తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తారుమారు చేయడానికి ప్రధాని ఇందిరా గాంధీ సలహాతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రాథమిక హక్కులు రద్దు చేసి, పత్రికల మీద సెన్సార్ షిప్ విధించి, దేశాన్ని చీకటిరాజ్యంగా మార్చిన పరిణామానికి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి. ఇది ఒక గుర్తించదగిన మైలురాయి గనుక చాలామంది ఈ యాభై ఏళ్లలోనూ, ప్రత్యేకంగా యాభై ఏళ్లు నిండిన సందర్భంగానూ తమ జ్ఞాపకాలూ అభిప్రాయాలూ విమర్శలూ విశ్లేషణలూ ప్రకటిస్తున్నారు.
తెలంగాణకు సంబంధించినంతవరకు ఎమర్జెన్సీ అనుభవాలు, పర్యవసానాలు ఎక్కడో ఒకటి రెండు చోట్ల అరకొరగా తప్ప సమగ్రంగా, సంపూర్ణంగా బైటికి రానేలేదు. మొత్తంగానే ఉత్తరాదిలో జరిగిన ఎమర్జెన్సీ అత్యాచారాల గురించి ప్రచారమైనంతగా దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రచారం కాలేదు. అప్పుడు తమిళనాడులో ప్రతిపక్ష డిఎంకె ప్రభుత్వం ఉన్నందువల్ల, ఆ రాష్ట్రానికి ఎమర్జెన్సీ తాకిడి పెద్దగా లేనట్టుంది గాని మిగిలిన మూడు రాష్ట్రాలూ (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ) కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా ఎమర్జెన్సీ దమనకాండను ఎక్కువగానే అనుభవించాయి. అయినా కేరళ రాజన్, కర్ణాటక స్నేహలతారెడ్డి, ఆంధ్రప్రదేశ్ గిరాయిపల్లి ఎన్ కౌంటర్ వంటి కొన్ని ఉదంతాలు తప్ప పూర్తి దమనకాండ వివరాలు చరిత్రకెక్కనే లేదు.
ఎమర్జెన్సీ విధింపుతోపాటే రాజ్యాంగం లోని మూడో అధ్యాయాన్ని, ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగానే ఉంది. అలా వాక్సభా స్వాతంత్ర్యాలను కాలరాయడంతో పాటు, పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రీ సెన్సార్షిప్ విధానం అమలులోకి వచ్చింది. పత్రికలలో అచ్చయ్యే వార్తలూ వ్యాఖ్యలూ అన్నీ, అచ్చుకు ముందే జిల్లా కలెక్టర్ కు (అంటే కలెక్టర్ ద్వారా పోలీసు అధికారులకు) సమర్పించి, వారు ఆమోదిస్తేనే, ఆమోదించిన మేరకే అచ్చువేయవలసి ఉండేది. ఎమర్జెన్సీ పోలీసులకు విస్తృతాధికారాలు కట్టబెట్టింది గనుక వీథుల్లో కనబడిన ఎవరినైనా పోలీసులు ఇష్టారాజ్యంగా పట్టుకుపోయే అవకాశం వచ్చింది గనుక రహదారుల మీద నడవడానికీ, హోటళ్లలో (ఆ రోజుల్లో ప్రఖ్యాతమైన ఇరానీ హోటళ్లలో) కూచొని మాట్లాడుకోవడానికీ కూడా విద్యార్థి యువజనులు భయపడే పరిస్థితి వచ్చింది.
జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో భాగంగానూ, అప్పటికే ప్రజా ఉద్యమాలు విస్తరిస్తున్న ప్రాంతంగానూ తెలంగాణ ఎమర్జెన్సీ దమనకాండకు పెద్ద ఎత్తునే లక్ష్యమయింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల రద్దు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరణ, మీసా కింద వందలాది మంది అరెస్టులు, లాంఛనప్రాయమైన అరెస్టు కూడా చూపకుండా వందలాది మందిని పట్టుకుపోయి వారాల తరబడి క్యాంపులలో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం, పోలీసుల దౌర్జన్యాలు, సంస్థల నిషేధాలు, బూటకపు ఎన్ కౌంటర్లు, పత్రికల మీద సెన్సార్ షిప్ ద్వారా వాస్తవ సమాచారం బైటికి రాకుండా తొక్కిపట్టడం, అధికార దుర్వినియోగం వంటి అనేక నిర్బంధ చర్యలు తెలంగాణలో కూడా విస్తృతంగానే జరిగాయి.
ఎమర్జెన్సీ విధింపుతోపాటే రాజ్యాంగం లోని మూడో అధ్యాయాన్ని, ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగానే ఉంది. అలా వాక్సభా స్వాతంత్ర్యాలను కాలరాయడంతో పాటు, పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రీ సెన్సార్షిప్ విధానం అమలులోకి వచ్చింది. పత్రికలలో అచ్చయ్యే వార్తలూ వ్యాఖ్యలూ అన్నీ, అచ్చుకు ముందే జిల్లా కలెక్టర్ కు (అంటే కలెక్టర్ ద్వారా పోలీసు అధికారులకు) సమర్పించి, వారు ఆమోదిస్తేనే, ఆమోదించిన మేరకే అచ్చువేయవలసి ఉండేది. ఎమర్జెన్సీ పోలీసులకు విస్తృతాధికారాలు కట్టబెట్టింది గనుక వీథుల్లో కనబడిన ఎవరినైనా పోలీసులు ఇష్టారాజ్యంగా పట్టుకుపోయే అవకాశం వచ్చింది గనుక రహదారుల మీద నడవడానికీ, హోటళ్లలో (ఆ రోజుల్లో ప్రఖ్యాతమైన ఇరానీ హోటళ్లలో) కూచొని మాట్లాడుకోవడానికీ కూడా విద్యార్థి యువజనులు భయపడే పరిస్థితి వచ్చింది.
ఈ అరెస్టులతో పాటు, ఆ ఇరవై ఒక్క నెలల్లోనూ అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడల్లా అనుమానం ఉన్నవారిని పట్టుకుపోయి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో వారాల తరబడి నిర్బంధించి, భయంకరమైన చిత్రహింసలకు గురి చేయడం పోలీసులకు అలవాటయింది. ఎమర్జెన్సీ కాలంలో పోలీసులు అమలు చేసిన ఆ చిత్రహింసా పద్ధతుల గురించి ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువ సమయంలో ఎన్నో వివరణలు, కథనాలు, వ్యాసాలు, పుస్తకాలు కూడా వెలువడ్డాయి. ఇటువంటి ఒక చిత్రహింసా శిబిరంలో భయానకమైన హింసకు గురైన, విప్లవోద్యమ సానుభూతిపరుడైన ఒక రచయిత అనుభవాన్నే అంపశయ్య నవీన్ ‘చీకటి రోజులు’ నవలగా రాశారు. తెలంగాణలో అసమ్మతివాదుల మీద ఎమర్జెన్సీ దమనకాండ ఎంత తీవ్రంగా, విస్తారంగా సాగిందో తెలుసుకోవడానికి ‘చీకటి రోజులు’ ఒక సూచిక.
ఎమర్జెన్సీ విధించిన పది రోజులకు “ఆంతరంగిక భద్రతకు, ప్రజా క్షేమానికి, శాంతి భద్రతల పరిరక్షణకు భంగకరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయ”నే కారణంతో కేంద్ర ప్రభుత్వం 23 సంస్థల మీద నిషేధం ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జమాత్ ఎ ఇస్లామీ, ఆనంద మార్గ్ వంటి సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ పార్టీలను, సంస్థలను కూడా ప్రభుత్వం నిషేధించింది. ఎమర్జెన్సీ విధించేనాటికి తెలంగాణలో కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి-దేవులపల్లి వెంకటేశ్వరరావుల నాయకత్వంలో మూడు నాలుగు మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు మాత్రమే క్రియాశీలంగా ఉన్నప్పటికీ, స్థూలంగా నక్సల్బరీ రాజకీయాలతో ప్రభావితమైన విద్యార్థి, యువజన, కార్మిక, రచయితల స్థానిక సంస్థలెన్నో ఉండేవి. విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వంటి సంస్థలూ ఉండేవి. ఈ సంస్థలన్నిటిమీద ప్రకటితంగానూ, అప్రకటితంగానూ నిషేధం ఎమర్జెన్సీ 21 నెలలూ కొనసాగింది.
జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటన వస్తే ఆ తెల్లవారు జాము నుంచే అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో విరసం నాయకులను అరెస్టు చేశారు. పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, స్వయంగా న్యాయవాది అయిన ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు మొట్టమొదట అరెస్టయిన వారిలో ఉన్నారు. పిడిఎస్ యు, ఆర్ ఎస్ యు నాయకులను అరెస్టు చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, సోషలిస్టు పార్టీ నాయకులను, కార్మిక సంఘాల నాయకులను కూడా అరెస్టు చేశారు. న్యాయబద్ధంగా కాకపోయినా చట్టబద్ధంగా మీసా కింద, డి ఐ ఆర్ కింద అరెస్టు చేసిన వందలాది మందిని జైళ్లలో కుక్కారు. అధికారవర్గాలలో అనుమానం, భయం ఎంతగా వ్యాపించాయంటే కొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతివాదులను కూడా అరెస్టు చేశారు.
ఈ అరెస్టులతో పాటు, ఆ ఇరవై ఒక్క నెలల్లోనూ అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడల్లా అనుమానం ఉన్నవారిని పట్టుకుపోయి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో వారాల తరబడి నిర్బంధించి, భయంకరమైన చిత్రహింసలకు గురి చేయడం పోలీసులకు అలవాటయింది. ఎమర్జెన్సీ కాలంలో పోలీసులు అమలు చేసిన ఆ చిత్రహింసా పద్ధతుల గురించి ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువ సమయంలో ఎన్నో వివరణలు, కథనాలు, వ్యాసాలు, పుస్తకాలు కూడా వెలువడ్డాయి. ఇటువంటి ఒక చిత్రహింసా శిబిరంలో భయానకమైన హింసకు గురైన, విప్లవోద్యమ సానుభూతిపరుడైన ఒక రచయిత అనుభవాన్నే అంపశయ్య నవీన్ ‘చీకటి రోజులు’ నవలగా రాశారు. తెలంగాణలో అసమ్మతివాదుల మీద ఎమర్జెన్సీ దమనకాండ ఎంత తీవ్రంగా, విస్తారంగా సాగిందో తెలుసుకోవడానికి ‘చీకటి రోజులు’ ఒక సూచిక.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో 1969 నుంచీ ప్రారంభమయిన బూటకప్ ఎన్ కౌంటర్లు అప్పుడే తెలంగాణకు కూడా విస్తరించాయి. కాగా ఎమర్జెన్సీ కాలంలో ఆ బూటకపు ఎన్ కౌంటర్లకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. అటువంటి ఎన్కౌంటర్లలో ప్రముఖమైనది మెదక్ జిల్లా గిరాయిపల్లి ఎన్ కౌంటర్. ఎమర్జెన్సీ విధించినాక రెండు మూడు వారాలకు వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి, రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు సూరపనేని జనార్దన్ ను పోలీసులు హైదరాబాద్ లో ఒక స్నేహితుడి గదిలో పట్టుకున్నారు. ఆ క్రమంలోనే లంకా మురళీ మోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్ అనే వరంగల్ విద్యార్థులను కూడా పట్టుకుని, మెదక్ జిల్లా ములుగు ఫారెస్ట్ డాక్ బంగళాలో రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి, జూలై 24-25 రాత్రి గిరాయిపల్లి అడవిలోకి తీసుకువెళ్లి చెట్లకు కట్టి కాల్చి చంపారు. అలా ఎమర్జెన్సీ చీకటిరోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 75 మంది విప్లవోద్యమ కార్యకర్తలను, సానుభూతిపరులను పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్లలో చంపివేశారు.
ఎమర్జెన్సీ చీకటిరోజుల్లో తెలంగాణ అనుభవించిన మరొక విషాదం భూమయ్య, కిష్టాగౌడ్ ల ఉరితీత. వారిద్దరికీ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు 1972లోనే ఉరిశిక్ష విధించినప్పటికీ, హైకోర్టు, సుప్రీంకోర్టు అప్పీళ్లు, రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రయత్నం కూడా విఫలమయ్యాక 1974 నవంబర్ 26న ఉరి తీయాలని అధికారులు నిర్ణయించారు. భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్షల రద్దు కోసం ప్రారంభమయిన దేశవ్యాపిత ఆందోళన ఆ ఉరిని ఆపింది. ఆ ఆందోళన మధ్యనే అధికారులు మే 11న మరొకసారి ఉరి తేదీ నిర్ణయించి, సాంకేతిక కారణాలతో ఆపివేశారు. ఆ తర్వాత ఎటువంటి ఆందోళన జరపడానికీ, న్యాయస్థానం తలుపు తట్టడానికీ అవకాశం లేని ఎమర్జెన్సీ చీకటిరాత్రి 1975 డిసెంబర్ 1న వాళ్లిద్దరినీ ఉరి తీశారు.
ఆ ఇరవై ఒక్క నెలలు సమాజం మొత్తంగానూ, వ్యవస్థా వ్యతిరేక ప్రజా ఉద్యమాలలో ఉన్నవారు ప్రత్యేకంగానూ అనుభవించిన ఒత్తిడికి, నిర్బంధానికి, దమననీతికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆ చీకటిరాత్రి నిజంగా సమాజానికి ఎంతటి మహా విషాదాన్ని ఇచ్చిందో ఇప్పటికీ సమగ్ర చిత్రణ జరగనే లేదు.
అయితే ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు పెట్టిన ఇందిరా గాంధీ 1977 మార్చ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ మళ్లీ అధికారానికి వచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం జనతా పార్టీ చేతిలో ఉండడం వల్ల, పత్రికల మీద సెన్సార్ షిప్ తొలగిపోవడం వల్ల 1977 ఏప్రిల్ నుంచి 1980 జనవరిలో మళ్లీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ గెలిచేదాకా దేశమంతా ఒక ప్రజాస్వామిక వెల్లువ వీచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండినప్పటికీ, దేశవ్యాప్త ప్రజాస్వామిక సంచలనాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరించాయి.
ఎమర్జెన్సీ చీకటి రోజులు అనేది గత కాలపు మాట కాదు, వర్తమానపు మాట. ఈ మన ప్రియమైన మాతృభూమి మీద కాళరాత్రి అది ఒకటేనా? అది అంతమయిందా? ఈ సుదీర్ఘ కాళరాత్రి ఎప్పటికి తెల్లవారుతుంది?
ఎమర్జెన్సీ అక్రమాలను దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె సి షా కమిషన్ నియమించగా, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లను విచారించడానికి లోక నాయక్ జయప్రకాష్ నారాయణ్ పూనికతో జస్టిస్ వి ఎం తార్కుండే అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది. తార్కుండే కమిటీ రాష్ట్రంలో పర్యటించి, సాక్ష్యాధారాలు సేకరించి, 75 మందిని బూటకపు ఎన్ కౌంటర్లలో చంపివేసినట్టుగా నిర్ధారించింది. తార్కుండే కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బూటకపు ఎన్ కౌంటర్లను, కనీసం విరివిగా సాక్ష్యాధారాలు ఉన్న నమూనా ఘటనలను పరిశోధించడానికి జస్టిస్ భార్గవా కమిషన్ ను నియమించింది. గిరాయిపల్లి ఎన్ కౌంటర్ తో పాటు, అప్పటి విమోచన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రామనర్సయ్యను, పి డి ఎస్ యు నాయకుడు శ్రీహరినీ చంపి, ఎన్ కౌంటర్ గా చూపిన చిలకలగుట్ట ఘటనను కూడా విచారించడం జస్టిస్ భార్గవా కమిషన్ పరిధిలో ఉండింది.
భార్గవా కమిషన్ ముందు జరిగిన గిరాయిపల్లి ఎన్ కౌంటర్ విచారణలో డజన్ల కొద్దీ సాక్షులు ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేసి, రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి చంపారని సాక్ష్యాలు చెప్పారు. వారితోపాటు చెట్లకు కట్టేయబడి, ఏ కారణం వలనో వదిలిపెట్టబడిన భిక్షపతి సాక్ష్యం చెప్పాడు. గిరాయిపల్లిలో వారిని ఏ చెట్లకు కట్టేసి కాల్చి చంపారో, ఆ చెట్ల మీద తుపాకి తూటాల గుర్తులు, ములుగు డాక్ బంగళా రిజిస్టర్ లో పోలీసులు ఆ గదులను ఆక్రమించుకుని ఉన్నారనే సాక్ష్యాలు కన్నబిరాన్ కమిషన్ ముందు సమర్పించారు. ఆ హత్యాకాండలో పాల్గొన్న పోలీసు అధికారితో ఆ ఘటన గురించి మాట్లాడించిన ఆదిరాజు వెంకటేశ్వరరావు తన సాక్ష్యం ‘హంతకులెవరు?’ అని పుస్తకమే రాశారు…. అలా ఉద్దేశపూర్వక హత్యాకాండ జరిగిందనడానికి సంపూర్ణమైన సాక్ష్యాధారాలు దొరికాయి. భార్గవా కమిషన్ విచారణ జరిగినన్ని రోజులూ ప్రతి రోజూ పత్రికలు ఆ వార్తలు ప్రచురించి పోలీసుల దుర్మార్గాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చాయి. అప్పుడు పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మీద ఒత్తిడి తెచ్చి, ‘భార్గవా కమిషన్ విచారణ బహిరంగంగా జరిగితే పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బ తింటున్నదనీ, అందువల్ల రహస్య విచారణ జరపాలనీ’ ప్రభుత్వం చేత ఉత్తరం రాయించారు. రహస్య విచారణకు నిరాకరించిన జస్టిస్ భార్గవ అసలు కమిషన్ నుంచే విరమించుకున్నారు. మొత్తం విచారణే ఆగిపోయింది. కాని ఆ విచారణానుభవం పోలీసుల దుర్మార్గాన్ని, హంతక స్వభావాన్ని స్పష్టం చేసింది.
ఇప్పుడు యాబై ఏళ్ల తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి ఆ కథలన్నీ గతకాలపు గాథలు కావు. అన్నిటికన్నీ యథాతథంగా అక్షరాలా ఇప్పుడు జరుగుతున్నవే. బహుశా ఐదు దశాబ్దాల్లో పెరిగిన తెలివితేటలతో, అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో, ఇంకా ఎక్కువ అవినీతిమయమైపోయిన రాజకీయ నాయకత్వంతో, ఇంకా ఎక్కువ అధికారకాంక్షలో పడిన పోలీసు యంత్రాంగంతో ఎమర్జెన్సీ చీకటిరోజులు ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ చీకటిరోజులుగా ఉన్నాయి. ప్రజా సంస్థల మీద అప్పటి కన్నా ఎక్కువ నిషేధం కొనసాగుతున్నది. మీసా వంటి దుర్మార్గ చట్టం స్థానంలో ఊపా వంటి ఇంకా ఎక్కువ దుర్మార్గమైన చట్టం అమలవుతున్నది. అరెస్టులు, చిత్రహింసలు మరింత ఎక్కువగా కొనసాగుతున్నాయి. బూటకపు ఎన్ కౌంటర్లు మరింత దుర్మార్గంగా, ఫలానా తేదీ లోపల చంపేస్తాము అని ఉద్దేశపూర్వకంగా చెప్పి మరీ, అనుదిన మారణకాండగా సాగుతున్నాయి. వాక్సభా స్వాతంత్ర్యాల మీద ఉక్కుపాదం గతం కన్నా ఎక్కువ బరువుగా, ఎక్కువ పీడనతో, ఎక్కువ సాంకేతిక పరిజ్ఞాన బలంతో అణచివేత సాగిస్తున్నది.
ఎమర్జెన్సీ చీకటి రోజులు అనేది గత కాలపు మాట కాదు, వర్తమానపు మాట. ఈ మన ప్రియమైన మాతృభూమి మీద కాళరాత్రి అది ఒకటేనా? అది అంతమయిందా? ఈ సుదీర్ఘ కాళరాత్రి ఎప్పటికి తెల్లవారుతుంది?





