“ఇది కొందరు పోలీసు అధికారులకో, కొందరు రాజకీయ నాయకులకో మాత్రమే సంబంధించిన సమస్య కాదు. రాష్ట్రంలో పోలీసు శాఖను రాజకీయ నాయకత్వం, ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నాయి, అలా మితిమీరిన అధికారాలు పొందిన పోలీసు యంత్రాంగం వాటితో తన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఎలా ప్రయత్నించింది, ఈ క్రమంలో ప్రభుత్వ పాలనకు పునాదిగా ఉండవలసిన రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, ప్రజాస్వామ్యం ఎట్లా ధ్వంసమైపోయాయి అనేవి కీలకాంశాలు.”
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్ర పోలీసు శాఖలోని కీలక విభాగమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) కార్యాలయంలో కొన్ని హార్డ్ డిస్కులను, సర్వర్లను, సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారని, కొన్ని హార్డ్ డిస్కులు బైటికి తీసుకువెళ్లారని వార్తలు పొక్కడంతో మొదలై, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సమన్లు పంపించనున్నదనే వార్త దాకా ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది.
ఈ వ్యవహారంలో అనేక మంది పోలీసు అధికారులకు పాత్ర ఉందని, ఆ అధికారులు గత ప్రభుత్వంలోని రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకే ఆ పనులు చేశారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఆ రకంగా ఇది కక్ష సాధింపు ఆరోపణగా, గత పాలక ముఠాకూ, ప్రస్తుత పాలక ముఠాకూ మధ్య తగాదాగా బైటపడుతున్నది.
అయితే ఇది కొందరు పోలీసు అధికారులకో, కొందరు రాజకీయ నాయకులకో మాత్రమే సంబంధించిన సమస్య కాదు. రాష్ట్రంలో పోలీసు శాఖను రాజకీయ నాయకత్వం, ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నాయి, అలా మితిమీరిన అధికారాలు పొందిన పోలీసు యంత్రాంగం వాటితో తన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఎలా ప్రయత్నించింది, ఈ క్రమంలో ప్రభుత్వ పాలనకు పునాదిగా ఉండవలసిన రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, ప్రజాస్వామ్యం ఎట్లా ధ్వంసమైపోయాయి అనేవి కీలకాంశాలు. అవి నిజానికి ప్రజల సమస్య, సమాజపు సమస్య. ప్రజలందరూ పట్టించుకోవలసిన, చర్చించవల్సిన సమస్య. చర్చను అంత దూరం వెళ్లనివ్వకుండా కొందరు వ్యక్తుల ప్రవర్తనకు, తమకు ఇప్పటికిప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయదానికి ఇవాళ పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం గత ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైన వ్యక్తులకూ, ట్యాపింగ్ చేసిన వ్యక్తులకూ, ట్యాపింగ్ చేయించిన వ్యక్తులకూ సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది వ్యవస్థ సమస్య, సమాజ సమస్య, ప్రజాస్వామిక పాలన సమస్య.
సాధారణంగానే మన సామాజిక ఆలోచనా సరళిలో, ఇంగ్లిష్ నుడికారంలో చెప్పినట్టు, ఒక కొసన చెట్టును చూసి అడవిని మరిచిపోవడమూ ఉంది. మరొక కొసన అడవిని చూసి చెట్టును మరిచిపోవడమూ ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఇదేదో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పాలనా కాలంలో జరిగిన అక్రమంగా చూసే ధోరణీ ఉంది. అది పోలీసు వ్యవస్థలో సహజమే గనుక తెలంగాణ తొలి పాలనను వేలెత్తి చూపగూడదనే ధోరణీ ఉంది. వ్యవస్థ లోపాలు అని చెప్పి వ్యక్తిగత బాధ్యతను విస్మరించనక్కరలేదు, వ్యక్తిగత బాధ్యతను మాత్రమే చూసి వ్యవస్థ మూలాలను పక్కన పెట్టనక్కరలేదు.
“ఈ ఎస్ఐబి అక్రమాలు, అధికార దుర్వినియోగం కొత్తగా 2014లో ప్రారంభం కాలేదు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో 1969 నుంచీ మొత్తంగా పోలీసు వ్యవస్థకు, ప్రత్యేకించి ఎస్ఐబి వంటి విభాగాలకు అందిన ఇష్టారాజ్యపు అధికారాన్ని, ఆ క్రమంలో సాగిన రాజ్యాంగ ఉల్లంఘనలను, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోకపోతే ఇప్పుడు తూతూమంత్రంగా ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు.”
ఆ విశాలమైన, లోతైన, వ్యవస్థాగతమైన విషయాలు చర్చలోకి తేకుండా, కొందరు వ్యక్తుల తప్పొప్పులు మాత్రమే ఇప్పటికిప్పుడు నిర్ణయించి, వారికి శిక్షలు విధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ మౌలికమైన ప్రశ్నలు వేసుకుని, అసలు వ్యవస్థనే మార్చకపోతే, ఆ వ్యవస్థ అవే అక్రమాలతో యథావిధిగా కొనసాగుతుంది. ఈ ఎస్ఐబి అక్రమాలు, అధికార దుర్వినియోగం కొత్తగా 2014లో ప్రారంభం కాలేదు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో 1969 నుంచీ మొత్తంగా పోలీసు వ్యవస్థకు, ప్రత్యేకించి ఎస్ఐబి వంటి విభాగాలకు అందిన ఇష్టారాజ్యపు అధికారాన్ని, ఆ క్రమంలో సాగిన రాజ్యాంగ ఉల్లంఘనలను, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోకపోతే ఇప్పుడు తూతూమంత్రంగా ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. నిజానికి, ఇప్పుడు ఏ ఆరోపణల మీద ఈ దర్యాప్తు జరుపుతున్నారో అవే పనులు ప్రస్తుత పాలకుల అవసరాల కోసం పోలీసు వ్యవస్థ యథాతథంగా కొనసాగిస్తున్నప్పుడు ఈ దర్యాప్తుకు అర్థం లేదు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పనిసరిగా కొందరు వ్యక్తుల బాధ్యత ఉంది. ఇప్పటివరకూ వెలువడిన దర్యాప్తు వార్తలను బట్టి (అవి కూడా ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కక్షతో అరకొరగా, పాక్షికంగా, తనకు అవసరమైన మేరకు మాత్రమే విడుదల చేస్తున్నాడనే స్పృహ ఉండాలి) టి ప్రభాకర్ రావు అనే ఐపీఎస్ అధికారిని పదవీ విరమణ తర్వాత కూడా పొడిగింపు ఇచ్చి ఎస్ఐబీ అధిపతిగా నియమించారు. ఆయన ఎంపిక చేసిన అధికారులతో ఒక స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అనేక మంది వ్యక్తుల మీద నిరంతర నిఘా పెట్టారు. అలా నిఘాకు గురైన వ్యక్తులలో అధికార బిఆర్ఎస్ కు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, పౌర ప్రజా సంఘాల నాయకులు, కొందరు అధికార పార్టీ నాయకులతో సహా ఎందరెందరో ఉన్నారు. ముఖ్యంగా వారి ఫోన్ సంభాషణల మీద పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. అలా నిఘాకు గురైన వ్యక్తుల, ఫోన్ నంబర్ల సంఖ్య వెయ్యి నుంచి నాలుగైదు వేల వరకు ఉండవచ్చునంటున్నారు.
ఇటువంటి నిఘా ఉందనే విషయం ఆ పది సంవత్సరాలలో కూడా ఎన్నోసార్లు అటాటలుగా బైట పడింది. చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని, తమ డ్రైవర్ల, కుటుంబ సభ్యుల ఫోన్ల నుంచి మాట్లాడుతున్నారని వార్తలు వచ్చాయి.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం జరిగిందని వార్తలు పొక్కాయి. సర్వర్లు, హార్డ్ డిస్కులు, సిసిటీవి ఫుటేజీ తగులబెట్టడమో, ధ్వంసం చేయడమో జరిగిందని, ఆ పనుల్లో భాగం పంచుకున్నవారు బైటపెట్టారు. అలా 2024 మార్చ్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఎస్ఐబి అధినేత ప్రభాకర్ రావును మొదటి నిందితుడిగా చూపారు. కొందరు అధికారులను సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల్లోనే సస్పెండయిన పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు కూడా చేశారు. వారు ఇచ్చారని చెపుతున్న వాంగ్మూలాల ఆధారంగా మరిన్ని విషయాలు బైటికి వచ్చాయి.
ఈ దర్యాప్తు సాగుతుండగానే ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి, అక్కడే ఉండిపోయారు. తెలంగాణ పోలీసు శాఖ కోరిక మేరకు విదేశాంగ వ్యవహారాల శాఖ ఆయన పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. ఆయన అమెరికాలో ఉండే తన మీద ఆరోపణలను ఖండించారు. ముందస్తు బెయిల్ కూ, అరెస్టు చేయకుండా రక్షణకూ సుప్రీం కోర్టులో ప్రయత్నించారు. 2025 జూన్ లో సుప్రీం కోర్టు అరెస్టు నుంచి రక్షణ ఇచ్చి, హైదరాబాద్ రావడానికి అనుమతించగా దాదాపు 15 నెలల తర్వాత ఆయన తిరిగి వచ్చారు. ఎస్ఐటీ ప్రశ్నలకు జవాబుగా, తన అధికారం కింద జరిగిన ఫోన్ ట్యాపింగ్ లన్నీ సమీక్షా కమిటీ అనుమతితోనే చట్టబద్ధంగానే జరిగాయని ఆయన చెప్పారని వార్తలు వచ్చాయి. దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదని, అందువల్ల ఆయనను కస్టడీలో ప్రశ్నించడానికి అనుమతించాలని తెలంగాణ పోలీసులు కోరగా, సుప్రీం కోర్టు అనుమతించింది. ఆయన బాధ్యతను సమీక్షా కమిటీ మీద పెట్టారు గనుక ఎస్ఐటి మాజీ ఉన్నతాధికారులను కూడా ప్రశ్నించింది. ఈ దర్యాప్తు క్రమంలో మాజీ ముఖ్యమంత్రిని కూడా ఎస్ఐటి ప్రశ్నించనుందని వార్తలు వస్తున్నాయి.
“అసలు ఈ అధికారులు, వారిని ఆదేశించిన రాజకీయ నాయకులు అని మాత్రమే కాదు, ఎస్ఐబి కి ఇటువంటి మితిమీరిన అధికారాలు ఎలా వచ్చాయి అనేది కీలకమైన ప్రశ్న. ఎస్ఐబి అనేది ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో ఒక రహస్య విభాగంగా ప్రారంభమయింది. అది ఎంత నిగూఢమైనదంటే అది ఎప్పుడు ప్రారంభమైందో ఎక్కడా వివరాలు లేవు. దాని అధిపతి పేరు తప్ప మరే అధికారి పేరూ బైటికి రాదు. దాని సిబ్బంది మొత్తం సాధారణ దుస్తుల్లో ఉంటారు. ఆ విభాగానికి ఎన్ని నిధులు అందుతాయో, అవి ఎలా ఖర్చు పెడతారో బడ్జెట్ పత్రాలలో, పోలీసు శాఖ పత్రాలలో కూడా ఉండదు. దాని అధిపతి ఎవరనేది ముఖ్యమంత్రి ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ఆ అధికారి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, పోలీసు వ్యవస్థలోని మామూలు అంతరాలన్నిటినీ పక్కన పెట్టి, కేవలం డీజీపీకి, ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీగా ఉంటారు.”
అసలు ఈ అధికారులు, వారిని ఆదేశించిన రాజకీయ నాయకులు అని మాత్రమే కాదు, ఎస్ఐబి కి ఇటువంటి మితిమీరిన అధికారాలు ఎలా వచ్చాయి అనేది కీలకమైన ప్రశ్న. ఎస్ఐబి అనేది ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో ఒక రహస్య విభాగంగా ప్రారంభమయింది. అది ఎంత నిగూఢమైనదంటే అది ఎప్పుడు ప్రారంభమైందో ఎక్కడా వివరాలు లేవు. దాని అధిపతి పేరు తప్ప మరే అధికారి పేరూ బైటికి రాదు. దాని సిబ్బంది మొత్తం సాధారణ దుస్తుల్లో ఉంటారు. ఆ విభాగానికి ఎన్ని నిధులు అందుతాయో, అవి ఎలా ఖర్చు పెడతారో బడ్జెట్ పత్రాలలో, పోలీసు శాఖ పత్రాలలో కూడా ఉండదు. దాని అధిపతి ఎవరనేది ముఖ్యమంత్రి ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ఆ అధికారి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, పోలీసు వ్యవస్థలోని మామూలు అంతరాలన్నిటినీ పక్కన పెట్టి, కేవలం డీజీపీకి, ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీగా ఉంటారు.
ఈ ప్రత్యేక విభాగాన్ని మొదట ప్రజా భద్రతకు సమాచార సేకరణ అవసరం అనే పేరిట తయారు చేశారు గాని, అది కేవలం నక్సలైటు ఉద్యమ సమాచార సేకరణ ప్రధాన బాధ్యతగా పని చేస్తూ, ఆ పేరుతో విపరీతమైన అధికారాలు సంపాదించింది. నక్సలైట్లను అణచివేయడానికి అవసరం అనే పేరుతో రహస్య కార్యకలాపాలు, లెక్క లేని నిధులు, వాహనాలు, ప్రశ్నాతీత అధికారం, ఇతర రాష్ట్రాలలో కూడా నక్సలైట్ల ఆచూకీ కోసం తిరుగుతున్నామని జవాబుదారీతనం లేకుండా తిరిగే అధికారం వంటి ఎన్నో అక్రమాలకు, చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఎస్ఐబి పాల్పడింది. బహుశా జలగం వెంగళ రావు హోమ్ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మొదలైన ఈ కార్యకలాపాలు ఆ తర్వాత అందరు ముఖ్యమంత్రుల కాలం లోనూ కొనసాగి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కాలాల్లో పతాక స్థాయికి చేరింది. ఆ క్రమంలో సమర్థమైన శాఖగా పేరు తెచ్చుకుని, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అవసరమైన సమాచార సేకరణ కూడా మొదలు పెట్టింది.
నిజానికి పోలీసు శాఖ మొత్తంగానే సమాజానికి సేవకురాలు. సమాజం చెల్లించిన పన్నుల నుంచి తన జీత భత్యాలు పొందుతుంది. అప్పటికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వపు ప్రయోజనాలు రక్షించవలసిన అవసరం దానికేమీ లేదు. ఆ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజం మీద మొత్తంగా నిఘా పెట్టవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. సంఘ వ్యతిరేక శక్తుల మీద నిఘా అవసరం అనుకున్నా, అది ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇతర రాజకీయ పార్టీల మీద, విశ్వాసాల మీద నిఘా కాగూడదు.
చట్టబద్ధత లేకుండా నిఘా పెట్టడం, “తక్షణ జాతీయ భద్రతా కారణాల” కోసం జరపవలసిన నిఘాను సార్వత్రికంగా, అడ్డగోలుగా అమలు చేయడం, అలా సేకరించిన సాక్ష్యాధారాలను ప్రభుత్వం మారగానే ధ్వంసం చేయడం, ప్రజా భద్రతా యంత్రాంగాన్ని అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వపు భద్రత కోసం దుర్వినియోగం చెయ్యడం, జవాబుదారీ తనం లేమి, వ్యక్తిగత గోప్యతా హక్కు ఉల్లంఘన మొదలైనవి ప్రస్తుత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు. కాని ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ గత ఐదు దశాబ్దాలుగా సాగుతున్నవి ఈ పనులే. ఆ జాబితా మావోయిస్టులకు సహకరించిన వారిది అన్నారు గనుక ఆ పేర్లను తాము పరీక్షించలేదని ఉన్నతాధికారులు అన్నారని వార్తలు వచ్చాయి. అంటే మావోయిస్టులు అనే బూచి చూపితే రాజ్యాంగాన్నీ, చట్టాలనూ తుంగలో తొక్కినా ఫర్వాలేదని రాష్ట్రానికి అత్యున్నత స్థానాల్లో పని చేసిన ఐఏఎస్ అధికారులు అనుకుంటున్నారన్నమాట!
ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒక మాజీ ఎస్ఐబి అధికారిని ప్రశ్నిస్తున్నది, లొంగిపొమ్మంటున్నది, కాని మొత్తంగా ఎస్ఐబి పనితీరును సమీక్షించగలదా? ఈ రెండు సంవత్సరాల్లోనైనా ఎస్ఐబిని తాను అలా వాడుకోలేదని ఈ ప్రభుత్వం చెప్పగలదా? రోగం ఎక్కడుంది? మందు ఎక్కడ వేస్తున్నారు?





