నీవో సగం, నేనో సగం
ఆకాశంలో, అవనిలో
అన్నిటా మనం చెరి సగమంటూ
తాయిలాల మాటలతో అనాదిగా
మీరంటున్న సగానికేకాదు
అసలు మా అస్తిత్వానికే సవాలుగా
మిగిలిపోయాము అబలలమై !

నిన్ను అన్నగా, నాన్నగా,
తాతగా, మామయ్యగా, బావగా
తలచి చెల్లినై, కూతురినై,
మనుమరాలిగా, కోడలిగా,
ముద్దుల మరదలిగా
బహురూపాలుగా విస్తరించి
ప్రేమను, కరుణను పంచగల
మహోత్తుంగ జలపాతాన్ని నేను !

సంపాదనలో నీ కన్నా
మెరుగ్గా ఆర్జిస్తూ
నీతో బాటు సంసార బరువుల్ని
బాధ్యతల్ని  భరిస్తూ
మన కాపురానికి
నిలిచిన ధ్వజ స్తంభాన్ని నేను !

నీలో మాత్రం ఏరూపంలో ఉన్నా
వావి వరుసలు, పాపం, పుణ్యం
ఏమాత్రం పట్టని పశుత్వం
ఒళ్లంతా నిండి పురుషహంకారణతో
కళ్లకు కామం గుడ్డి పొరలు కమ్మేసి
హింసలతో, వాంఛలతో
ఆరేళ్ల పసికందు మొదలు
అరవైఏళ్ల బామ్మలనువదలకుండా
బలిగొంటూనే ఉన్నావు !

నిర్భయలు, దిశలు, సమతలు
పాత చెత్త చట్టాలై
ఎన్కౌంటర్లు , ఉరిలు ఊరిస్తున్నా
ఆగని కార్చిచ్చులా జగతిలో బేలగా
ఆడతనం కాలిపోతూనే ఉంది !
రుద్దబడిన యుద్ధ జ్వాలలలో
కాలిన దేహాలతో
కూలిన హర్మ్యాల క్రింద నలిగిన
జీవికలలో స్త్రీమూర్తులెందరో?

కోవిడ్ మహమ్మారిని మించిన
వికృతమూ, భయంకరమైన
ఈ అకృత్యాలకు అంతం
మగతనం, మృగతనం
మనిషితనంగా మారనంతవరకు
మగువ, మగవాడు సమానమేనని
అతడు, ఆమె ఒకటనే
ప్రకృతి సత్యాన్ని ప్రతి మనిషిలో
పాదుకొలిపే వరకు తప్పదేమో ?
సమాన హక్కులు, విలువ
లింగ వివక్ష లేని సమాజం
సాధించేదాకా స్త్రీకి విముక్తి లేదనేది నిజం !
( మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం )
డా.కె. దివాకరాచారి
9391018972
08.03.202

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *