- రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు
- మంత్రి మండలి ఆమోదముద్రకు ఈనెల 4న భేటీ
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో సంక్రాంతి కానుకలను అందజేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయలేకపోయిందన్న అపవాదు ఉంది. అయితే గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక వొడిదొడుకుల కారణంగా ఏడాదిగా జాప్యంజ రిగిన నేపథ్యంలో ఈ నూతన సంవత్సర కానుకగా పెండింగ్‌లో ఉన్న పథకాలను సంక్రాంతి నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ విషయమై గత నెల 16న సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్, మరోసారి ఈ నెల 4న సమావేశమై వీటిపై ఆమోదముద్ర వేయనుంది. ఇందులో ప్రధానంగా గత ఏడాది కాలంగా విపక్షాలు ఆయుధంగా మలుచుకున్న రైతు భరోసాపై క్యాబినెట్ చర్చించే అవకాశముంది. గత ప్రభుత్వం రైతు బంధు పేరున ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు మార్పుతోపాటు ఆర్థిక సహాయాన్ని పెంచనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలులో గత ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబించిందంటూ, తమ ప్రభుత్వం సరైన మార్గదర్శకాలతో అమలు చేస్తున్నందున జాప్యం అనివార్యమైందంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా సాగు అవుతున్న భూమిని మాత్రమే పరిగణలోకి తీసుకుని అంతమేరకే ఆర్థిక సహాయాన్ని అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అందుకే భూమి వివరాలు, రైతుల వారీగా విస్తీరణత, పంట విధానం తదితర వివరాలను సేకరించేపనిలో ప్రభుత్వం ఉంది.
దీనితోపాటు భవిష్యత్‌లో చేపట్టనున్న పంటల బీమా, పంటల ఆరోగ్య పరిస్థితి, చీడపీడలను మొదట్లోనే గుర్తించడం, వరదలు, తుఫాన్‌లలో జరిగే నష్టాన్ని అంచనా వేయడం లాంటి అనేక అంశాలకు సంబంధించిన సాంకేతికతను సమకూర్చుకునేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులతో పాటు, శాట్‌లైట్ ద్వారా వివరాలను సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.అలాగే సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న మరో కానుక భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలను అందించే పథకం. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీల వివరాల సేకరణలో ప్రభుత్వం నిమగ్నమైంది. పంచాయతీరాజ్, గ్రామీణభివృద్దిశాఖ యంత్రాంగమంతా ఇప్పుడాపనిలోనే ఉంది. కాగా జాతీయ ఉపాధిహామీ పథకం లబ్ధిదారులను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఈ పథకం కింద 55 లక్షలమంది ఉపాధిహామీ జాబ్ కార్డు ఉన్నవారున్నప్పటికీ వాస్తవంగా, భూమిలేని వ్యవసాయ కూలీలు సుమారు 17 లక్షలమంది మాత్రమే ఉండి ఉంటారన్నది ఓ అంచన.
సంక్రాంతి కానుకగా అందించే మరో ముఖ్యఅంశం కొత్త రేషన్ కార్డులు. గత ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అదిగో ఇదిగో అని చాలా కాలంగా ఊరించింది. చివరకు 2016లో అందుకు దరఖాస్తులు స్వీకరించి, 2019లో కొద్ది మందికి కార్డులను జారీ చేసి మానేసింది. అప్పటినుంచి రేషన్‌కార్డులు లేక నిరుపేద వర్గాలవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ ప్రజా సంక్షేమ పథకానికైనా లబ్ధిదారుడికి రేషన్‌కార్డు తప్పనిసరి కావడంతో ప్రభుత్వ పథకాలను పేదప్రజలు పొందలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా మూడునెలల క్రితం కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తులు చేసుకున్నవారు లక్షల్లో ఉన్నారు. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సామాన్యులతో ముడివడి ఉన్న ఈ ఎన్నికల వేళ రేషన్‌కార్డుల ప్రభావం పడే అవకాశముంది.
మరో ముఖ్య పథకం ఇందిరమ్మ ఇళ్లు. ఈ పథకం కింద వొచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. సుమారు 80 లక్షల దరఖాస్తులు వొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సగం దరఖాస్తుల పరిశీలన జరిగినట్లు తెలుస్తున్నది. మిగతా దరఖాస్తుల పరిశీలన సంక్రాంతిలోగా పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఇటీవల రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంవల్లే ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నదని చెబుతున్న శ్రీనివాసరెడ్డి, రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తిచేస్తామంటున్నారు. కాగా 4న జరిగే మంత్రిమండలి భేటీలో వీఆర్వో వ్యవస్థ, భూ భారతి తదితర అంశాలు కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తంమీద కాంగ్రెస్ ఎన్నికల హామీలు సంక్రాంతితో క్రాంతిలోకి రానున్నట్లు తెలుస్తున్నది.




