ప్రతి ఒక్కరూ ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని : సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ చదువుల తల్లి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆమె విద్యాభివృద్దికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆ రోజుల్లోనే మహిళా సాధికారిత కోసం ఎంతో శ్రమించారని అన్నారు. శుక్రవారం ఆమె జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి అనేక సామాజిక రుగ్మతలపై సావిత్రీబాయి పూలే అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సమాజ హితం కోసం ఆ మహనీయురాలు చేసిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, మహిళలు, ఆడపిల్లల చదువు కోసం చేసిన విశేష సేవలకు గానూ ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా టీచర్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.




