తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివారం, జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు అనే నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నది. ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాధికారులు సర్వే చేసి రూపొందించిన జాబితాలో పేరు ఉండాలనే షరతు ఇప్పటికే కొంత గందరగోళానికి దారి తీస్తున్నది. ఆ జాబితాలను గ్రామసభల ముందు పెట్టడం, జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం వంటి చిట్కా పరిష్కారాలను సూచిస్తున్నప్పటికీ, ఆ పనులు ఈ మూడు రోజుల్లో పూర్తయి, పథకాల ప్రారంభం అనుకున్నట్టుగా కచ్చితంగా,సంపూర్ణంగా జనవరి 26న మొదలవుతుందా, తూతూ మంత్రంగా ముగిసిపోతుందా స్పష్టత లేదు.
ఈ నాలుగు పథకాలలో రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రు. 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కార్డు ఉన్న కూలీలకు సంవత్సరానికి రు. 12,000, ఇందిరమ్మ ఇళ్ల తొలిదశలో స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రు. 5లక్షలు, కొత్త రేషన్ కార్డుల పథకం కింద 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరే రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సహాయం కన్నా ఎకరానికి రెండు వేల రూపాయలు ఎక్కువ చేసి ప్రకటిస్తున్నారు గాని, ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినది పదిహేను వేల రూపాయలు.
ఈ నాలుగు పథకాలలో ఇప్పటికే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉన్న కూలీలకు సహాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఒక్కటే పూర్తిగా కొత్తది. మిగిలిన మూడు పథకాలూ గతంలో ఉన్న పథకాలకు కొనసాగింపులో, లేదా చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసినవోమాత్రమే. అందువల్ల వాటిని పాత పథకాలతో పోల్చి చూసే అవకాశం ఉంది.
రైతు భరోసా అనే పథకం రైతు బంధు స్థానంలో వస్తున్నది గనుక కచ్చితంగా ఆ రెంటినీ పోల్చి చూడక తప్పదు. తెలంగాణ (భారత) రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఉపశీర్షికగా తెలుగులో ‘పంట పెట్టుబడి సహాయ పథకం’ అనీ, ఇంగ్లిష్ లో ‘అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్’ అనే ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకానికి తెలుగులో ఉపశీర్షిక ఇంకా తయారైనట్టు లేదు గాని, ఈ పథకం కోసం ప్రభుత్వం తయారు చేసిన ఇంగ్లిష్ వెబ్ సైట్ లో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అని గత పాలకుల ఉపశీర్షికనే యథాతథంగా ఉంచారు. పాత పథకం తప్పుల తడక అనీ,అక్రమాలు జరిగాయనీ, అనర్హులకూ, అవసరం లేని వారికీ సహాయం అందిందనీ అనేక విమర్శలు చేసి, ఆ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో మెరుగైన పథకం తెస్తామని ప్రగల్భాలు పలికినవారికి శీర్షిక మార్చినా, ఉపశీర్షిక మార్చవలసిన అవసరం కనబడలేదన్నమాట!
ఉపశీర్షికలో మార్పు జరిగిందా లేదా అన్నది చిన్న విషయం కావచ్చు. కాని అసలు ఆ ఉపశీర్షికలోనే కీలకమైన అంశం ఉంది. మన దేశంలో, రాష్ట్రంలో వ్యవసాయ పెట్టుబడి రైతులకు అనువుగాని పరిస్థితికి పెరిగిపోయిందనే సామాజిక వాస్తవానికి అది నిదర్శనం. ప్రభుత్వాలు రైతులకు సహాయం చెయ్యక తప్పని స్థాయికి పెట్టుబడి పెరిగిపోయిందనే వాస్తవానికి అది ఒక సూచిక అయితే ఆ ఉపశీర్షిక పెట్టుకున్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన పని,వ్యవసాయం చేసినా చేయకపోయినా, ‘‘వ్యవసాయ పెట్టుబడి సహాయం’’ అనే మాటతో సంబంధం లేకుండా భూమి ఉన్నవారందరికీ ఆ సహాయం పేరిట ప్రజాధనాన్ని ధారపోయడం. వ్యవసాయానికి సహాయం అని పేరు పెట్టి వ్యవసాయం చేయనివారికి సహాయం అందించింది. పారిశ్రామిక ఉపయోగంలో ఉన్న భూములకు, రియల్ ఎస్టేట్ గా మారిపోయిన భూములకు,పెట్రోల్ బంకులూ, ఫంక్షన్ హాళ్లూ, కొండలూ, గుట్టలూ వంటి అన్ని భూములకూ, ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయేతర భూములకు, వ్యవసాయంతో ఎంతమాత్రం సంబంధం లేని భూములకు ‘‘వ్యవసాయ పెట్టుబడి సహాయం’’ కోట్లాది రూపాయలు అందించింది. అది సాగుకు సహాయంగా కాక,భూయజమానికి పట్టా ఉన్నందుకు ప్రతిఫలంగా అందింది. నిజంగా ఆ భూమిలో కౌలుదార్లు సాగు చేస్తున్నప్పుడు కూడా సాగు చేస్తున్న కౌలుదారుకు సహాయంగా కాక, పట్టా ఉన్నందుకు భూయజమానికి నజరానాగా ఆ పథకం అమలయింది.
వ్యవసాయ పెట్టుబడిని తగ్గించే ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే,వ్యవసాయ రాబడిని పెంచడానికి చేయవలసిన పనులు ఎన్నో ప్రభుత్వం చేయగలిగినవే ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ లను మరింత మెరుగ్గా, రైతు అనుకూలంగా నడపడం, వ్యవసాయ ఫలసాయాన్ని ప్రైవేట్, గుత్త, సిండికేట్ వ్యాపారులు కారుచౌకగా కొల్లగొట్టాడానికి వీలు లేకుండా కనీస మద్దతు ధరలను నిర్ణయించి, చట్టబద్ధం చేసి, ఉల్లంఘనను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం ప్రభుత్వం చేయదలచుకుంటే చాలా సులభం. గిడ్డంగి వ్యవస్థలను, రవాణా వ్యవస్థలను పకడ్బందీగా రైతు అనుకూలంగా నిర్వహించి, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, వ్యవసాయ రాబడి గణనీయంగా పెరిగేలా చూడడం ప్రభుత్వం చేతిలో ఉన్న పనులే.
రైతు బంధు పథకం మీద జరిగిన ఒక సర్వే ప్రకారం గత ప్రభుత్వ పాలనలో రైతు బంధు అమలయిన ఆరు సంవత్సరాలలో మొత్తం రు. 80,453 కోట్ల నిధులు ‘‘రైతులు’’ అనబడేవారికి అందగా,అందులో రు. 25,672 కోట్లు సాగులో లేని భూములకు అందింది. అంటే మొత్తం ఖర్చయిన నిధులలో మూడో వంతు దుర్వినియోగమయ్యాయి. ఇక రాష్ట్రంలో సాగు అవుతున్న భూమిలో 30-35 శాతం భూమి కౌలుదార్ల చేతుల్లో ఉందనే ఒక అంచనా ప్రకారం, సాగులో ఉన్న భూమికి అందిన నిధుల్లో కూడా ఆ మేరకు సాగు చేయని భూయజమానులకే అందాయన్నమాట. అంటే రైతు బంధు పేరు మీద వ్యవసాయం కోసం అని చెపుతూ గత ప్రభుత్వం వెచ్చించిన మొత్తం ప్రజాధనంలో సగానికి పైగా,దాదాపు నలబై మూడు వేల కోట్ల రూపాయలు వ్యవసాయంతో సంబంధం లేని వారికే చేరాయన్నమాట.
ఈ నేపథ్యంలో తప్పనిసరిగా రైతు బంధు అమలు తీరును సమీక్షించి, వ్యవసాయ పెట్టుబడి సహాయం అనే సదాలోచనను కచ్చితంగా అమలు అయ్యేట్టు చూడడం ఈ ప్రభుత్వ బాధ్యత. ఈ పథకానికి కేవలం వ్యవసాయ భూములు మాత్రమే అర్హమవుతాయనీ, పారిశ్రామిక ఉపయోగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ కోసం కేటాయించిన భూములతో సహా సాగుకు అనుకూలం కాని భూములకు రైతు భరోసా వర్తించదనీ ప్రభుత్వం ప్రకటిస్తున్నది.
అయితే ఇక్కడ కూడా వ్యవసాయం జరుగుతున్నదా లేదా,వ్యవసాయ పెట్టుబడి అవసరమా లేదా అనే ప్రాతిపదిక కన్నా ఎక్కువగా సాగుకు యోగ్యమైన భూమి అవునా కాదా అనే చర్చ మాత్రమే జరుగుతున్నది. అందువల్ల రైతు భరోసా పరిధిలోకి రాని భూమి చాలా తక్కువ అని తేలుతున్నదని వార్తలు వస్తున్నాయి. నిజంగా వ్యవసాయం జరుగుతున్నదా లేదా నిర్ధారించడానికి ప్రభుత్వం దగ్గర భారీ యంత్రాంగం ఉన్నప్పటికీ దొంగలెక్కలే రాజ్యం చేస్తున్నాయి. ‘‘సాగుకు యోగ్యమైన భూమి’’ అని లెక్క వేస్తున్నారు గాని గుర్తించవలసిన విషయమేమంటే, అది సాగుకు యోగ్యమైన భూమే కావచ్చు, కాని ఏదో ఒక కారణం వల్ల ఈ సంవత్సరం సాగు జరుగుతుండకపోవచ్చు. దానికి రైతు భరోసా ఇస్తే ‘‘వ్యవసాయ పెట్టుబడి సహాయం’’ అనే మాట అర్థరహితం అవుతుంది.
రైతులకు, వ్యవసాయానికి సహాయం అందవలసిన అవసరం ఉందన్న మాటలో మరొక అభిప్రాయం లేదు. కాని రైతాంగానికి గిట్టుబాటు ధర అందకపోవడానికి, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాకపోవడానికి, ఆ పెట్టుబడిలో ఎంతో కొంత సహాయం అవసరం కావడానికి, వ్యవసాయం పట్ల అనాసక్తి పెరిగిపోతుండడానికి, వ్యవసాయ, గ్రామీణ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయి, రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తుండడానికి అనేక కారణాలున్నాయి. ఆ కారణాలను ఆలోచించకుండా, ఆ సమస్యలకు పరిష్కారాలు అన్వేషించకుండా, కేవలం ఏడాదికి పదివేలో పన్నెండు వేలో ఇస్తే అది వ్యవసాయ పెట్టుబడికి సహాయం చేసినట్టే అని సంతృప్తి పడడం పూర్తిగా అర్థరహితం.
రైతు బంధు పథకం మీద జరిగిన ఒక సర్వే ప్రకారం గత ప్రభుత్వ పాలనలో రైతు బంధు అమలయిన ఆరు సంవత్సరాలలో మొత్తం రు. 80,453 కోట్ల నిధులు ‘‘రైతులు’’ అనబడేవారికి అందగా,అందులో రు. 25,672 కోట్లు సాగులో లేని భూములకు అందింది. అంటే మొత్తం ఖర్చయిన నిధులలో మూడో వంతు దుర్వినియోగమయ్యాయి. ఇక రాష్ట్రంలో సాగు అవుతున్న భూమిలో 30-35 శాతం భూమి కౌలుదార్ల చేతుల్లో ఉందనే ఒక అంచనా ప్రకారం, సాగులో ఉన్న భూమికి అందిన నిధుల్లో కూడా ఆ మేరకు సాగు చేయని భూయజమానులకే అందాయన్నమాట. అంటే రైతు బంధు పేరు మీద వ్యవసాయం కోసం అని చెపుతూ గత ప్రభుత్వం వెచ్చించిన మొత్తం ప్రజాధనంలో సగానికి పైగా,దాదాపు నలబై మూడు వేల కోట్ల రూపాయలు వ్యవసాయంతో సంబంధం లేని వారికే చేరాయన్నమాట.
వ్యవసాయ పెట్టుబడి విపరీతంగా పెరిగిపోవడానికి, వ్యవసాయ రాబడి విపరీతంగా తగ్గిపోవడానికి ఎన్నో చారిత్రక, రాజకీయార్థికకారణాలున్నాయి. ప్రభుత్వ విధానాలు సక్రమంగా ఉంటే వ్యవసాయ పెట్టుబడిని తగ్గించడానికీ, నియంత్రించడానికీ,వ్యవసాయ రాబడిని పెంచడానికీ మార్గాలున్నాయి. వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, నీరు, విద్యుచ్ఛక్తి, మానవశ్రమ, వ్యవసాయ యంత్రాల వినియోగం వంటి ఎన్నో కారణాలున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాల వినియోగం వంటి వాటి ధరలన్నీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడంతో రైతులు తప్పనిసరిగా పెట్టుబడి కోసం బ్యాంకుల దగ్గరికి రుణాలకు వెళ్లవలసి వస్తున్నది. బ్యాంకులలో అవినీతి, తాత్సారం వల్ల,అధికారం, పరపతి, డబ్బు ఉన్నవారికే రుణాలు అందడంతో ఆ శక్తి లేని రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లవలసి వస్తున్నది. లేదా ఆయా ఉత్పాదకాల వ్యాపారుల దగ్గర మితిమీరిన వడ్డీ రేట్లకు అరువు తెచ్చుకోవలసి వస్తున్నది. బ్యాంకు రుణాల నిబంధనలు సులభతరం చేయడం ప్రభుత్వం చేతిలో పని. వ్యవసాయ ఉత్పాదకాల వ్యాపారం పూర్తిగా బహుళజాతి సంస్థల సామ్రాజ్యం అయిపోయింది గనుక, వారు గుత్తాధిపత్య ధరలు అమలు చేస్తున్నారు గనుక వారిని నియంత్రించడం,ధరలు తగ్గించడం, ఆంక్షలు పెట్టడం ప్రభుత్వం చేతిలో పని. ఈ పని చేయాలంటే ప్రభుత్వం మొదట రైతు అనుకూల, వ్యవసాయ అనుకూల ప్రభుత్వంగా మారాలి. తన కార్పొరేట్ అనుకూల ధోరణిని, విధానాలను మార్చుకోవాలి.
వ్యవసాయ పెట్టుబడిని తగ్గించే ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే,వ్యవసాయ రాబడిని పెంచడానికి చేయవలసిన పనులు ఎన్నో ప్రభుత్వం చేయగలిగినవే ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ లను మరింత మెరుగ్గా, రైతు అనుకూలంగా నడపడం, వ్యవసాయ ఫలసాయాన్ని ప్రైవేట్, గుత్త, సిండికేట్ వ్యాపారులు కారుచౌకగా కొల్లగొట్టాడానికి వీలు లేకుండా కనీస మద్దతు ధరలను నిర్ణయించి, చట్టబద్ధం చేసి, ఉల్లంఘనను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం ప్రభుత్వం చేయదలచుకుంటే చాలా సులభం. గిడ్డంగి వ్యవస్థలను, రవాణా వ్యవస్థలను పకడ్బందీగా రైతు అనుకూలంగా నిర్వహించి, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, వ్యవసాయ రాబడి గణనీయంగా పెరిగేలా చూడడం ప్రభుత్వం చేతిలో ఉన్న పనులే.
ఒకవైపు ఇటువంటి రైతు అనుకూల, వ్యవసాయ అనుకూల పనులు చేపట్టకుండా, అసలు వాటివైపే ఆలోచించకుండా, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు నిర్లజ్జగా అమలు చేస్తూ,మరొకవైపు తాము రైతులకూ, వ్యవసాయానికీ ఏదో మేలు చేస్తున్నట్టు భ్రమలు కల్పించడానికి రైతు బంధు అన్నా, రైతు భరోసా అన్నా అది నిజంగా రైతులకు బంధువూ కాదు,భరోసానూ కాదు. ప్రజాధనం లోంచి ఈ భారీ పథకాలు ప్రకటిస్తూ, అసలు వ్యవసాయంతో సంబంధం లేని, రైతులు అనడానికి ఎంతమాత్రం వీలు లేని తమ ఆశ్రితులకు సొమ్ము కట్టబెట్టడానికి తప్ప ఈ బంధులూ భరోసాలూ నిజంగా వ్యవసాయ పెట్టుబడికీ,వ్యవసాయానికీ, నిజమైన సాగు చేసే రైతులకూ చేసే అర్థవంతమైన మేలు ఏమీ లేదు.





ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!