ఏది చివర? ఏది మొదలు?
చేరింది కాదు…
మొదలైంది కాదు!
తొలి శ్వాస ఎక్కడో?
తుది పలుకు ఎన్నడో!
కాలానికే తెలీని ప్రహేళిక
మేధస్సుకే చిక్కని ప్రశ్నావళి!
అయిపోయిన చోటే ఆరంభం
ఆరంభపు అడుగుతోనే అంతం!
తుది చివరలు అంతుపట్టని
బహుతలల వలయం!
దిక్కు ఎల్లలు కలసిపోయిన
అఖండ బ్రహ్మాండం!
తానే అయినా
తనకోసమే పితుకులాట!
మబ్బుపట్టిన మతితో
తనకోసమే వెదుకులాట!
బహిష్కృతమైన ధ్యాసతో
అంతర్ముఖునికై అన్వేషణ!
కల్పిత దర్పణంలో
ప్రతిబింబానికై నిరీక్షణ!
మాయామధురంపై గోధిక పట్టు
మేనిగంధంకై కస్తూరి గుట్టురట్టు!
అగ్నిశిఖలపై మోజపడ్డ శలభంలా
పునరపి మరణం! పునరపి జననం!
– ఉషారం, 9553875577





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల