దురంధరుడు ..!

“60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ చచ్చిపో లేదని, తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకుని, చేష్టలుడిగి, చైతన్యరహితులై కూర్చోలేదని తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఒక మహా అగ్ని పర్వతం అని అది ఎప్పుడు బద్దలైన ఆంధ్ర పాలకవర్గ పాలన అంతం తప్పదని గర్జించిన నాయకుడు కె చంద్రశేఖర రావు 21వ శతాబ్దం ప్రారంభంలో రెండు దశాబ్దాలు…ఉద్యమకారుడిగా ..పాలనాదక్షుడిగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన దురంధరుడు ..!”

60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ చచ్చిపో లేదని, తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకుని, చేష్టలుడిగి, చైతన్యరహితులై కూర్చోలేదని తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఒక మహా అగ్ని పర్వతం అని అది ఎప్పుడు బద్దలైన ఆంధ్ర పాలకవర్గ పాలన అంతం తప్పదని గర్జించిన నాయకుడు కె చంద్రశేఖర రావు 21వ శతాబ్దం ప్రారంభంలో రెండు దశాబ్దాలు… ఉద్యమ కారుడిగా.. పాలనాదక్షుడిగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసారు. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న సంకల్పంతో ఆయన ప్రారంభించిన ఆమరణ దీక్ష పాలకవర్గం, ఆంధ్ర మీడియా దుష్ప్రచారాన్ని వమ్ము చేసింది… ఆంధ్ర పాలకవర్గం కుట్రలను ఆయన దీక్ష భగ్నం చేయగలిగింది.. హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ ప్రాంతమంతటా మారుమూల ఊరూరా, వాడవాడలా, ఇంటింటా, గుండెగుండెలో తెలంగాణ రాష్ట్ర వాంఛ గాఢంగా ఉందనీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఒక్కటై సంఘటితమై ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రం కోసం నినదిస్తున్నారని .. ఉద్యమిస్తున్నారని ఆయన దీక్ష స్పష్టంగా ప్రకటించింది.

తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చివేసిన వ్యక్తి కె. చంద్రశేఖర్ రావు . ఫిబ్రవరి 17, 1954న మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించి, సాధారణ రాజకీయ నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ఒక జాతి ఆకాంక్షకు గొంతుకగా మారి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టి ..అభిమానుల హృదయాల్లో ‘తెలంగాణ జాతి పిత’గా నిలిచారు. కేసీఆర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ పూర్తి చేశారు. సాహిత్యంపై ఆయనకున్న పట్టు, అనర్గళమైన ప్రసంగ శైలి ఆయనను ప్రజాకర్షక నాయకుడిగా తీర్చిదిద్దాయి. 1970లలో యువజన కాంగ్రెస్ ద్వారా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం తరువాత ఎన్.టి. రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి, సిద్దిపేట నియోజకవర్గం నుండి వరుసగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు ఒక రాజకీయ వేదిక అవసరమని గుర్తించిన కేసీఆర్, 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని స్థాపించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. అది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా మారింది. తెలంగాణ యాస, భాష, పండుగలకు (బతుకమ్మ, బోనాలు) ఆయన సముచిత గౌరవం కల్పించారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2009 నవంబర్ 29 ఒక కీలక మలుపు. కేసీఆర్ చేపట్టిన “ఆమరణ నిరాహార దీక్ష” కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. 11 రోజుల పాటు ఆయన ప్రాణాలకు తెగించి చేసిన దీక్షతో ఉమ్మడి రాష్ట్రంలో అల్లకల్లోలం నెలకొంది. చివరకు డిసెంబర్ 9, 2009న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అనేక రాజకీయ మలుపుల తర్వాత, 2014 జూన్ 2న తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల ఆయన పాలనలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి, ఎడారిలా ఉన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారు. రైతు బంధు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందింది. రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ధీమా కల్పించింది . మిషన్ కాకతీయ.. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచారు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఉన్న విద్యుత్ కోతలను కేవలం ఆరు నెలల్లోనే అధిగమించి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించారు.

కేసీఆర్ పాలనలో “మానవీయ కోణం” ప్రధానంగా కనిపించింది: వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్లు భరోసా నిస్తే కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించింది. కేసీఆర్ కిట్ గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పోషకాహారం, నగదు ప్రోత్సాహం ఇచ్చింది. కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయనొక గొప్ప వక్త, కవి మరియు వ్యవసాయ ప్రేమికుడు. సంక్లిష్టమైన విషయాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడం ఆయన ప్రత్యేకత. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.

ఒక చిన్న ఆలోచనగా మొదలై, కోట్లాది మంది కలలను నిజం చేసిన ధీశాలి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం నేడు ఐటీ రంగంలో, వ్యవసాయంలో, తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా ఉండటానికి ఆయన వేసిన పునాదులే కారణం. ఆయన జన్మదినం సందర్భంగా, తెలంగాణ సమాజం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన అభివృద్ధిని స్మరించుకుంటుంది.
జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు !
– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *