పద్మాలకు ప్రాతిపదిక పరివార భావజాలమేనా.!

‘ఆగస్టు 6న గద్దర్‌ ఈ సమాజాన్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోది ఆ కుటుంబానికి గద్దర్‌ అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలోని సారాంశాన్ని ఈ సందర్భంలో సమాజం గుర్తు చేసుకోవాలి.
నరేంద్ర మోది, బండి సంజయ్‌ వ్యక్తపరిచిన వ్యాఖ్యానాలు చూస్తే భాజపా అవకాశవాదం, నిజాయితీ లేనితనం స్పష్టం గా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నోట ఒక మాట,బండి సంజయ్‌ నోట ఇంకొక మాట ఇది ఊసరవెల్లి రాజకీయాలకు పరాకాష్ట ..!’’
గద్దర్‌ జీవిత పోరాటాన్ని విమర్శించే అర్హత మీకుందా..?
నక్సల్‌ భావజాలం ఉన్న గద్దర్‌ కు పద్మ పురస్కారం ఏలా ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ మాట్లాడిన మాటలు తెలంగాణ కళలు, తెలంగాణ సంస్కృతిని,యావత్‌ భారతీయ సమాజాన్ని అవమాన పరచడమేగానే తెలంగాణ పౌర సమాజం భావిస్తుంది.తన పాట ద్వారా ఎల్లలు లేని ప్రయాణాన్ని గద్దర్‌ కొనసాగించాడు.సంజయ్‌ తను ఉన్న హోదాను మరిచి ఎన్కౌంటర్‌ పేరుతో మర్డర్లు చేయించాడని గద్దర్‌ పట్ల అతనికున్న ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు.గద్దర్‌ భావజాలం గురించి మాట్లాడాడు.బిజెపి కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం,భారత్‌ మాతాకీ జై అనే వాళ్ళ కు మాత్రమే అవార్డులు ఇస్తామనే విధంగా స్పందించారు.అంతటితో ఆగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దర్‌ పేరు ఏలా పంపుతారని విరుచుకుపడ్డాడు.గద్దర్‌ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డులను కూడా మా బిజెపి పార్టీ తీసుకోబోదని ప్రకటించాడు.అంతిమంగా గద్దర్‌ ను హత్యలు చేపించేవాడిగా చిత్రీకరించాడు.గద్దర్‌ పేరు మీద మొత్తంగా ప్రజాస్వామ్య భావజాలాన్ని దెబ్బతీశారు. ఆగస్టు 6న గద్దర్‌ ఈ సమాజాన్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోది ఆ కుటుంబానికి గద్దర్‌ అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలోని సారాంశాన్ని ఈ సందర్భంలో సమాజం ముందు ఉంచుతున్నాం.
’గద్దర్‌’గా సుపరిచితుడైన శ్రీ గుమ్మడి విట్టల్‌రావు గారి మరణం గురించి తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను.తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. తెలుగు భాషలో, తెలంగాణ యాసలో ఆయన కవితలు మరియు జానపద గేయాల ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి.అతని సృజనాత్మక రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి. తెలంగాణ ప్రగతిపై ఆయన ఎప్పుడు మక్కువతో ఉండేవారు. సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు గుర్తుండిపోతుంది.
మీ జీవితకాలం అంతా మీరు ఎదుర్కొన్న మరియు అనుభవించిన కష్టాలను, మీకు జరిగిన నష్టాన్ని ఎప్పుడూ మాటల్లో వ్యక్తపరచలేము.మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.ఓం శాంతి’’ అని ముగించారు.నరేంద్ర మోది బండి సంజయ్‌ వ్యక్తపరిచిన వ్యాఖ్యానాలు చూస్తే భాజపా అవకాశవాదం, నిజాయితీ లేనితనం స్పష్టం గా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నోట ఒక మాట,బండి సంజయ్‌ నోట ఇంకొక మాట ఇది ఊసరవెల్లి రాజకీయాలకు పరాకాష్ట ..! అంతిమంగా హిందుత్వ భావజాలం ఫాసిస్టూ స్వభావాన్ని సంతరించుకొని దళితులు, ప్రజాస్వామ్యవాదులు వారి భావజాలంపై కనీస సహనాన్ని పాటించే పరిస్థితిలో లేరని అర్థమైంది. 2026 నాటికి నక్సల్బరీ భావజాలాన్ని తూడ్చి పెడతాననే హోం మంత్రి అమిత్‌ షా, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఈ కోవాలో చూడాల్సిందే.
 గద్దర్‌ అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక..!
గద్దర్‌ అంటే పాటల తూటా,గద్దర్‌ అంటే సకలజనుల గుండెచప్పుడు,గద్దర్‌ అంటే తాడిత పీడిత ప్రజల రథసారధి ..!  ప్రజల గుండె చప్పుడు గద్దర్‌ ను అవార్డుల పేరుతో అవమానించడం ప్రగతిశీల శక్తుల పట్ల పరివార్‌ కు ఉన్న ఆక్కసు కు నిదర్శనం. గద్దర్‌ బతికున్నంత కాలం ప్రజలే ప్రాణంగా బతికినాడు.ప్రజల పాటనే తన నోట నిరంతరంగా వినిపించాడు.. ఏనాడు ప్రభుత్వ సన్మానాలకు,సత్కారాలకు పురస్కారాలకు ఆశపడలేదు. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’’ అనే పాట ఉత్తమ గీతంగా నంది అవార్డుకు ఎంపికైనప్పుడు గద్దర్‌ తిరస్కరించిన విషయం పరివార్‌ మూకలుగమనించాలి. తెలంగాణను పాట రూపంలో చాలా గొప్పగా అమ్మగా కీర్తించినాడు .. సినిమా తెర పై తెలంగాణ త్యాగాలను అంధలమెక్కించిన గద్దర్‌ స్ఫూర్తి వెలకట్టలేనిది . కారంచేడు లో, చుండూరులో దళితులపై హత్యలు జరిగినప్పుడు గద్దర్‌ చేసిన పోరాటం దళిత సమాజానికి గుండె ధైర్యాన్ని ఇచ్చింది. 1969 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంతవరకు గద్దర్‌ తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి గొప్ప చైతన్యాన్ని రగిలించిన ధీరుడు అన్న విషయం సంఘపరివార్‌ శక్తులు గమనించాలి.
గద్దర్‌ తన ప్రయాణంలో భారత రాజ్యాంగమే ఈ దేశ ప్రజల ఆత్మగౌరవం ఆయుధం కూడా అదేనని అంతిమంగా రాజ్యాంగమే సర్వస్వమని గజ్జకట్టుకొని దేశం అంతా తిరిగాడు.ముచ్చింతల్లో సమతా మూర్తి విగ్రహవిష్కరణకు వెళ్లిన సందర్భంలో అంబేడ్కర్‌ రామానుజుడు మీద వెలిబుచ్చిన అభిప్రాయాన్ని తన పాట ద్వారా సమతా మూర్తి ప్రబోధించిన సమానత్వ భావనను సమస్త ప్రజానీకం ముందు ఉంచాడు.ఆయన సాహిత్యం నిండా అద్భుతమైన ఆదర్శ గుణాలను నింపాడు.ప్రపంచంలోనే తొలి మానవీయ మూర్తి ఈనాటి రాజ్యాంగానికి పునాది ఐన అహింసా విధానానికి నాంది ఐన బుద్ధుడిని బౌద్ధాన్ని వెయ్యినోళ్ల జనాల్లో ప్రచారం చేయడమే కాకుండా తన అంతిమ ప్రయాణాన్ని కూడా ఈ దేశ అసలు సిసలైన బౌద్ధాన్ని ఎంచుకున్నాడు.
ఈ దేశ ఖనిజ సంపదను,ప్రకృతిని కాపాడుకోవడం కోసం 1968,69 నుండి మొదలుకొని నేటి వరకు సుమారు 20000 మంది నక్సలైట్లు త్యాగం చేశారు.
ఈ పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసమే .. సొంత పేరు, సొంత అస్తిత్వం,సొంత ఊరు, సొంతమంటూ ఏదీ లేని సామాన్య ప్రజలు చేసిన అసామాన్య పోరాటాన్ని వారి త్యాగాలను సమూలంగా తూడ్చి వేయడం అంటే చారిత్రక ప్రయాణానికి వీళ్ళు ఏ విధంగా అడ్డు తగులుతున్నారో అర్థమవుతుంది. నిరంతరం కాషాయ దుస్తులు ధరించి తాడిత పీడితులకు కోసం పని చేసి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సారా నిషేధంకై పోరాటాలు చేసి హిందూమతంలోని దుర్గుణాలను తొలగించి దాని సద్గుణ వ్యాప్తికై ప్రచారం చేసి నిలబడ్డ స్వామి అగ్నివేష్‌ ను చంపిన ఈ మూకలకు గద్దర్‌ ఏమీ అర్థం అవుతాడు.? ప్రగతిశీల విప్లవ భావజాలం ఏమీ అర్థం అవుతుంది.? మహోన్నతమైన ప్రజాస్వామిక ఉద్యమాన్ని పరివార్‌ మూకలు తాకట్టు పెట్టుకొని అవార్డులు ఇస్తున్నప్పుడు, వైద్య రంగాన్ని సామాన్య ప్రజలకు దూరం చేసిన వ్యక్తులకు ..
వినోదం పేరిట రివాల్వర్లు పేల్చిన వ్యక్తులకు, అశ్లీల జుగుప్సాకరమైన హింసను భారతీయతగా మారుస్తున్న వారికి,బాబ్రీ మసీదు కూల్చివేత లో పాల్గొన్న మరియు ముస్లీంల పై యుద్దం చేయాలన్న సాధ్వి రితంబర వంటి వారికి పద్మ భూషణ్‌ లు అందిస్తున్నప్పుడు ప్రజల జీవనాడి పట్ల పరివార్‌ శక్తులకు ఇలాంటి ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన ఉంటుంది.? దిల్లీ రైతాంగ ఉద్యమాన్ని,వాంఛూ నేతృత్వంలోని లడక్‌ పర్యావరణ ఉద్యమంలో పాల్గొంటున్న శ్రేణులను ఉగ్రవాదులుగాను, దేశద్రోహులు గాను చిత్రీకరించి అవహేళన చేసిన వారు ఈ తరుణంలో గద్దర్‌ గురించి ఈ మాత్రం మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు.దండకారణ్యంలోని వనరులను ముమ్మాటికి కార్పొరేషన్‌ శక్తులకు అప్పగిస్తాం.! ఇందుకు అడ్డు వచ్చిన చెట్లైనా, మనుషులను ఎంతమంది నైనా అంతమొందిస్తాం అని చత్తీస్‌ ఘడ్‌ ప్రభుత్వ అధినేత హోం మంత్రి సాక్షిగా ప్రకటిస్తూ ఆచరిస్తుంటే గద్దర్‌ పాడిన ప్రకృతి పాటలు ..మట్టి మనుషులతో చేసుకున్న ఆత్మీయ ఆలింగనాల పరిమళాలు ఈ అమానవీయ ప్రభుత్వ అధినేతలకు దుర్గంధంగానే తలపిస్తాయి.
ప్రజా ఉద్యమకారుల పట్ల ఫాసిస్టు శక్తుల వ్యాఖ్యల విషయంలో ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు సంస్థలకు ఇవి హెచ్చరికలు కూడా అని అర్థమవుతుంది..
తెలంగాణ సంస్కృతి ని,కళను చాటి చెప్పాలనే ఉద్దేశ్యం తో ప్రజా కళాకారుడైన గద్దర్‌ పేరును పద్మ పురస్కారానికి తెలంగాణ ప్రభుత్వం పంపితే పంపి ఉండవచ్చు.కాని గద్దర్‌ కు అవార్డులు ఇవ్వాలన్న కాంగ్రెస్‌ తో గాని,ఇవ్వొద్దంటున్న బిజెపితోని గాని ఏనాడు గద్దర్‌ కు ప్రాధాన్యత తరుగదు,చెరగదు.గద్దర్‌ అనే శక్తి ఈ కాలం నాటి సామాన్యుల హీరో. ఈ దేశంలోఅసమ్మతిలోను,ఉద్యమాలలోను ఆయన హృదయం ఎప్పుడూ నినదిస్తూనే ఉంటుంది. ప్రజా పోరాటాలలో గద్దర్‌ సజీవంగా బతికే ఉంటాడు.గద్దర్‌ ఈ సమాజానికి అందించిన భావజాలాన్ని పునర్జీవింప చేసుకోవడానికి ఇలాంటి పరివార మూకల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ప్రజాస్వామికవాదులు వ్యక్తులుగా కాకుండా సామూహిక గొంతుకలుగా స్పందించాల్సిన అవసరం ఉన్నది.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *