పరిధి, ఫోకస్ విస్తరించాయి

ఏ వాదమైనా ప్రారంభమైన కొత్తలో తీవ్రస్వరంతోనే మాట్లాడుతుంది. క్రమంగా అది స్థిరపడుతుంది. వేగం కన్నా విస్తృతికి ప్రాధాన్యమిస్తుంది. స్త్రీవాద సాహిత్యానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ సాహిత్యం మొదట్లో ఉధృతమైన ప్రవాహంలా ఉండేది. స్త్రీలపై అమలయ్యే అన్ని అసమానతలనూ, ద్వంద్వ విలువలనూ ఆవేశంతో, ఉద్వేగంతో ప్రశ్నించారు స్త్రీలు.

బహుశా అందుకు అనువుగానే కవిత్వాన్ని ఎక్కువగా ఎన్నుకున్నారేమో! ప్రశ్నించటానికి వీల్లేనంత పవిత్రతను ఆపాదించుకున్న కుటుంబ సంబంధాలపై విమర్శ ఎక్కువగా రావటం కూడా సహజంగానే జరిగింది. ఈ దశలోని సాహిత్యంలో కొంత సంచలనం, మొనాటనీ ఏర్పడటం వాస్తవం. నిజానికి అప్పటి సాహిత్యంలో కొంత మాత్రమే స్త్రీవాదమనే తాత్విక నిర్వచనంలో ఇముడుతుంది. ఎక్కువ శాతం స్త్రీల భావోద్వేగ ప్రకటనలే.

క్రమంగా స్త్రీవాద సాహిత్య విస్తృతి పెరిగింది. స్త్రీల నడుమ అంతర్గత  ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ దళిత, మైనారిటీ స్త్రీలు లేవనెత్తిన  ప్రశ్నలు ఇందుకు ఎంతో దోహదం చేశాయి. ఇక, ఈ తరం స్త్రీల రచనలు కుటుంబ సమస్యలను దాటి వివిధ సామాజిక రంగాల్లో స్త్రీల సమస్యలను చర్చిస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే స్త్రీవాద రచయితలు స్త్రీల ప్రత్యేక సమస్యలను మాత్రమే మాట్లాడుతారనే పరిస్థితి మారింది.

ఆర్థిక, రాజకీయ వాతావరణం సృష్టిస్తున్న అన్ని సంక్లిష్టతల్లో భాగంగా స్త్రీల సమస్యలను అర్థం చేసుకుంటున్నారు. భిన్న లైంగికత్వాల వ్యక్తులను స్త్రీవాద సాహిత్యం సొంతం చేసుకోవటం మంచి పరిణామం. మొత్తం మీద ఇవాల్టి స్త్రీవాద సాహిత్యం పరిథి,  ఫోకస్ విస్తరించాయి. ఈ అవగాహన సామాజిక ఆచరణలోకి తగినంతగా భాగమవకపోవటం మాత్రం నిరాశ కలిగించే ఒక వాస్తవం. అలా జరగాలంటే సాహిత్యమనే వాహిక మాత్రమే సరిపోదు. అది మరో పెద్ద చర్చ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *