మహిళా రిజర్వేషన్లు అమలు ఎప్పటినుండి ..?

“దశాబ్దాల పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఆ క్రెడిట్ ఇప్పుడు బిజెపి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకుండా.. ఇపుడు చేస్తున్న జనాభా లెక్కల తర్వాతే అమలు చేస్తామనడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నదనే వారూ ఉన్నారు. 2029 లో జరిగే ఎన్నికల్లో డిలిమిటేషన్ ద్వారా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి అనుకుంటున్నది. ఐదేళ్ల తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు చేస్తూ మరో దఫా అధికారంలోకి రావాలనేది బిజెపి రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నది.”

-వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ : 9963155523

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసన్నం అయింది. స్వాతంత్య్రం  ముందు నుంచి మహిళా రిజర్వేషన్ల డిమాండ్ వినిపిస్తున్నది. తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, రాజకీయ ఒత్తిళ్లకు జడిసి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మహిళ రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించాయి. ఇప్పుడు కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్ డి ఏ సర్కార్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ముందడుగు వేస్తోంది. మూడేళ్ల క్రితం పాసైన ఈ బిల్లు కు రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. అయితే కేంద్రం ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.

2026లో జనాభా లెక్కల సేకరణ తర్వాత మహిళల రిజర్వేషన్ల బిల్లు అమలు అవుతాయని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లెక్కన 2029 ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని బిజెపి తెరపైకి తీసుకువచ్చింది. ఓవైపు డి లిమిటేషన్.. మరోవైపు మహిళల రిజర్వేషన్ బిల్లు ..ఈ రెండు అంశాలు ఏకకాలంలో అమలు చేయడం బిజెపికి కత్తి మీద సామే అవుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ ముందే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు పోవడానికి వీలుగా డీలిమిటేషన్ అస్త్రాన్ని బిజెపి ప్రయోగిస్తున్నదని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం అనుకుంటున్నది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల సభ్యులతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది.ఈ విషయంపై కొన్నేళ్లుగా విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యేమార్గంగా 50 శాతం నియోజకవర్గాలను పెంచుదామన్న ప్రతిపాదనను విపక్షాల ముందు ఉంచారు. ఇంకా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరగలేదు కానీ ఇతర పార్టీల నేతలతో సమావేశాలు జరుగుతున్నాయి.
  దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీ సీట్లలో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని మహిళా రిజర్వేషన్ బిల్లులో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. కానీ ఎగువ సభలయిన రాజ్యసభ, శాసన మండలి లలో ఈ రిజర్వేషన్ల వర్తింపు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అణగారిన వర్గాలకు ప్రత్యేకించి రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా ఆ బిల్లులో లేదు. దీంతో పాటు ఓబీసీలకు సబ్ కోటా ప్రస్తావన కూడా లేదు. సబ్ కోటా లేకపోతే అగ్రకులాల మహిళలకు పార్టీలు సీట్లను ఇచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే సామాజిక న్యాయం జరగదు. ఆశించిన ప్రయోజనం నెరవేరదు. దశాబ్దాల పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఆ క్రెడిట్ ఇప్పుడు బిజెపి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకుండా.. ఇపుడు చేస్తున్న జనాభా లెక్కల తర్వాతే అమలు చేస్తామనడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నదనే వారూ ఉన్నారు. 2029 లో జరిగే ఎన్నికల్లో డిలిమిటేషన్ ద్వారా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి అనుకుంటున్నది. ఐదేళ్ల తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు చేస్తూ మరో దఫా అధికారంలోకి రావాలనేది బిజెపి రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నది.
   మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యం అని ఆమె అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్ సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత చేస్తున్న డిమాండ్ కు పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని కవిత అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సైతం ఓబీసీలకు సబ్ కోట కల్పించకపోతే మహిళా రిజర్వేషన్ల బిల్లు పరిపూర్ణం కాదని పార్లమెంటులో చెప్పిన విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంది.  ఓబీసీ మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి పోరాటం తప్పదని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లు కోసం ఏ విధంగా పలు రాజకీయ పార్టీలను, మహిళ సంఘాలను ఏకం చేసి గతంలో దిల్లీలో దీక్ష చేశామో… అదే విధంగా మరోసారి పోరాటం చేస్తామన్నారు. అసలు మహిళ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో పెట్టిన సందర్భంలోనే కవిత ఈ డిమాండ్ చేశారు.
  ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్లు వచ్చినా… ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాజ్యాంగబద్ద వాటా ఉంది…కానీ ఓబీసీలకు వాటాలేదు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఓబీసీ మహిళ నేతలు, మహిళా సంఘాలు తమ వాయిస్ వినిపించే రోజులు ఎంతో దూరంలో లేవు. మహిళ రిజర్వేషన్ల బిల్లుకు ముందడుగు పడడం వెనుక కవిత కృషి ఉంది. దేశంలోని 18 రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను, ప్రజా సంఘాలను ఏకం చేసి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు. కేంద్రంపై ఒత్తిడితెస్తూ..రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధావులతో చర్చలు, పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఈ అంశాన్ని జాతీయ అజెండాగా మార్చగలిగారు. ఈ బడ్జెట్ సెషన్ లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు శ్రీకారం చుడతారని బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఇన్ని అడ్డంకులు, సవాళ్ల మధ్య చిత్తశుద్ధితో బిజెపి వ్యవహరిస్తుందా.. ఓబీసీ సబ్ కోటా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటుందా… రాజ్యాంగ సవరణ కోసం ఎన్డీఏ మిత్ర పక్షాలను అలాగే విపక్షాలను ఒప్పిస్తుందా అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *