“ఒకప్పుడు కంబోడియా రాజధాని ఉడోoగ్ (Oudong). అక్కడినుంచి రాజధానిని ఫ్నోo పెన్ కు మార్చినపుడు ఆ రాజభవనం నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెపుతోంది. రెండునదుల సంగమంలో ఉన్న ఆ ప్రదేశం శత్రువుల రాకను అడ్డుకుంటుందని అక్కడికి మార్చినట్లు గైడ్ టామ్ చెప్పాడు. చాలా పెద్ద ప్రాంగణం. దాదాపు లక్షా డెబ్భైనాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. వాటిల్లో ఒకదాని గుండా రాజపరివారం, పురోహితులు, మరోదానిగుండా సైన్యం, ఇంకో మార్గం నుంచి వ్యాపారవేత్తలు, నాలుగో ద్వారం నుంచి పౌరులు ప్రవేశించేవారని గైడ్ చెప్పాడు.”
గిరియానం – 17
ఉదయం ఎనిమిది గంటలకు హోటల్లో ఉపాహారం ముగించి నగరసందర్శనకు బయలుదేరాం. కంబోడియా యాత్రలో ఇది రెండోరోజు. (PHNOM PENH) ఫ్నోo పెన్ నగరం టోన్లే సాప్, మెకాంగ్ అనే రెండు నదుల మీద ఉంది. అది దేశ ఆర్థిక, రాజకీయ, సంస్కృతులకు కేంద్రం. పూర్వం దానిని ( Pearl of Asia ) ‘ ఆసియా ముత్యం ‘ అని పిలచే వాళ్ళట. నగరంలో ఫ్రెంచ్ వాస్తు కళ కనిపిస్తుంది. అక్కడ ముఖ్యంగా చూడదగినవి నాలుగు ప్రదేశాలున్నాయి. అవి : – రాయల్ ప్యాలెస్, ( Tuol sleng Museum ) ట్యూయల్ స్లేoగ్ మ్యూజియం, ( Killing fiedIs ) కిల్లింగ్ ఫీల్డ్స్, వాట్ ఫ్నోo టెంపుల్( Wat Phmom Temple).
ముందుగా మేం రాయల్ ప్యాలెస్ చేరుకున్నాం. ఇది పాత నగరంలో ఉంది. కంబోడియా రాజు నివాసం. 1866 లో నోరోడం రాజు కాలంలో దానిని నిర్మించారు. ఒకప్పుడు కంబోడియా రాజధాని ఉడోoగ్ (Oudong). అక్కడినుంచి రాజధానిని ఫ్నోo పెన్ కు మార్చినపుడు ఆ రాజభవనం నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెపుతోంది. రెండునదుల సంగమంలో ఉన్న ఆ ప్రదేశం శత్రువుల రాకను అడ్డుకుంటుందని అక్కడికి మార్చినట్లు గైడ్ టామ్ చెప్పాడు. చాలా పెద్ద ప్రాంగణం. దాదాపు లక్షా డెబ్భైనాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. వాటిల్లో ఒకదాని గుండా రాజపరివారం, పురోహితులు, మరోదానిగుండా సైన్యం, ఇంకో మార్గం నుంచి వ్యాపారవేత్తలు, నాలుగో ద్వారం నుంచి పౌరులు ప్రవేశించేవారని గైడ్ చెప్పాడు. అయితే ప్రస్తుతం ఒక ద్వారం నుంచే ప్రవేశం ఉంది. రాజుల సమాధులు కూడా అదే ప్రాంగణంలో ఉండడం విశేషం.
ప్యాలెస్ లో అతి ముఖ్యమైన భవనం త్రోన్ హాల్ ( Throne Hall ). దాని పైకప్పు 59 మీటర్ల ఎత్తు. ఆ హాలును రాజుల వివాహాలు,అతి ముఖ్యమైన రాజకీయ సమావేశాలకు, పట్టాభిషేకం లాంటి రాచ కార్యాలకు ఉపయోగించేవారట.
ఆ ప్రాంగణంలో మరో పర్యాటక ఆకర్షణ సిల్వర్ పగోడా. దానిని వాట్ ప్రేయా కియో ( Wat Preah keo ) అని పిలుస్తారు. పగోడాలోని నేల ( flooring) వెండి పలకలతో పరచబడి ఉంది. ఒక్కొక్క వెండి పలక సుమారు ఒక కిలో బరువు ఉంటుందట. మొత్తం 5,330 వెండి పలకలు ఉన్నాయట. అయితే ప్రస్తుతం సందర్శకుల సందర్శన నిమిత్తం చాలా తక్కువ మేర ఓపెన్ గా ఉంచారు. మిగతా భాగమంతా కార్పెట్ తో కప్పి వేసారు. దాదాపు 9000 కిలోల వెండితో చేసిన సిల్వర్ బుద్ధుడు ఉన్నాడు. ఆ విగ్రహం 9584 వజ్రాలతో అలంకరించబడి ఉంది. అందువల్లనే దానికి సిల్వర్ పగోడా అనే పేరు వచ్చింది. మరో పక్క (Emerald ) ఎమరాల్డ్ బుద్ధుని విగ్రహం కొంచం చిన్న సైజులో వుంది. ఇరువైపులా అద్దాల బీరువాలలో ఆనాటి పూజా సామగ్రి వుంది. సిల్వర్ పగోడాలో ఫోటోలు తీయడం నిషిద్ధం. మరోవైపు జాతక కథల గ్రంధాలున్నాయి. భాషగురించి మరో వ్యాసంలో విపులంగా రాస్తాను.
నదీతీరం వైపు ఉన్న మూన్ లైట్ పెవిలియన్ కు వెళ్ళాం. దానిని రాజ నర్తకిల నాట్యప్రదర్శనల కొరకు ఉపయోగించే వారట. మేం వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపాటి సంగీత కచేరి జరుగుతోంది. నేను చాలా ఆనందించాను. మన వందరూపాయలు బహుమానంగా ఇచ్చాను. ఇలాంటి సందర్భాలలో మన కరెన్సీ అయినా ఇవ్వవచ్చు. అక్కడినుంచి బయటకు వచ్చి మరోవైపు ఉన్న చిన్నపాటి మ్యూజియం లోనికి వెళ్ళాం. ఆనాటి రాజులు, రాణులు ఉపయోగించిన పల్లకీలో, దుస్తులు మొదలైనవి ఉన్నాయి. రాజు ఎక్కిన పల్లకీ తెలుపురంగులో పెద్దదిగా ఉంది. రాణి ఎక్కిన పల్లకి పసుపు రంగులో కొంచం చిన్నదిగా ఉండడం గమనించాను.
తర్వాత నెపోలియన్ పెవిలియన్ కు వెళ్ళాం. అది ఇనుముతో నిర్మించిన యురోపియన్ శైలి భవనం. దానిని ఫ్రాన్స్ చక్రవర్తి మూడో నెపోలియన్ కు కానుకగా ఇచ్చాడని గైడ్ చెప్పాడు. అక్కడి నుంచి మేం వాట్ ఫ్నోo టెంపుల్ కు వెళ్ళాం. అది చిన్న కొండమీద ఉంది. దానిని క్రీ శ 13. వ. శతాబ్దంలో నిర్మించారు. మందిరంలోపల కూర్చొని వున్న పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. నాలుగు వైపులా గోడల మీద బౌద్ధ జాతక కథలకు సంబంధించిన అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. మందిరానికి మరోవైపు తెల్లని రంగులో పెద్ద స్తూపం ఉంది. దాని ముందు భాగంలో 15 వ శతాబ్దానికి చెందిన రాజా పొన్ హెయో యత్ ( King Ponhea Yat ) అవశేషాలున్నట్లు రాసి వుంది.
ఆ మందిరానికి సంబంధించిన ఆసక్తికరమైన కథను గైడ్ ఇలా చెప్పాడు. “ఒక ధనిక కుటుంబానికి చెందిన పెన్ అనే వితంతువు మెకాంగ్ నదిలో కొట్టుకు వస్తున్న కోకి అనే చెట్టును చూసింది. ఆ చెట్టు లోపల ఆమెకు నాలుగు కాంస్య బుద్ధ విగ్రహాలు, ఒక విష్ణువు విగ్రహం దొరికాయి. ఆ విగ్రహాలను గౌరవప్రదంగా ఉంచడానికి ఆమె ఒక కృత్రిమ కొండను నిర్మించి దానిపై ఒక చిన్న ఆలయాన్ని కట్టించింది.” అందువల్ల ఆ ప్రాంతానికి ఫ్నోo పెన్ ( పెన్ యొక్క కొండ ) అనే పేరు వచ్చిందట.
phnom అంటే కొండ అని అర్థం. ఈ కథకు చారిత్రక ఆధారాలేమీ లేవు. కొండ కింద భాగంలో పచ్చని గడ్డి మీద ఇప్పటికీ పనిచేస్తున్న పెద్ద గడియారం ఉంది. సందర్శన వేళలు ఉదయం ఎనిమిది గంటలనుంచి పదకొండు గంటల వరకు. మధ్యాహ్నాం రెండు గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు. ప్రవేశ రుసుం స్థానికులకు 1000 రీల్స్. విదేశీయులకు పది అమెరికా డాలర్లు. నేను చూసినది, అక్కడక్కడా బోర్డుల మీద ఉన్న వివరాల ఆధారంగా, గైడ్ చెప్పిన మాటల ఆధారంగా దీనిని రాసాను.




