బడ్జెట్ లో ఉద్యమకారులకు గుండు సున్నా

“ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం అందరూ జాక్ లాగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది, జయశంకర్ సార్ చెప్పినట్లు వీలైతే అందరూ కలసి లక్ష్య సాధన కోసం పని చేయాలి లేకపోతే సమాంతరంగా పని చేయాలి కానీ ఘర్షణలకు మాత్రం తావు లేకుండా పని చేయాలి అని గుర్తుంచుకొని ముందుకు సాగాలి..”

devi prasad
దేవి ప్రసాద్ 
తెలంగాణ ఉద్యోగుల జాక్, పూర్వ అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచింది, భవిష్యత్ పాలనలో ప్రజలకు మేలు చేసే విధానాలు లేకపోవడం బాధాకరం, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడవ బడ్జెట్ లో కూడా హామీల అమలు కోసం ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు ప్రకటించకపోవడం పలాయనవాదంలో భాగమే, నిర్మాణాలకంటే హైడ్రా ద్వారా కూల్చివేతలకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వ విధానాలు,పాలన ఎలా ఉంటుందో తేలిపోయింది, రైతు బంధు, పెన్షన్ హెచ్చింపు, మహిళలకు పెన్షన్, ఉద్యమకారులకు ఇంటి స్థలం, అమరులకు పెన్షన్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఉద్యోగులకు పీఆర్సీ వంటి ముఖ్యమైన అంశాలు అమలు కోసం కనీస ప్రస్తావన చేయకుండా ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బడ్జెట్ తేటతెల్లం చేసింది.

     తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన అనేక వర్గాలకు ఉద్యమకారుల స్ఫూర్తి వెలకట్టలేనిది. అన్ని వర్గాల వోటర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న వారికి, అమరులకు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది ఇందులో ముఖ్యమైనది తెలంగాణ తొలి, మలి ఉద్యమం లో అమరులైన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు 25000 నెలకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కనీసం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు, అర్హుల జాబితా ఎంపిక కోసం విధి విధానాలు రూపొందించలేదు, తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమం దాదాపు ఆరు దశాబ్దాలు వివిధ దశల్లో, రూపాలలో జరిగింది, మలి దశ ఉద్యమ కాలంలో పాల్గొన్న కుటుంబాల వివరాలు సేకరించడానికి ఆనాటి క్రియా శీలక ఉద్యమకారులు వివిధ సామాజిక నేపథ్యంతో ఉన్నారు వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక కమిటీ వేసి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలి.
    మలిదశ ఉద్యమం చాలా విస్తృత విశాల ప్రజా ఉద్యమంగా కొనసాగింది ఇందులో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తో పాటు విప్లవ పార్టీలు, కవులు కళాకారులు, మేధావులు,జర్నలిస్టులు ఇంకా  అనేక సంస్థలు పాల్గొన్నాయి, ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనులు పాల్గొన్నారు, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక స్థోమత తో సంబంధం లేకుండా గౌరవ పెన్షన్ ఇవ్వలిసిన అవసరం ఉంది, చాలా మంది అమరుల వివరాలు పోలీస్ స్టేషన్ లలో అసహజ మరణంగా నమోదు కాకపోవడం వలన అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, గత కెసిఆర్ ప్రభుత్వం దాదాపు 500 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు.. 10 లక్షల ఆర్థిక సహాయం అందించింది, ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు సాంస్కృతిక శాఖ  ద్వారా 600 ఉద్యోగాలు కల్పించింది, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చింది. రకరకాల ప్రభుత్వ నిబంధనల వలన అందరికీ ప్రయోజనం చేకూరలేదు, అందరికీ ఉద్యమ ప్రయోజనాలు లభిస్తాయి అని భావించిన ఉద్యమకారులకు నిరాశ తప్పలేదు, దీనిని వోట్ బ్యాంక్ గా మార్చుకొనే అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకొని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు.. పెన్షన్ ఇవ్వలేదు.
   మళ్లీ ఉద్యమకారులు వివిధ సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుక రావడానికి కృషి చేస్తున్నారు,ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం వల్ల కార్యాచరణకు సిద్ధం కావడం మొదలైంది, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకున్నారు, చలో అసెంబ్లీ నిర్వహించి నిరసన తెలిపారు. మరో హామీ ఉద్యమకారులకు 250 గజాల స్థలం.. గౌరవ భృతి  అని చెప్పారు కానీ ఇప్పటివరకు ప్రభుత్వ స్థాయిలో ఒక్క సమావేశం కూడా జరుగలేదు, మలి దశ ఉద్యమం లో పాల్గొన్న వారు అన్నివర్గాలలో ఉన్నారు, వారితో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించే ప్రయత్నం జరుగలేదు, కోదండరాం గారు ఒక జాబిత ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నది, తెలంగాణ ఉద్యమం మొత్తం కోదండరాం నడుపలేదు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా నడిపిన విషయం తెలిసిందే..!
    ఉధ్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఆనాటి ఉద్యమ నేతలతో రాజకీయ, ప్రజా సంఘాల ఉద్యమ సంస్థల ను సంప్రదించి ఒక కమిటీ వేసి సమస్యకు పరిష్కారం చూయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 సంవత్సరాలు పూర్తి అయింది.
ఉద్యమం లో పాల్గొనని వాళ్లు కూడా ఇప్పుడు ఉద్యమ కారులం అని చెప్పి ప్రభుత్వ సహాయం కోసం ముందు వరసలో నిలబడి ఉన్నారు వారందరికీ ధైర్యం ఉద్యమంలో లేని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం అందరికి తెలుసు. ఉద్యమంలో పాల్గొనని వారు, ఉద్యమకారుల అణిచివేత లో భాగంగా ఉన్నవారి పట్ల ఉద్యమ కారులు అప్రమత్తంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి, వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా నుండి విముక్తి చేశామని చెబుతున్న ప్రభుత్వానికి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడానికి మనసు రావడం లేదు     అందాల పోటీలకోసం, మెస్సీ ఫుట్‌బాల్ ఆట కోసం, మూసీ పునర్జీవ అందాల కోసం, నాలుగవ నగరం కోసం, అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ సంక్షేమం కోసం వేలాది కోట్లు వెచ్చించడానికి  ప్రభుత్వం సిద్ధం కావడం విశేషం,కానీ ఉద్యమకారుల సంక్షేమంకోసం, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఎలాంటి కేటాయింపులు చేయలేదు.  42 రోజుల సకల జనుల సమ్మె, పది రోజుల పెన్ డౌన్ తో పాటు అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారుల కోసం మరియు పాలకుల నాన్చివేతకు నిరసనగా తమ అమూల్య ప్రాణాలను అర్పించిన అమర వీరులకు తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం దారుణం.  నిరుద్యోగ యువకుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి..
    ఉద్యమకారులు తెలంగాణ ఏర్పడ్డ తరువాత వివిధ రాజకీయ పార్టీలలో భాగం అయ్యారు, కోదండరాం గారు స్వయంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, ఇలాంటి స్థితిలో సహజంగానే ఉద్యమ కారుల పేరిట అనేక సంస్థలు ఏర్పడ్డాయి కొన్ని సంఘాలు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రచారం చేస్తూ వినతులు ఇస్తున్నారు.  మరి కొన్ని సంస్థలు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని ఆందోళనకు దిగుతున్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం అందరూ జాక్ లాగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది, జయశంకర్ సార్ చెప్పినట్లు వీలైతే అందరూ కలసి లక్ష్య సాధన కోసం పని చేయాలి లేకపోతే సమాంతరంగా పని చేయాలి కానీ ఘర్షణలకు మాత్రం తావు లేకుండా పని చేయాలి అని గుర్తుంచుకొని ముందుకు సాగాలి.
    ఉద్యమకారుల గుర్తింపు కోసం వివిధ దశలలో కార్యాచరణ  రూపందించాలి .. తొలి ప్రాధాన్యత అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం, రెండవ ప్రాధాన్యత నెలల తరబడి జైలు జీవితం, నిర్బంధం ఎదురుకున్న కుటుంబాలు, మూడవ దశలో ఉద్యమాలలో పాల్గొన్న అన్ని వర్గాలు ముఖ్యంగా విద్యను , వృత్తి పరంగా నష్టపోయిన అనేక కుటుంబాలు దీనితో పాటు 1969 తెలంగాణ ఉద్యమం లక్ష్యం సాధించాక పోవడంతో వివిధ సామాజిక ఉద్యమాలలో ప్రజల కోసం పని చేసి ప్రాణాలు కోల్పోయిన వేలాది కుటుంబాల విషయం కూడా ఆలోచిస్తేనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది కుటుంబాలకు స్వాతంత్ర సమర యోధుల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం 1972 నుండి ఇస్తున్నది, అందులో నుండి అవసరమైన విధి విధానాలను ఆచరణలోకి తీసుకు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు, అద్దంకి దయాకర్, తో పాటు కోదండరాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి నేతలు బాధ్యత తీసుకొని అన్ని రాజకీయ పార్టీల తో, సంఘాలతో ఉద్యమ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *