సెప్టెంబర్ 1,పెన్షన్ విద్రోహ దినం.

(సీపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి రోజు)

దేశ ఆర్థిక, సామాజిక రంగంలో ఏ మార్పులు వచ్చిన దాని మూలాలు నూతన ఆర్థిక విధానాల ఫలాలే. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ( కేంద్రంలో యుపిఎస్) కూడా ఆ నూతన ఆర్థిక విధానాల విషఫలితమే. ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ లో మార్పులు చేయడానికి బి.కె. భట్టాచార్య  నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేశారు.కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండానే, పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండానే కార్యనిర్వహక ఉత్తర్వుల ద్వారా లక్షలాది మంది  ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలను నూతన  పెన్షన్ విధానం ద్వారా షేరు మార్కెట్లో తాక్కట్టు పెట్టింది నాటి ప్రభుత్వం. అట్టి ప్రతిపాదనను 23.08.2003 రోజున ఆమోదించి 01.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.ఆయా రాష్ట్రాలు దీనిని స్వచ్చందంగానే ఎంచుకొనుటకు కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికి చాలా రాష్ట్రాలు పోటీపడి ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

జీతంలో(బేసిక్+డిఎ A)10%, ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలుపుతూ ఉద్యోగికి కొత్తగా ప్రాన్ ఖాతా(పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబరు)తెరచి అందులో జమచేసే ఏర్పాటు చేశారు.ఈ జమ చేసిన నిధిని ఎన్ పి ఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) నుంచి ఎన్ ఎస్ డి ఎల్ (నేషనల్ సెక్యూరిటీ డిపాజిటారి లిమిటెడ్)ట్రస్ట్ ద్వారా షేరు మార్కెట్లో పెట్టి తదుపరి పదవి విరమణ సమయంలో మొత్తం నిధిలో 40% ను నెలవారీ పెన్షన్ గా చెల్లిస్తారు,మిగతా 60% ను ఉద్యోగులకు పదవి విరమణ సమయంలో చెల్లిస్తారు.దీని కోసం పీ ఎఫ్ ఆర్ డి ఎ ను ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీ ఓ ఎం ఎస్ నెం 653,654 ,655 ల తో 01.09.2004 నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ ను సి పీ ఎస్ పేరుతో అమలులోకి తెచ్చారు. కొత్త రాష్ట్రం తెలంగాణకి కేంద్రం లేఖ వ్రాస్తూ  మీరు సీ పీ యస్ విధానం కొనసాగిస్తారా? లేదా పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తారా అని అడగగా , కనీసం ఏ ఒక్క ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నేతలను సంప్రదించకుండానే  సీ పీ ఎస్ విధానం కొనసాగిస్తాం  అని బదులిస్తూ జీ ఓ ఎం ఎస్ నె.28 తేది:23.08.2014 ద్వారా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కిం ని  అమల్లోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నూతన పెన్షన్ విధానంలో ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుంది అనే విషయంపైన స్పష్టత లేదు.పి ఎఫ్ ఆర్ డి ఎ ఆక్ట్ 2013 సెక్షన్ 20 లో పెన్షన్ ఎంత వస్తుందో మార్కెట్ నిర్ణయిస్తుందని పేర్కొంటుంది. ఇది వృధ్యాప్యం లో  ఉద్యోగ,ఉపాధ్యాయుల పాలిట యమపాశంగా మారింది.

పోరాట ఫలితం ఫ్యామిలీ పెన్షన్.
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల పోరాటం వల్ల ఫ్యామిలీ పెన్షన్ సాధించగలిగావి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ ఎం ఎస్ నె.58,తేదీ:11.06.2021 మరియు మెమో నె.1454229/94/A2/BG/2022-(1). తేదీ:15.07.2022 ద్వారా 01.09.2004 తర్వాత నియామకం అయి సర్వీస్ లో వుండి చనిపోయిన మరియు ఆరోగ్య అశక్తత పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు  ఫ్యామిలీ పెన్షన్ మంజూరి చేసింది.

యూపిఏస్ వల్ల ఉద్యోగులకు నష్టం:
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం ఉదృతం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మధ్యనే యూ పి ఎస్ ని తెచ్చింది.యూపిఎస్ లో కూడా ఉద్యోగి,ప్రభుత్వం వాటాల సొమ్మును ప్రభుత్వమే షేర్ మార్కెట్లో పెట్టీ కాంట్రిబ్యూషన్ విధానం కొనసాగించనుంది.పెన్షన్ లెక్కింపులో  చివరి బేసిక్ పే లో 50% కాకుండా 12 నెలల సగటు వేతనం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆ మేరకు ఉద్యోగులు పెన్షన్ లో నష్టపోతారు. యూపిఎస్ లో పీఆర్సిని పరిగణలోకి తీసుకోకపోవడం,25సంవత్సరాలు పూర్తి చేస్తేనే పూర్తి పెన్షన్ వర్తించడం ఈ విధానంలో ప్రధాన సమస్యలు. ఈ విధానంలో హెల్త్ కార్డులపై,అదనపు పెన్షన్ పై స్పష్టత లేదు.

సిపిఎస్ రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే:
ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో  ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసింది చరిత్ర కాంగ్రెస్ పార్టీదే.రాజస్థాన్లో మార్చి 2022లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ (కాంగ్రెస్ ప్రభుత్వం) అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో సిపిఎస్ (ఎన్పీఎస్) రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధరణ ప్రకటించారు.ఛత్తీస్‌గఢ్ లో మార్చి 2022లో ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (కాంగ్రెస్ ప్రభుత్వం)అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఓ పి ఎస్ అమలు ప్రకటించారు.హిమాచల్ ప్రదేశ్ లో జనవరి 2023లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (కాంగ్రెస్ ప్రభుత్వం) కేబినెట్ తొలి సమావేశంలో ఓ పి ఎస్ పునరుద్ధరణకు ఆమోదం ఇచ్చారు.

జార్ఖండ్ లో 2022లో నిర్ణయం తీసుకొని 2023లో అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు.ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ (జేఎంఎం + కాంగ్రెస్ + ఆర్జెడి కలయిక ప్రభుత్వం) ఓ పి ఎస్ అమలు చేస్తూ కేంద్రానికి ఎన్ పి ఎస్ నిధుల బదిలీ నిలిపివేయమని లేఖ రాశారు.పంజాబ్ లో నవంబర్ 2022 న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం) ఓ పి ఎస్ పునరుద్ధరణ ప్రకటన చేసి అమలు చేశారు.మొత్తం 5 రాష్ట్రాలు ఓ పి ఎస్ ను తిరిగి అమలు చేశాయి.కానీ పి ఎఫ్ ఆర్ డి ఎ ఆక్ట్ అనే గుదిబండ చట్టం వల్ల పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేకపోతున్నాయి.

హామీని నెరవేర్చాలి:
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సిపిఎస్ ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యోగ,ఉపాధ్యాయుల ఓట్లే కీలకమైనవి అనేది బహిరంగ రహస్యం.అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ప్రభుత్వానికి కావలసినంత (సుమారు రెండు సంవత్సరాలు) సమయం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్లనే నేడు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది.సంక్షేమ రాజ్యంలో సాధారణ ప్రజలకే పెన్షన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం తన ఉద్యోగులను అవసానదశలో ఆదుకోలేదా?.ఆసరా పెన్షన్ కన్నా అద్వానంగా ఉన్న సిపిఎస్ ని రద్దుచేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి ఆర్థిక భారం లేని ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేయాలి.

jurru narayana yadav
జుర్రు నారాయణ యాదవ్, తెలంగాణ టీచర్స్ యూనియన్,
జిల్లా అధ్యక్షులు, మహబూబ్ నగర్,
9494019270.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *