కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి అడుగులు

మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేస్తామని ప్రకటన
తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు..

 కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించిజ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సమావేశం సోమవారం డాక్టర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మంత్రులు దుద్దిళ్ల  శ్రీధర్ బాబుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. సబ్ కమిటీతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్ టిఏ)పౌర సంఘాల ప్రతినిధులు సమావేశమై పలు డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

మంత్రుల ప్రతిపాదనలు ..
యూహెచ్ టీఏ, సివిల్ సొసైటీ ప్రతినిధుల డిమాండ్లను పరిశీలించిన తదుపరి త్రిసభ్య మంత్రుల కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, పేర్కొన్న 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసుల పహారా తప్పనిసరి చేయాలి. క్యాంపస్‌ లోని మిగిలిన ప్రాంతాల నుంచి పోలీసులను ఉపసంహరించుకోవాలనే అంశం గురించి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ప్రభుత్వం నుంచి లేఖ రాస్తాం. విద్యార్థులు, వసతి గృహాల భద్రత గురించి వీసీ హామీ ఇచ్చిన తర్వాత, 400 ఎకరాల్లో మినహా, క్యాంపస్ నుంచి పోలీసులను ఉపసంహరించుకుంటామని మంత్రులు పేర్కొన్నారు.

విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌కు సంబంధించి, హెచ్ సీయూ విద్యార్థులపై దాఖలైన కేసుల పట్ల సానుభూతితో కూడిన దృక్పథానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. అంతే కాకుండా, సాధ్యమైనంత త్వరగా కేసుల ఉపసంహరణకు పోలీసు శాఖ/న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, తదుపరి కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరిని 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేం.

విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి కమిటీ అనుకూలంగా ఉంది. కానీ సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న దృష్ట్యా న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంత్రుల బృందం రాలేదు. అయితే ఈ విషయంపై విద్యార్థుల సూచనలు, సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని మంత్రులు వెల్లడించారు. సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ CC, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్య భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, ఎన్ ఏపీఎం వి.సంధ్య, డబ్ల్యూటిజెఏసీ  కె.సజయ, డబ్ల్యూటిజెఏసీ  ఇమ్రాన్ సిద్ధిఖీ, సీడబ్ల్యూఎస్ -ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *