శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్రామాయణ ఫలశ్రుతి

“బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు వీచారు. వాయుదేవుడు బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన సరాన్ని అర్పించాడు. గంధర్వులు దివిలో ఆడారు, పాడారు..”

(శనివారం, మార్చ్ 28, 2026 న భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా)

-వనం జ్వాలా నరసింహారావు

శనివారం, మార్చ్ 28, 2026 న భద్రాచలంలో సీతారామ (రామనారాయణ, మహాలక్ష్మి) కల్యాణం జరిగిన మరుసటిరోజు రామపట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరామాయణంలో అత్యద్భుతమైన ఘట్టం శ్రీరామ పట్టాభిషేకం. రావణుడి వధ, విభీషణుడి పట్టాభిషేకం, సీతాదేవికి విముక్తి, తనవారందరితో కలిసి శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్య సమీపానికి రావడం, తదనంతర అంశాలు ఆసక్తికరమైనవే కాకుండా, అవశ్య పఠనీయం. శ్రీరామ పట్టాభిషేకం నాడు మరీముఖ్యంగా చదవాల్సిన సన్నివేశాల సమాహారం.

నమస్కారం చేసిన భరతుడిని ప్రేమగా, ఆనంద భాష్పాలు రాలుతుంటే కౌగలించుకుని, ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు.  భరతుడు సీతాదేవికి నమస్కారం చేసి, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, మైంద, ద్వివిదులను, గంధమాదనుడిని, ఇతర వానర వీరులను ప్రేమగా కౌగలించుకున్నాడు. ఆపత్కాలంలో సహాయం చేసిన సుగ్రీవుడిని ప్రత్యేకంగా ప్రశంసించాడు. తమ నలుగురు సోదరులలో సుగ్రీవుడిని కూడా కలుపుకుని మొత్తం ఐదుగురమని అన్నాడు. విభీషణుడు సహాయం వల్లే అసాధ్యకార్యం సాధించగలిగామని గౌరవంగా ఆయనకు చెప్పాడు. శత్రుఘ్నుడు కూడా సీతారామలక్ష్మణులకు అభివాదం చేశాడు.

          శ్రీరామచంద్రుడు తల్లి కౌసల్యకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సుమిత్రకు, కైకకు, వశిష్టుడికి మొక్కాడు. పురజనులంతా రాముడికి స్వాగతం పల్కారు. కుశల ప్రశ్నల తరువాత భరతుడు తన దగ్గరున్న ‘బంగారు పాదుకలను’ రాముడి పాదాలకు తొడిగి, చేతులు జోడించి, రాజ్యమంతా ఆయనదేనని, ఆయన లేని కారణాన రక్షణగా ఉండి, అప్పగిస్తున్నానని, ధనాగారం, ధాన్యాగారం పరీక్షించమని, తన సామర్థ్యం వల్ల కాకుండా, రాముడి తేజస్సు వల్ల అవన్నీ పదింతలై పెరిగాయని, సర్వం గ్రహించమని, అన్నాడు. భరతుడితో కలిసి శ్రీరాముడు సైన్యంతో సహా నందిగ్రామంలోని అతడి ఆశ్రమానికి బయల్దేరి పోయాడు. నందిగ్రామంలో పుష్పక విమానాన్ని వెనక్కు పంపాడు. వశిష్టుడి పాదాలను తాకగా, వారిద్దరూ వేర్వేరు పీటలమీద ఆసీనమయ్యారు.

          తన తల్లి వాక్యాన్ని పాలించి రాజ్యాన్ని, లక్ష్మిని వదిలి ఆమెను గౌరవించానని, రాముడికి ఆయన రాజ్యమంతా అప్పచెప్తున్నానని, రాజ్యభారం మోయలేనని, గొప్పదైన ప్రయత్నం చేస్తేనే కాని రక్షించలేని రాజ్యాన్ని మహాత్ముడైన రాముడే పాలించ సమర్ధుడని, పట్టాభిషిక్తుడైన రాముడినిలోని సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య, కారుణ్య, పరమోదారత్వ, మధురభావ గుణాలను చూసి ప్రజలంతా సంతోషిస్తారని భరతుడు అంటాడు. ఎంతవరకు భూమ్యాకాశాలు, నక్షత్ర మండలం ఉంటాయో  అందాకా రాముడి ప్రభుత్వం వర్ధిల్లుతుందని అన్న భరతుడి మాటలకు సరే అన్నాడు రామభద్రుడు.

          ఆ తరువాత క్షురకులు శ్రీరామ లక్ష్మణ భరతులకు మీసాలు కత్తిరించి, గడ్డాలు, క్షౌరం చేశారు. స్నానానంతరం, శ్రీరాముడు వెలగల వస్త్రాలను ధరించి, అలంకరించుకుని, త్రిలోకాభిరాముడై ఉండగా, రామలక్ష్మణులకు శత్రుఘ్నుడు ఆభరణాలు తొడిగాడు. సీతాదేవిని స్వయంగా, ఆమె అత్తగార్లే మనోహరంగా అలంకరించారు. అప్పుడు, ఒక దివ్యరథాన్ని సిద్ధం చేసి సుమంత్రుడు తీసుకొచ్చాడు. రామచంద్రమూర్తి దాన్ని ఎక్కి అయోధ్యకు పయనించాడు. ఆ రథం వెంట సుగ్రీవుడు, హనుమంతుడు ఇతరులు పయనించారు. వారివెంట సుగ్రీవుడి భార్యలు, వారి పరిచారికలు బయల్దేరారు. శ్రీరామాదులు ప్రయాణ సన్నాహంలో ఉండగానే మంత్రులు అశోకుడు, సుమంత్రుడు, విజయుడు (వారితో పాటు దశరథుడి భార్యలు) ముందుగా అయోధ్యకు పోయి వసిష్టుడితో, రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకొమ్మని చెప్పారు.

  రామచంద్రమూర్తి  ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథం మీద ఎక్కి అయోధ్యా పురంలో రాచబాటల వెంట పయనించసాగాడు. భరతుడు రథానికి సారథ్యం చేశాడు. ఉత్తమ శ్వేతఛ్చత్రం శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి శిరస్సుమీద విసనకర్రతో కుడి చేత్తో విసురుకుంటూ నిలబడ్డాడు. ఎడమ చేత్తో లక్ష్మణుడు వింజామర పట్టుకున్నాడు. సుగ్రీవుడు శత్రుంజయమనే ఏనుగునెక్కి బయల్దేరి వచ్చాడు. వానర శ్రేష్ఠులు మనుష్యుల ఆకారంలో ఏనుగులమీద బయల్దేరారు. నగారా ధ్వనులు, శంఖాల మోతలు, వీణల ధ్వనులు మోగుతుంటే రామచంద్రమూర్తి మేడలు, మిద్దెలు చూసుకుంటూ పోయాడు. రామచంద్రమూర్తిని అమాత్యులు, పురజనులు, బ్రాహ్మణులు సేవిస్తూ ఉంటే, విశేషంగా ప్రకాశించాడు. మంగళవాద్యాలు మోగసాగాయి. పచ్చటి అక్షింతలు తీసుకుని బ్రాహ్మణులు, కన్యకలు, ఆవులు ముందు పోయారు.

          అయోధ్య చేరిన శ్రీరాముడు ఇక్ష్వాకు వంశరాజుల నివాసమైన దశరథుడి ఇంట్లోకి ప్రవేశించాడు. ముగ్గురు తల్లులకు సాష్టాంగనమస్కారం చేసి, సుగ్రీవుడికి తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేయమని  భరతుడికి చెప్పాడు. హనుమంతుడు, వేగదర్శి, జాంబవంతుడు, ఋషభుడిని పిలిచి, నాలుగు బిందెలు ఇచ్చి, నాలుగు సముద్రాల నుండి నీళ్ళు తీసుకుని ఉదయంలోపు రావాలని ఆదేశించాడు సుగ్రీవుడు. వారు తక్షణమే, దివ్య నదీ తీర్థాలతో నిండిన బిందెలు తెచ్చారు. మరికొందరు ఐదొందల నదుల తీర్థాలు తెచ్చారు. తూర్పు, దక్షిణ, పడమటి, ఉత్తర సముద్రాల నుండి సుషేణుడు, మరో ఋషభుడు, గవయుడు, నలుడు బంగారు బిందెలలో సముద్ర జలాలను తెచ్చారు.

శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టం

          శాంతచిత్తుడు, బ్రాహ్మణ శ్రేష్టులతో కూడిన వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొదలైన ఎనిమిదిమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న  జలాలతో వారిని అభిషేకించారు. ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవతల, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు.

బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు వీచారు. వాయుదేవుడు బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన సరాన్ని అర్పించాడు. గంధర్వులు దివిలో ఆడారు, పాడారు.

శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక ఉత్సవం జరగగా పచ్చిటి పైరులు భూమంతా నిండాయి. చెట్లన్నీ పరిమళాలతో పూచాయి, కాచాయి. రామచంద్రమూర్తి విరివిగా బ్రాహ్మణులకు, తక్కిన వారికి వస్త్రాలు, ఇతర దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతిగా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైడూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూడినదైన, మనోహరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూడిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రామచంద్రమూర్తి.

          పరిశుభ్రమైన దువ్వలువలు, బంగారు భూషణాలు, తన మెడలో ఉన్న  ఒక అందమైన హారాన్ని, సీతాదేవి భర్త అనుమతితో ఆంజనేయుడికి ఇచ్చింది. వాస్తవానికి హారాన్ని ఎవరికీ ఇస్తే బాగుంటుందని భర్తను అడిగినప్పుడు, ఎవరు తన గుణాలతో ఆమెను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటివాడికి ఇవ్వమని అన్నాడు. అది ధరించి హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బహుమానాలు రాముడిచ్చాడు. అలా వానరనాథులందరికీ ఇచ్చాడు. విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బహుమానాలు, గౌరవాలు తృప్తితీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు.

రామచంద్రమూర్తి భరతుడికి యౌవరాజ్యాన్ని ఇచ్చి, అశ్వమేధయాగం, పౌండరీకం, వాజపేయం లాంటి యజ్ఞాలను చేశాడు. ఆయన రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలు మనోవేదనలు లేకుండా, ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండేవారు. కలహించుకోలేదు. దొంగతనం అంటే తెలియదు. దారిద్ర్యం అసలే లేదు. ఏనోట విన్నా రామశబ్దమే! ఏకథ విన్నా రాముడి కథే! ప్రపంచం అంతా రామమయం అయింది. వృక్షాలు, ఋతువులు, నియమం లేకుండా సర్వదా పుష్పాలతో, పండ్లతో, కొమ్మలతో కూడి వుండేవి. కరువు భయం లేనేలేదు. సకాలంలో వానలు పడేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారివారి వర్ణాశ్రమ ధర్మాలను నియమం ప్రకారం పాటిస్తూ శుభలక్షణాలు కలిగి వుండేవారు. ఈ విధంగా శ్రీ రామచంద్రమహారాజు పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు.

ఫల శ్రుతి

          నారద మహర్షి వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించినప్పుడు ముందు భూతకాలం చెప్పి, తరువాత భవిష్యత్కాలం చెప్పాడు, వాల్మీకి ప్రశ్న వేయడానికి ముందే “ఎవ్వడీ ధారుణిని యీకాలంలో” అనే ప్రశ్నించాడు కాని, గడిచినవారి గురించి కాని, రాబోయేవారిని గురించి కానీ ప్రశ్నించలేదు. అవతారానికి ముందే రామాయణం రచించినట్లయితే కొంత భూతార్థకంలో, కొంత వర్తమానార్థకంలో, కొంత భవిష్యత్ అర్థకంలో చెప్పాల్సిన పనిలేదు. అవతారానికి ముందే రామాయణం రచించడం జరిగిందని అంటే చాలా విరోధాలు వస్తాయి. అలా చెప్పడానికి ఒక్క ఆధారమైన రామాయణంలో లేదు. రామాయణం వేదంలాగా స్వతఃప్రమాణం. దానిలోని విషయాలను ఋజువు చేయడానికి ఇతర ప్రమాణాలు లేవు.

          రామాయణమే ఆదికావ్యం. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి దీన్ని అశ్వమేధయాగం చేయడానికి పూర్వం రచించి బహిర్గతం చేశాడు. ఇది పుణ్యం కలిగించి ఆయువును వృద్ధి చేస్తుంది. ఇది మిక్కిలి కీర్తికరం. రాజులకు గెలుపు కలిగిస్తుంది. దీన్ని చదువుతే (పఠిస్తే) సకల పాపాలు తొలగిపోతాయి. కొడుకులు కావాలనుకున్నవారికి కొడుకులు, ధనం కోరినవారికి ధనం లభిస్తుంది. రామాభిషేక విధానం విన్న రాజు శత్రువులను గెలిచి రాజ్యం పాలిస్తాడు. రామాయణం ప్రజలు వింటే, వారి ఆయువు వృద్ధి అవుతుంది.

కోపాన్ని జయించి, శ్రద్ధగా, ఏకాగ్ర మనస్సుతో, వేదార్థం విస్తరించిన, వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణాన్ని మంచి మనసుతో చదివేవాడు సమస్త దుఃఖాలను దాటుతాడు. మరణించిన తరువాత మోక్ష సుఖం కలుగుతుంది. జీవించిన కాలంలో శ్రీరామ కటాక్షం వల్ల వాడి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది సత్యం సత్యం అని స్వానుభవం వల్ల ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు ఆయన రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. ఆయనగారు సంకల్పించిన మహాకార్యం అతడి శక్తికి మించినవైనా లోకోత్తరంగా అన్నీ నెరవేరాయి.

          రామాయణ కావ్యం వినేవారిని గురించి దేవతలు సంతోషిస్తారు. వారి ఇండ్లలో దుష్టగ్రహాలు నిలవలేక పారిపోతాయి. రాజు వింటే భూమిని జయిస్తాడు. పరదేశంలో ఉన్నవాడు ఆపద లేక ప్రయాణం చేస్తాడు. స్త్రీ వింటే ఆమెకు ఉత్తమ గుణాలుకల కొడుకులు పుట్తారు. ఎవరైతే ఈ రామాయణాన్ని ఇష్టంగా పఠిస్తాడో వాడి పాపాలన్నీ హరిస్తాయి.

శ్రీరాముడు ఏనాడో మరణించాడు కదా! అలాంటివాడు తనను సేవించినవారికి ఎలా సహాయం చేస్తాడు? అని ప్రశ్నించేవారికి సమాధానం రామాయణంలోనే ఉంది. రామచంద్రమూర్తి నారాయణుడు. సమస్త భూతాలకు స్థానమై సర్వం తానై ఉండేవాడు. కాబట్టి ఆనాడున్నాడు, నేడు లేడని అనకూడదు. సమస్త ప్రపంచానికి ప్రభువైన రాముడు లేకపోతే లోకం అనాయకమౌతుంది. అవతారానికి ముందు కాని, తరువాత కాని రామచంద్రమూర్తి లేకపోలేదు. రామచంద్రమూర్తి లేడంటే భగవంతుడు లేడని అర్థం. ఎందుకంటే ఆయనే ఆదిమదేవుడైన హరి.

బ్రహ్మరుద్రాదులు లేనికాలంలో ఆయన ఉండి  వీరందరి జన్మకారకుడైనాడు. ఆయనే ఒక కాలంలో లేడంటే ఇక ఉండేది ఏమిటి? దీర్ఘబాహుడైన యితడు సాకారుడు కాని నిరాకారుడు కాదు. ఈయన లక్ష్మీపతి. ఒంటరివాడుకాదు. లక్ష్మీ విశిష్టుడు. నరసింహాతారంలో లాగా సర్వాంతర్యామి అయిఉంటాడు. ఒక కాలంలో ఉండి వేరే కాలంలో లేకుండా ఉండడు. ఇలాంటివాడు శ్రీరామచంద్రమూర్తి.

శుభకరమైన ఈ కావ్యాన్ని వింటే ధనధాన్య వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుంది. సద్గుణాల స్త్రీ సాంగత్యం, ఉత్తమ సౌఖ్యం లభిస్తుంది. పరమార్థమైన మోక్షం ప్రాప్తిస్తుంది. క్షేమ పద్ధతిన ఆయువు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. ఇది సోదర స్నేహం, సౌఖ్యం, సాదుబుద్ధి, తేజస్సు కలిగిస్తుంది. పుణ్యలాభం కోరి దీన్ని వినే సత్పురుషులు నియమంగా చపలత లేని మనస్సుతో గ్రంథమంతా వినాలి. రామాయణ శ్రవణ పఠనం వల్ల దుష్ట రోగాలు మానుతాయి. ఇది ప్రమాణానుభవ సిద్ధం.

రామాయణం పురావృత్తమణి అని చెప్పడం జరిగింది. పురావృత్తాలెన్నో ఉన్నాయి. అవి రామాయణానికి సరికావు. ఎందుకంటే, శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ కావ్యంలో అనృతం కొంచెమైనా ఉండదని బ్రహ్మ వరం. ఇది వేదం స్వరూపం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు రాసింది కాబట్టి ఇది పురాతన చరిత్ర అన్నారు.

రామాయణ పఠనం వల్ల, రామ కథా శ్రవణం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. ఈ విధంగా వేదార్థం తెలిపే ఈ రామాయణ కావ్యం పూర్వం వాల్మీకి మహర్షి లోకులకు ఉపకారం చేయడానికి దాన్ని సంహితగా రచించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *