Vice President Election: తెలంగాణా కు గౌరవం

దేశంలోని రెండు ప్రధాన పార్టీలు ఇప్పుడు దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నది. ఉపరాష్ట్ర పదవికి జగదీప్‌ ‌ధన్‌ఖండ్‌ ‌రాజీనామాచేయడంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్‌ 9‌న జరుగనున్న ఈ ఎన్నికలకోసం బిజెపి, కాంగ్రెస్‌లు పోటాపోటీగా తమ అభ్యర్ధులను ప్రకటించాయి. విచిత్రమేమంటే ఈ రెండు పార్టీలు కూడా ఈసారి దక్షిణాది ప్రాంతానికి చెందినవారినే తమ అభ్యర్ధులుగా ఎంపిక చేసుకోవడం. చాలాకాలంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. ఒక విధంగా దక్షిణాది రాష్ట్రాల పాలకులు కేంద్రంపైన యుద్దం ప్రకటించాయనే చెప్పవచ్చు.

నిధులు కేటాయించడంలోనూ, భారీ స్థాయి పరిశ్రమలకు అనుమతించే విషయంలో తమ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు లేదా తమ స్నేహ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నదన్న ఆరోపణను కేంద్రం మోస్తున్నది. తమిళనాడుతో పాటు గత తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయంలో బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలియంది కాదు. గత కెసిఆర్‌ ‌ప్రభుత్వమైతే కేంద్ర ప్రభుత్వ సవితితల్లిప్రేమను ఎలుగెత్తి చాటారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదంటూ పలు అంశాలను ఏకరువు పెట్టారు. జాతీయ ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల వాటానే అధికమైనప్పటికీ నిధుల మంజూరులో మాత్రం కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యమిస్తున్నదంటూ పలుసార్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలియంది కాదు. అయినా దక్షిణాదిలో బిజెపి దూకుడును ఈ పార్టీలు అడ్డుకోలేకపోతున్నాయి.

ఉత్తరాధిలో బలమైన పార్టీగా ఎదిగిన బిజెపి కొంతకాలంగా దక్షిణాది పైన దృష్టిపెట్టింది. అందుకు తెలంగాణనే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు నడుపుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 2014 నుంచే తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలని కలలు కంటూ వొస్తున్నది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా రెండు స్థానాలనే గెలుచుకున్న బిజెపికి దక్షిణాదిన తెలంగాణ అండగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బిజెపికి ఇక్కడి ప్రజలు తమను ఆదరిస్తున్నారన్న నమ్మకం ఏర్పడింది.

దానికి తగినట్లుగా తెలంగాణను సాధించిన పార్టీగా బిఆర్‌ఎస్‌ ‌పదేళ్ళపాటు రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానాన్నికూడా సాధించుకోలేకపోయింది. ఇది కూడా బిజెపికి నైతిక బలాన్నిచ్చి నట్టు అయింది. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది తామేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నది . పక్క రాష్ట్రమైన ఏపిలో బీజేపీ తో జతకట్టిన టీడీపీ అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళలో కూడా తమ పార్టీని విస్తృతపర్చుకునే వ్యూహంలో భాగంగానే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని తమిళనాడుకు చెందని సిపీ రాధాకృష్ణను ఎంపిక చేసుకుంది బిజెపి. ఈ ఎన్నికల ద్వారా దక్షిణాదిరాష్ట్రాలపై తమ పార్టీ ప్రభావం పడకపోదన్న ఆలోచనలో బిజెపి ఉంది.

కాగా దక్షిణాధిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోఉన్న కాంగ్రెస్‌ కూడా వ్యూహాత్మకంగానే ఈ ప్రాంతానికి చెందిన అభ్యర్థినే ఉపరాష్ట్రపతి పోటీకి నిలుపుతున్నది. తెలంగాణరాష్ట్రంనుండి మొదటిసారిగా ఉపరాష్ట్రపతిలాంటి అత్యున్నత పదవికి అభ్యర్థిని కాంగ్రెస్‌ ఎం‌పిక చేసుకోవడం నిజంగా ఈ ప్రాంతాన్ని గౌరవిచ్చినట్లు అయింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ ‌జడ్జి జస్టీస్‌ ‌బి. సుదర్శన్‌రెడ్డి (79) తెలంగాణ ప్రజలందరికీ చిరపరిచితుడే. అంతేకాగ తెలంగాణ మొదలు దిల్లీ కాంగ్రెస్‌ ‌నాయకులందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రంగారెడ్డిజిల్లా ఆకుల మైలారంలో 1946 జూలై 8న జన్మించిన జస్టీస్‌ ‌సుదర్శన్‌రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీలో న్యాయశాస్త్రం అభ్యసించిన వ్యక్తి. 1971లో ఏపి బార్‌ ‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని అంచలంచలుగా ఎదిగారు.

1993లో ఏపి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయవాదిగా సుమారు నాలుగేళ్లపాటు(2011) పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన అనేక సంచలనాత్మక తీర్పులు చెప్పారు. రిటైర్డ్ అయిన తర్వాత గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ గా , హైదరాబాద్‌ అం‌తర్జాతీయ ఆర్బిట్రేషన్‌, ‌మీడియేషన్‌ ‌సెంటర్‌ ‌శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేపథ్యం కలిగిన సిపీ రాధాకృష్ణన్‌కు ధీటైన వ్యక్తిగా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం జస్టీస్‌ ‌సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దక్షిణాధిప్రాంతానికి చెందిన పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ జస్టీస్‌ ‌సుదర్శన్‌రెడ్డి పేరు వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *