పహల్గాం లో ఉగ్రదాడి జరిగి ఒక నెల గడిచిపోయింది .. 22 ఏప్రిల్‌న పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసారు.. ఆ దాడిలో 26 మంది మృతి చెందారు . నలుగురు అత్యంత క్రూరమైన ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోకి ప్రవేశించారు.. 26 మంది పర్యాటకులను హత్య చేసి పారిపోయారు. వారు సరిహద్దు దాటి 200 కిలోమీటర్ల లోపలికి ఆయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు అన్న విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రతీకార చర్యగా జరిగిన “ఆపరేషన్ సింధూర్”లో కూడా పూంఛ్ ప్రాంతంలో 13 మంది మరణించారు. సమీప ప్రాంతాల్లో మరో ముగ్గురు చనిపోయారు. కశ్మీర్‌లో పర్యాటక రంగం పూర్తిగా నిలిచిపోయింది. పహల్గామ్‌నే కాదు, పరిసర పర్యాటక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి . ప్రజల జీవన ఆదాయం నిలిచిపోయింది .
ఈ నెలలో ప్రధాని మోదీ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలను కలవలేదు, వారిని పరామర్శించ లేదు. . కలిశారన్నా దాని సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. పూంఛ్‌లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసింది అనే విషయంలో స్పష్టత లేదు. ఎన్ని విమానాలు కూలాయి? సమాధానం ఇవ్వలేదు. సైన్యం “సరైన సమయానికి చెబుతాం” అని మాత్రమే చెప్పింది. మరోసారి పత్రిక సమావేశంలో అడిగితే ” పైలట్లు అందరూ తిరిగి వొచ్చారు” అనే సమాధానం మాత్రమే వినిపిస్తుంది . ఈ ప్రశ్నలు భారత మీడియాలో నిష్క్రియంగా మారినప్పటికీ, విదేశీ పత్రికల్లో, ముఖ్యంగా చైనా విమానాలు గురించి చర్చలు జరిగాయి. చైనా పాత్రపై అనేక విశ్లేషణలు వొచ్చాయి. పాకిస్తాన్‌తో పాటు చైనా కూడా అండగా ఉందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. టర్కీ డ్రోన్లపై కూడా చర్చలు జరిగాయి.
కానీ భారత మీడియా పహల్గామ్ ఉగ్రదాడిని మర్చిపోయింది. మొదట్లో కూడా ఆ దాడిని మతపరంగా మలిచింది — “మతం అడిగి చంపారు” అనే కోణం ప్రధాన శీర్షికగా చూపించారు. కానీ ఇప్పుడు మతం అడిగినవారే మర్చిపోబడ్డారు. భారత మీడియా ఎందుకు పహల్గామ్ దాడిని మరచిపోయింది? దాడిలో మరణించిన వారి కథనాలు ఈ నెల రోజుల్లో ఎన్ని సార్లు చూసాం ? వాస్తవానికి వారే ఆపరేషన్ సింధూర్ ముఖచిత్రం కావాలి. కానీ ఇప్పుడు వారి ముఖాలు మరుగునపడ్డాయి. పోయిన వాళ్లను మర్చిపోయారు, కానీ పోస్టర్లపై ఇప్పుడు ముఖం ఎవరిది..? ప్రధాని నరేంద్ర మోదీ ముఖమే “ఆపరేషన్ సింధూర్” చిహ్నంగా మారిపోయింది. కనీసం ఆ బాధితుల జీవిత భాగస్వాముల ముఖాలను చూపించాల్సింది.
లేదా ప్రధాని వాళ్లతో మాట్లాడి ధైర్యం చెప్పాలి కదా..! ఎవరి మీదనైనా చర్య తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ఆయన ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయలేదు. ఈ ప్రశ్నపై ఎవరూ మాట్లాడడం లేదు — పహల్గాం ప్రాంతంలో భద్రత ఎందుకు లేదు? భద్రత ఎందుకు లేదు? భద్రత ఎందుకు లేదు? తీవ్రవాదులు ఎలా వొచ్చారు? హత్య చేసిన తర్వాత అంత సులభంగా ఎలా తప్పించుకున్నారు? ఇప్పటివరకు వాళ్లను ఎందుకు పట్టుకోలేకపోయారు? విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అంతర్జాతీయ ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “వాళ్లను గుర్తించాం” అన్నారు. కానీ మీడియా కథనం ప్రకారం, అధికారులు ఇంకా వారిని పట్టుకోలేకపోయారట..!
మన వీర సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది, అనేక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కానీ ఆ నలుగురు క్రూర ఉగ్రవాదులను శిక్షించే వరకు, ఈ హత్యలకు సమాధానం చెప్పేంత వరకు, వీరి మీద కఠిన చర్య చేపట్టే వరకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరగదు. ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందేమో , ఉగ్రవాదులను వెతుకుతుందేమో కానీ, ఒక నెల తర్వాత ఈ ప్రశ్నలు అడగడం సముచితమే. భద్రతా లోపం ఎలా జరిగింది? దానికి బాధ్యులు ఎవరు? వాళ్లపై చర్య ఎందుకు తీసుకోలేదు? పహల్గామ్ దాడిలో అమానుషంగా హత్యలు చేసిన ఉగ్రవాదులు ఇప్పటికీ ఎందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నారు? కొన్ని నివేదికల ప్రకారం, ఇదే ఉగ్రవాదుల గుంపు గత 18 నెలలలో పూంచ్, గగనగీర్, గుల్మర్గ్‌లలో జరిగిన మరికొన్ని ఉగ్రదాడులకు కూడా బాధ్యత వహించిందట. ఇప్పటివరకు కేంద్రం ఎటువంటి అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? ప్రతిపక్ష పార్టీల విశ్వాసం ఎందుకు పొందలేదు? ఫిబ్రవరి 22, 1994న పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించబడిన పార్లమెంటరీ తీర్మానాన్ని పునరుద్ఘాటించడం, మరియు ఆపరేషన్ సిందూర్ సమయంలో బయటపడిన చైనా-పాకిస్తాన్ మైత్రి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్మానాన్ని మళ్ళీ రూపొందించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు పిలవలేదు? గత రెండు వారాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు విదేశాంగ మంత్రి రూబియో తరచూ అమెరికా పాత్రపై చెబుతున్న ధృవీకరణల గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారు?
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి “ఆపరేషన్ సిందూర్” ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై రాజకీయాలు చేయకూడదు అన్నారు కానీ రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ సైనిక దుస్తుల్లో ఉన్న భారీ పోస్టర్లు వెలిసాయి . ఆపరేషన్ ముఖచిత్రంగా ఆయనను చూపుతున్నారు. రాజకీయాలు చేయకూడదన్నవారు ఈ విషయానికి సమాధానం ఎందుకు చెప్పడం లేదు? సైనిక వేషధారణతో పోస్టర్ వేసి రాజకీయాలు చేయడం కాదా? రైల్వే టికెట్ల మీద కూడా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పోస్టర్లు, ప్రధాని మోదీ ఫొటో కనిపిస్తోంది. ఇంకా ఒక నెల కూడా కాలేదు. కానీ రాజకీయ ప్రచార ఆర్భాటం నిస్సిగ్గుగా మొదలయింది . కనీసం అటువంటి బాధిత కుటుంబాలు ఇంకా విషాదంలో ఉన్నాయని గుర్తించి ఆచితూచి వ్యవహరించాల్సింది.
ఇంతలోనే ప్రధాని మోదీ బీకానేర్‌లో ఆపరేషన్ సిందూర్ పై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. అన్నీ మోదీ తో ప్రారంభమై, మోదీ తోనే ముగుస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ చెప్పాలి — పహల్గాం లో దాడి ఎలా జరిగింది? మోదీ మెదడు ప్రశాంతంగా ఉంది , కానీ ఆయన రక్తం వేడిగా ఉంటుందంటారు. ఇప్పుడు మోదీ తన నరాల్లో రక్తం బదులు , సిందూర్ ప్రవహిస్తోంది అంటున్నారు. ఈ మాటలు ప్రేక్షకుల్ని ఆకర్షించవొచ్చు. కానీ ప్రజలకు ఇవి నచ్చకపోవొచ్చు. ప్రజలు చూడగలుగుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సినిమా డైలాగులతో రాజకీయాలు చేయడం మొదలైంది.. కానీ దేశం ఆయనను అడుగుతున్న కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అవసరం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య వార్ ఆగిపోవడానికి తాము మధ్యవర్తులమని ఇప్పటికే ఎనిమిది సార్లు వల్లే వేసారు . అసలు సమస్య ట్రంప్ ఏమన్నారన్నది కాదు — కానీ ఆయన చెప్పిన ‘డీల్’ విధానం ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు ఏదైనా సరైన డీల్ జరిగింది నిజమే అయితే, ట్రంప్ దాని బదులుగా ఏం కోరుతున్నాడు? ఆ ‘ధర’ ఎంత చెబుతున్నారు? భారత్ ఆ ధర ఎలా చెల్లించబోతుంది? ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ ను భారత్‌కు సమానంగా పోలుస్తున్నారు ? భారత్ మాత్రం ప్రధాని స్థాయిలో, లేక విదేశాంగ మంత్రిత్వ స్థాయిలో ఎందుకు స్పందించడం లేదు ? ఈ నెల కాలంలో ట్రంప్ ఎనిమిది సార్లు ఈ విషయంపై మాట్లాడారు. ఇది ఇక అధికారిక స్థాయిలో, దౌత్య సంబంధాల స్థాయిలో పరిష్కరించలేని విషయం. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో ప్రజలు తమ సహనాన్ని అద్భుతంగా నిలబెట్టుకున్నారు. కోపం, ఆవేశం ఉన్నా, ప్రజలు ఇప్పుడు ఈ ‘నాటకాన్ని’ బాగా అర్థం చేసుకుంటున్నారు. వారు ఇప్పుడు సైన్యం ధైర్య సాహసాలను, సమర్ధతను … ఒక వర్గం మీడియా దుష్ప్రచారాన్ని వేరుగా చూడగలుగుతున్నారు. ఈ నెలలో దేశం కొంచెం మారిపోయింది. నశించిన వివేకం మళ్ళీ జన రక్తనాళాల్లో ప్రవహించడం మొదలైంది.





