ఇదే వేగం కొనసాగితే రానున్న కాలంలో జాతీయ సగటును మించి రెండంకెల వృద్ధిని నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రం డీప్ టెక్, ఏఐ రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, ఎగుమతులను మరింత వేగంగా పెంచేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం “ఏఐ సిటీ”ని ప్రోత్సహిస్తోంది. సంప్రదాయ ఐటీ ఉత్పత్తులకు మించిన అధిక విలువతో కూడిన ఏఐ ఉత్పత్తుల ఎగుమతులు రాష్ట్రానికి రానున్న కాలంలో మంచి ఎగుమతి ఆదాయాన్ని సమకూర్చగలనవి ప్రభుత్వం అంచనా వేస్తున్నది. 2035 నాటికి పదిలక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగువేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటుతో పోల్చినప్పుడు స్థిరమైన అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలపై దృష్టి సారించి గ్లోబల్ టెక్ హబ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఐటీ ఎగుమతుల్లో ప్రస్తుతం అగ్రభాగాన ఉన్న బెంగళూరుకు సవాలు విసురుతోంది. బెంగళూరుతో పోల్చినప్పుడు ఖర్చు, మౌలికసదుపాయాలు, పట్టణ ప్రణాళిక పరంగా హైదరాబాద్ ఎంతో ముందంజలో ఉన్నదని కొన్ని విశ్లేషణలు తెలుపుతున్నాయి.
అయితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం రాజధాని నగరాల్లోనే ఐటీ అభివృద్ధి చెందడం పెద్ద బలహీనతగా మారింది. అదే మహారాష్ట్రలో ముంబయితో పాటు పూణె కూడా ఐటీ పరిశోధన, ఉత్పత్తి రంగాల్లో దూసుకుపోతున్నది. ఇంకా ఐటీ ఎగుమతుల విషయంలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ మహారాష్ట్ర అన్నిరంగాల ఉత్పత్తుల విషయంలో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. ఆవిధంగా మొత్తం ఎగుమతుల విషయంలో మహారాష్ట్ర సంసిద్ధత మిగిలిన రాష్ట్రాలకంటే అధికంగా ఉన్నదని నీతిఆయోగ్ స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో పరిశ్రమల స్థాపన దానికి ఈ సానుకూలతను కలిగిస్తోంది.
మహారాష్ట్రలో పూణె మాదిరిగా తెలంగాణలో మరో నగరం పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం మన దేశంలో ఐటీ రంగానికి సంబంధించి ప్రధాన నగరాలుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, ముంబయి నగరాలు కొనసాగుతున్నాయి. బెంగళూరుతో మనం పోటీ పడుతుంటే, మనల్ని దాటేందుకు మహారాష్ట్ర దూసుకు వొస్తుంది . చెన్నై కూడా శరవేగంగా ఐటీ రంగ అభివృద్ధి కి కేంద్రంగా మారుతోంది. ఇంతటి పోటీ నెలకొన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, సంప్రదాయ ఐటీ ఎగుమతులకు తోడు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణమైన వసతులను, పరిశోధనలకు తగిన ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే తెలంగాణ ఐటీ రంగంలో గ్లోబల్ హబ్‌గా నిలవగలదు!.





