గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యా శాఖ మంత్రి గారు కూడా అయిన , శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి వ్రాయునది,
విషయం: తెలంగాణలో పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (NAS) ద్వారా వెల్లడైన తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థుల విద్యా స్థాయిలపై అత్యవసర చర్యలు తీసుకోవలసిన అవసరం గురుంచి.
పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (మునుపటి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే – NAS) ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల విద్యా స్థాయిలపై తీవ్రమైన ఆందోళన కలిగించే విషయాలను వెలికితీశాయి. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని ఈ లేఖ రాస్తున్నాను.
దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వే లో భాగంగా తెలంగాణలో 3286 పాఠశాలల్లో, 3, 6, 9వ తరగతులకి చెందిన మొత్తం 77,985 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 10,821 మంది ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 3వ తరగతిలో 23,655, 6వ తరగతిలో 24,330, 9వ తరగతిలో 30,479 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సర్వేలో ముఖ్యాంశాలు:
3వ తరగతి – భాష & గణితం: కేవలం 53% విద్యార్థులు మాత్రమే చిన్న కథలు చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు. సాధారణ సంభాషణలో ఉపయోగించే పదాలు 62% మందికి తెలియవు. ఇక గణితంలో కేవలం 44% విద్యార్థులే రూ.100తో సాధారణ లావాదేవీలు చేయగలిగారు. 48 మంది మాత్రమే సంఖ్యలను క్రమంగా ఏర్పరచగలిగారు. 52% విద్యార్థులు 99 వరకు సంఖ్యలను క్రమబద్ధంగా ఏర్పాటు చేయలేక పోయారు.
మూడవ తరగతి మొత్తం గా చూస్తే భాషా సామర్థ్యం 58%, మరియు గణిత సామర్థ్యం 54% మంది మాత్రమే కలిగి ఉన్నారు. ఈ ఫలితాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
6వ తరగతి భాష, గణితం & పరిసరాల ప్రపంచం: 54% విద్యార్థులు మాత్రమే ప్రధాన అంశాలను అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. 54% విద్యార్థులు సరళ గణిత నమూనాలను గుర్తించలేకపోయారు. కేవలం 34% విద్యార్థులకే సెం.మీ. ను మీటర్లుగా మారుస్తూ లెక్కలువేయడం వచ్చింది. మన చుట్టూ ప్రపంచం” అనే విభాగంలో, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలిసినవారు కేవలం 41%. మంది మాత్రమే.
ఆరవ వ తరగతి మొత్తంగా చూస్తే భాష సామర్ధ్యాలు 53%, గణిత సామర్ధ్యాలు 44%, పరిసర ప్రపంచం సామర్ధ్యాలు 44% సామర్థ్యం మాత్రమే. ఇవన్నీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
9వ తరగతి – భాష, గణితం, సైన్స్ & సామాజిక శాస్త్రం: 75% విద్యార్థులు శాతం తో కూడిన లెక్కలు చేయ లేకపోయారు. 69% మంది సంఖ్యా వ్యవస్థ (భిన్నాలు, అసలైన సంఖ్యలు) అర్థం చేసుకోలేకపోయారు. కేవలం 54% విద్యార్థులు రచనల నుంచి ముఖ్యాంశాలు సంగ్రహించగలుగుతున్నారు. 25% మాత్రమే శాతం లెక్కలు వాడి సమస్యలు పరిష్కరించగలిగారు. పూర్తిసంఖ్యలు, భిన్నాలు, గణితశాస్త్రీయ సంఖ్యలు మొదలైనవి అర్థం చేసుకున్నవారు కేవలం 31% మాత్రమే. ఆల్జీబ్రా సమస్యలు పరిష్కరించగలవారు 35% మంది విద్యార్థులు కూడా లేరు. 68% మంది విద్యార్థులు సర్క్యూట్ లో మౌలిక పరికరాల ఉపయోగంతో విద్యుత్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోలేక పోయారు. కేవలం 39%.మాత్రమే ధ్రువకాంశ లక్షణాలు వివరించగలిగారు. 56% మంది విద్యార్థులుకు వాణిజ్యం, వినియోగం, మూలధనం వంటి అంశాలపై అవగాహన లేదు. 66%. మంది విద్యార్థులు గతంలో జరిగిన మార్పులు సమాజంపై ఎలా ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోలేక పోయారు.
తొమ్మిదవ తరగతి లో మొత్తంగా భాషా సమర్ధ్యాలు 54% , గణితం 36%, సైన్స్ 39%, సామాజిక శాస్త్రం 38% మాత్రమే సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. ఇవన్నీ జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నాయని గుర్తించాలి.
విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించాలి: రాజకీయ సంకల్పాన్ని ప్రకటించాలి.
ఇవి కేవలం గణాంకాలు కావు మన విద్యావ్యవస్థలో ఉన్న చాలా లోపాలు ఉన్నాయని చూపిస్తున్న సంకేతాలు. ఇది రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం గాను మరియు రాష్ట్ర విద్యా సంక్షోభాన్ని సూచిస్తోంది. చదువులో వెనుక ఉన్న పిల్లలంతా బడుగు బలహీన వర్గాల పిల్లలే అని గమనించాలి. అన్నీ సంక్షేమ పథకాల కంటే విద్యా హక్కు తో నాణ్యమైన విద్యను అందించడం అంటే సామాజిక న్యాయాన్ని అందించడమే అని గుర్తించాలి.
ఈ స్థితికి కారణం సాంకేతిక లేదా పాలన పరమైనది కాదని రాజకీయ సంకల్పం తో కూడుకున్నదని గుర్తించాలి విద్యార్థులకు నాణ్య మైన విద్య ను సాధించటం కోసం అవసరమైన పరిష్కారాలు విద్యా వ్యవస్థలో చేయవలసిన సంస్కరణలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సంస్కరణలను అమలు చేయడం రాజకీయంగా సవాలుతో కూడుకున్న పని.
కొత్త పాఠశాలలు నిర్మించడం, ఉపాధ్యాయుల నియామకం, భోజన పథకాలు. ఇవి తక్షణ ఫలితాల్ని ఇస్తాయి. కానీ విద్యార్థులందరికి నాణ్య మైన విద్య ను అందించడం అనేవి తరగతి స్థాయిలో మార్పులు, టీచర్ శిక్షణ, సమర్థత, మరియు మార్గదర్శన అవసరం. ఇవి రాజకీయంగా కొంత కష్టమైన పని అయినప్పటికీ భావిషత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పనికి పూనుకోవాలి. పిల్లల సంఖ్య పెంచడంలో కాకుండా, వారు నిజంగా నేర్చుకునేలా చేసిన ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో గుర్తింపు పొందే మంచి అవకాశం అని గుర్తించండి Parakh నివేదిక ఆధారంగా విద్యా నాణ్యత సంక్షోభాన్ని అధికారికంగా అంగీకరించండి. విద్యా శాఖ లో ఉన్న ఉన్నత అధికారులనుండి క్లస్టర్ స్థాయి సిబ్బంది వరకు అందరూ విద్యార్థుల నాణ్యమైన విద్య మీదనే దృష్టి కేంద్రీకరించేలా చేయాలి. మీ అధికారిక పర్యటనలలో పాఠశాలలకు వెళ్లడము తప్పని సారి చేయండి. మీరే కాదు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజక వర్గాలలో పాఠశాలలకు వెళ్ళి విద్యార్థుల నాణ్యతా మీదనే పర్యవేక్షణ చేయమని ఆదేశాలు ఇవ్వండి. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి. తల్లిదండ్రులు, విద్యార్థుల అనుభవాలను వినండి. మన వ్యవస్థల దోషాల వలననే విద్యార్థుల కు నాణ్యమైన బోధన అందడం లేదని గుర్తించండి. విద్యా వ్యవస్థను ఈ వైపు ఆలోచించే విధంగా మార్గదర్శనం చేయండి.
ఈ నేపథ్యంలో తక్షణ చర్యలకు పూనుకోవాలని ప్రభుత్వానికి మనవి: విద్యా శాఖ అన్నీ పనులు పక్కన పెట్టి కేవలం విద్యా సామర్ధ్యాల అందించే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని రూపొందించాలి.
- పరాఖ్ సర్వేపై జిల్లాలవారీగా, పాఠశాలల స్థాయిలో సమీక్ష నిర్వహించాలి.
- ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులకు రిమీడియల్ టీచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి.
- ఉపాధ్యాయులకు స్వయంప్రతిపతిని ఇస్తూ తరగతి గదిలో అవసరమైన సహాయం అందించాలి.
- తల్లిదండ్రులు, సమాజాన్ని భాగస్వాములుగా చేయాలి.
- మండల మరియు జిల్లా స్థాయిలో అకడమిక్ రీసోర్స్ టీమ్‌లు ఏర్పాటు చేయాలి.
చివరగా
పరిష్కారాలు క్లిష్టమైనవి కావు క్లిష్టమైనది రాష్ట్రం లోని విద్యార్థులందరికి నాణ్యమైన విద్య ను అందిస్తామనే సంకల్పమే. దానికి పరిపక్వత చెందిన నాయకత్వం అవసరం. ఆ నాయకత్వం మీ చేతుల్లో ఉంది. నాణ్యమైన విద్య అందుకోవడం బాలల హక్కు. హక్కుల పరిరక్షణ ప్రభుత్వాల చట్టబడ్డ బాధ్యత అని గుర్తించండి. ఈ పరిస్థితి ఒక అత్యవసర పరిస్థితి గా గుర్తించి రాష్ట్రం లోని విద్యార్థులందరికి తరగతి వారి విద్యా సామర్ధ్యాలు అందించాలని విజ్ఞప్తి.
మీ భవదీయుడు
ఆర్. వెంకట రెడ్డి ,
జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్





