మన బియ్యానికి విదేశాల్లో గిరాకీ పెరుగుతున్నది. అక్కడి ప్రభుత్వాలు దిగుమతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యాదాద్రి జిల్లా నుంచి ఫిలిప్సీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు బియ్యం పంపించడానికి జిల్లాలోని నాలుగు మిల్లులు అంగీకరించాయి. మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్ వరకూ బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్సీన్స్‌కు తరలిస్తారు.బియ్యం కోసం గతేడాది ఫిలిప్సీన్స్ దేశం.. సర్కారును సంప్రదించింది. దీంతో ఆ దేశంతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ అప్పట్లోనే చర్చించారు.
బియ్యంలో నూక 5 శాతానికి మించకుండా ఎగుమతి చేయాలని ఆ దేశం కోరడంతో రాష్ట్రం నుంచి లక్ష టన్నుల బియ్యం ఎగుమతికి ప్రభుత్వం ఓకే చెప్పింది. పౌరసరఫరా శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిప్సీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో మిల్లర్లతో చర్చలు జరిపారు. జిల్లాలోని కాదంబరీ, యాదాద్రి, మల్లికార్జున, విద్య మిల్లుల్లోని బియ్యాన్ని లారీల ద్వారా కాకినాడ పోర్టు వరకూ తరలిస్తారు. అక్కడి నుంచి ఓడల ద్వారా ఫిలిప్సీన్స్‌కు పంపిస్తారు. 10 వేల టన్నులను ఫిలిప్సీన్స్‌కు పంపించడానికి ఓకే చెప్పాయి. అయితే సీఎంఆర్‌కు 25 శాతం నూకను ప్రభుత్వం అంగీకరించేది.. ఇప్పుడు 5 శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది.




