కేంద్ర ఎన్నిక సంఘం

బీహార్ వోట‌ర్ల జాబితాపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న ఆదేశాల నేప‌థ్యంలో, ప్ర‌స్తుతం అందుబాటులో వున్న వోట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వంపై దేశ‌వ్యాప్త చ‌ర్చ మొదల‌య్యే అవ‌కాశాలున్నాయి. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్ పై సుప్రీంకోర్టులో వరుసగా మూడో రోజూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ ఉన్న బెంచ్‌ పై వాదనలు జరిగాయి. జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించారని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.బిహార్‌లోని వోటర్ల జాబితా నుండి ఈ ప్రత్యేక సవరణ (SIR)లో తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను తమ వెబ్‌సైట్‌లో ఉంచాలని, ఎన్నికల సంఘానికి ఆదేశిస్తూ పారదర్శకత పెంచిన సుప్రీంకోర్టుకు అభినందనలు. తొలగింపుల కారణాలను కూడా ప్రదర్శించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఇప్పటివరకు అంగీకరించని ఆధార్ కార్డులను కూడా అంగీకరించాల్సిందిగా ఆదేశించింది.

22 లక్షల మంది మరణించినట్లయితే, దానిని బూత్‌ ‌స్థాయిలో ఎందుకు వెల్లడించలేదని, పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించ‌డంలో ఎంతో వాస్త‌వముంది. ప్ర‌జ‌ల వోటుహ‌క్కును రాజ‌కీయ పార్టీలు శాసిస్తున్న వైనాన్ని అర్థం చేసుకునే బ‌హుశా న్యాయ‌మూర్తి ఆవిధంగా వ్యాఖ్యానించి వుండ‌వొచ్చు. కానీ అది నిష్టుర స‌త్యం! మ‌ర‌ణించివారి పేర్ల‌ను వెల్ల‌డించ‌క పోవ‌డానికి, స్థానిక రాజ‌కీయ నాయ‌కుల ఒత్తిళ్లు కార‌ణం కాకూడ‌ద‌నేం లేదు. రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నిక‌ల సంఘంప‌ని తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ అధికారంలో వున్న పార్టీల‌కు అనుగుణంగా దిగువ‌స్థాయిలో వోట‌ర్ల జాబితాల్లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌లు, ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తున్నాయి. బంగళూరు సెంట్రల్‌లోని మహాదేవపుర అనే ఒక అసెంబ్లీ విభాగానికి సంబంధించిన కాగితం రూపంలో ఉన్న డేటాను సేకరించడానికి కాంగ్రెస్ పార్టీ కి ఆరు నెలలు పట్టింది .. అయితే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేవలం ఆరు రోజుల్లో ఆరు లోక్‌సభ నియోజకవర్గాల ఎలక్ట్రానిక్ వోటర్ల జాబితాను పొందారు.. ఇది అధికార బిజెపి, స్వతంత్ర సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు కాకపోతే మరేమిటి? ఈ దేశంలో నకిలీ వోటర్ల ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను అనురాగ్ ఠాకూర్‌ నిరూపించినట్లయింది.

రాజ‌కీయ‌ పార్టీలు జాగ్ర‌త్త‌గా త‌మకు అనుకూలంగా ఉన్న‌వారి వోట‌ర్ల‌ను చేర్పించ‌డం, ప్ర‌త్య‌ర్థి వోట‌ర్ల‌ను తొల‌గించ‌డం వంటి అకృత్యాల‌కు పాల్ప‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఇందుకు ఉదాహ‌ర‌ణ వోట‌రు కార్డుతో వెళ్లిన ఎంతోమంది వోట‌ర్లు త‌మ పేర్లు జాబితాలో లేక వెన‌క్కి తిరిగి రావ‌డం మ‌నం టీవీ ఛాన‌ళ్ల‌లో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి త‌ప్పుడు ప‌నుల‌కు రాజ‌కీయ పార్టీలే ప్ర‌ధాన కార‌ణం. ఉదాహ‌ర‌ణ‌కు రాయ్ బరేలి లో 2 లక్షల వోట్ల పై బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఉత్తర ప్రదేశ్ కనౌజ్ లోక్ సభ నియోజక వర్గం లో దాదాపు మూడుల‌క్ష‌ల‌ అనుమానాస్పద వోట్లు అంటూ అఖిలేష్ యాదవ్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా తాను బ‌ల‌హీనంగా ఉన్న‌చోట్ల ఇదేవిధ‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంది. బ‌ల‌మున్న‌వాడిదే రాజ్య‌మ‌న్న రీతిలో కొన‌సాగుతున్న మ‌న ప్ర‌జాస్వామ్యంలో బ‌ల‌హీనులైన వోట‌ర్ల హ‌క్కులు క‌చ్చితంగా అధికారం లో ఉన్న రాజ‌కీయ పార్టీల ద‌యాదాక్షిణ్యాల‌పైనే కొన‌సాగుతున్నాయ‌న్న‌ది నిష్టుర స‌త్యం. స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘం అధికార రాజకీయ పార్టీలతో కుమ్మక్కు కావడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాద కరం. వోటు హక్కు కేవలం రాజ్యాంగబద్ధ హక్కు కాదు – అది ప్రజాస్వామ్య ఊపిరి.

బీహార్‌, ప‌శ్చిమ‌బెంగాల్ వంటి అట‌విక పాల‌న సాగుతున్న రాష్ట్రాల్లో ఇది మ‌రింత స‌ర్వ‌సాధార‌ణం. ఇప్పుడు ప‌శ్చిమ‌బెంగాల్‌లో కూడా త్వ‌ర‌లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో, మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్ప‌టికే దిగువ‌స్థాయి అధికార్ల‌కు త‌మ‌కు అనుకూలంగా ప‌నిచేయాల‌ని హెచ్చ‌రిక‌లు జారీచేసిన‌ట్టు వొస్తున్న వార్త‌లు నిజ‌మైతే, ఎన్నిక‌ల సంఘం నిష్ప‌క్ష‌పాతంగా ఏవిధంగా ప‌నిచేయ‌గ‌లుగుతుంది? ఇది ఒక్క బెంగాల్‌కే ప‌రిమితం కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో జ‌రుగుతున్న తంతే ఇది! కాక‌పోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు. అంతే! కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఎన్నిక‌ల సంఘంపై వ‌రుస‌గా చేస్తున్న ఆరోప‌ణ‌లు వ్యూహాత్మ‌కం కావొచ్చు! కానీ రాజ‌కీయ పార్టీలు అమాయ‌కులైన ప్ర‌జ‌ల వోటు హ‌క్కును వివిధ రూపాల్లో శాసించడం వ‌ల్ల‌నే, చ‌నిపోయిన వారి పేర్లు, వ‌ల‌స వెళ్లిన‌వారి పేర్లు జాబితాల్లో కొన‌సాగ‌డం జ‌రుగుతోంది! అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కే రాజ‌కీయ పార్టీలు, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డానికి నిరంత‌రం చేసే య‌త్నాల్లో భాగ‌మే ఈ వోట‌ర్ల జాబితాల తారుమారుకు కార‌ణం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *