అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీ నిరసన గళాలు

manduva ravindhraఅసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల  నుండి నిరసన వ్యక్తం కావడం ఆ పార్టీ వర్గాలను ఆందోళన కలిగిస్తున్న అంశం. శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినతీరు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నట్లుంది. ఆయన మాటలను మంత్రులు తేలిగ్గా తీసుకున్నట్లు నవ్వులు వినిపించినా మిగతా శాసనసభ్యులను ఆలోచింపజేసినవనే చెప్పాలె. ఎందుకంటే మిత్రపక్షమైన సిపిఐ, ఎంఐఎం నుండి కూడా అలాంటి సవాళ్ళనే అధికార పార్టీ సభాముఖంగా ఎదుర్కోవాల్సి వొచ్చింది. తనకు మంత్రిపదవి ఇవ్వలేదని చాలాకాలంగా రాజగోపాల్‌రెడ్డి అలిగిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తన నిరసన గళాన్ని వినిపించారనుకున్నా, మిత్రపక్షాల శాసనసభ్యులు కూడా అదే విషయాన్ని ఎత్తుకోవటంతో వారి మాటల్లో నిజమున్నదన్నది స్పష్టమవుతున్నది. ఇంతకాలం కేవలం అధికారపార్టీ ఎమ్మెల్యేల  నియోజకవర్గాలకే నిధులు ఎక్కువగా కేటాయిస్తారన్న మాటవినిపిస్తూ ఉండేది. కాని, ఇప్పుడు మంత్రుల నియోజకవర్గాలకే నిధులు తరలిపోతున్నాయన్నది రాజగోపాల్‌రెడ్డి మాటల ద్వారా అర్థమవుతున్నది.

చిన్న చిన్న పనులు అంటే కొన్ని లక్షల్లోనే పూర్తి అయ్యే పనులకు కూడా ఏండ్ల తరబడి నిధుల కోసం ఎదురుచూడాల్సి వొస్తున్నదంటూ గత కొంతకాలంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు  ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు లేకపోలేదు. ఉదాహరణకు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాసరెడ్డి ఇదే విషయాన్ని గతంలో బాహాటంగా ప్రకటించిన విషయం తెలియంది కాదు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిర్ధిష్టమైన కేటాయింపులుండాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. చిన్నపనులను కూడా సకాలంలో పూర్తి చేయకపోతే నియోజకవర్గ ప్రజల ముందు పరువు పోతుందన్న ఆయన ఆవేదన గమనార్హం. రాజగోపాల్‌రెడ్డి ఆవేదనకూడా అదె. వొచ్చిన నిధులను మంత్రులే తన్నుకుపోతే తమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు సిఎం కొడంగల్‌ ‌గురించి, ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ ‌గురించి మాట్లాడటమేనా మిగతా నియోజకవర్గాలపట్ల ఎందుకు వివక్షత చూపిస్తున్నారంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఒక లిఫ్ట్‌లేదు, కాలువలు లేవు కనీసం చెరువులు కూడా లేవు. ప్రభుత్వంలో ఉండికూడా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేసిన రాజగోపాల్‌రెడ్డి,  ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే అధిక నిధులు తరలిపోవడాన్ని ఎత్తి చూపడం, మిగతా సభ్యులు తమ నియోజవర్గాల పరిస్థితిని బేరీజు వేసుకున్నట్లు చేసింది.

అలాగే మిత్ర ధర్మానికి నోరుమూసుకున్నాంగాని తమ పరిస్థితి కూడా అందుకే మాత్రం తీసిపోదని సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టడం గమనార్హం. గత రెండున్నర ఏండ్లుగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లే కనిపిస్తున్న జరుగుతున్న పని మాత్రం ఏమీలేదనడం ప్రభుత్వ పాలనాతీరుకు అద్దం పడుతున్నది. శాసనమండలిలోనూ అదే నిరసన వ్యక్తమైంది. ఎమ్మెల్సీ  విజయశాంతి ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. కొద్దికాలంగా ప్రజల మధ్యకు రాకుండా, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విజయశాంతి ప్రభుత్వ పాలనా తీరును తప్పుపడుతూ మాట్లాడిన తీరు ఆ పార్టీని కొంత ఇరకాటకంలో పడేసినట్లైంది.

పదవుల పందేరంకన్నా రాష్ట్రం కోసం త్యాగం చేసిన వారికిచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరాన్ని ఆమె ప్రభుత్వానికి గుర్తు చేసింది. వారిని విస్మరించడం చారిత్రక తప్పిదమవుతుందంటూ మండలిలో ఆమె చేసిన ప్రసంగం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపినట్లైంది. ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ    ఉద్యోగం ఇవ్వాల్సిన విషయాన్ని, ఆ కుటుంబానికి నెలకు 25వేల పించన్‌ ఇవ్వాల్సిన విషయాన్ని, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన విషయాన్ని ఆమె ప్రభుత్వానికి గుర్తుచేసిన తీరు కొంతకాలంగా ఆమెలో ఉన్న అసహనాన్ని బహిర్గతం చేసినట్లు  అయింది . త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగనుండడంతో గతంలో తమకు మంత్రివర్గంలో అవకాశమిస్తామన్న హామీని నెరవేర్చక పోవడంవల్లే  వీరిద్దరు ఇలా విజృంభించి ఉండవొచ్చనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *