శిథిలమైన శరీరాన్ని దారంతో కుట్టుకోండి

ఇప్పడు నువ్వు ఒక నిషేధాన్ని

నిషేధించాల్సి ఉంది

ఇప్పడు నువ్వు నీ అస్థిత్వాన్ని

నిరూపించుకోవాల్సి ఉంది

అడవిలో  కోవర్ట్ ఆపరేషన్లతో

రాజ్యం హత్యలు చేస్తూ

ఆదివాసి గూడెలల్లో

యుద్ధ విమానాలతో

బాంబులు వర్షం కురిపించిన సరే

నీ ఉనికిని

ఆవిష్కరించుకోవాల్సి ఉంది

శత్రువును ఎదిరించడమే

నీ ధ్యేయమైనప్పుడు

ఏ మార్గాన్ననుసరిస్తేనేం?

శత్రుశేషం నీ ఆశేషత్యానికి

దారి తీయవచ్చు

హంసాహస్తం రహస్యంగా

అమాయకుల్ని

పిడికిళ్ళలో బందిస్తోంది

వెన్నుపోటు పొడిచేవాళ్ళు

ఆత్మల్ని వాళ్ళ పాదాల దగ్గర పరుస్తున్నారు

సద్దు మణిగిందని సమసిపోయిందని

భుజాలు చర్చుకుంటున్నప్పుడే

నివురు గప్పిన నిప్పులా

ఉవ్వెత్తున ఎగసి పడాలి

ఎన్కౌంటర్ల చితిమంటల్లోంచి

జ్వలిస్తున్న మానవుడవై

తిరిగి ఉద్భవించాలి

నిర్భందాల కింద

నిషేధాల కింద

శరీరం శిధిలమైన

 శిథిలమైన శరీరాన్ని

రహస్యపు దారంతో కుట్టుకొని

ఉద్యమానికి ఉపిరి పోయాలి

టి. రామాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *