కీలక వడ్డీరేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్
వరుసగా రెండోసారి రెపోరేటు 0.25 శాతం మేర తగ్గింపు
తగ్గనున్న గృహ, వాహన రుణాల వడ్డీల భారం
ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్ మల్హోత్రా
బంగారం రుణాలపై ఆంక్షలు విధించే యోచనలో ఆర్‌బిఐ
ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు- తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్య పరపతి విధాన సక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రెపోరేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. రెపో రేటు- తగ్గించడం వల్ల .. బ్యాంకులపై రుణభారం తగ్గనున్నది. దీని వల్ల బ్యాంకులు కూడా కస్టమర్లకు తక్కువ రేటుకే వడ్డీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా రుణాలపై ఈఎంఐలు తగ్గే ఛాన్సు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రెపో రేటను 6 శాతానికి తగ్గించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు- ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మరాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడులు, వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపించ నున్నాయి. ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించొచ్చని కూడా గవర్నర్ అభిప్రాయపడ్డారు. అధిక సుంకాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. తయారీ రంగం పునరుద్ధరిస్తున్న సంకేతాలు కన్పిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు- 6.5శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. తొలి త్రైమాసికంలో 6.5శాతం, రెండో త్రైమాసికంలో 6.7శాతం జీడీపీ నమోదవ్వొచ్చని అంచనా. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధిరేటు వరుసగా 6.6శాతం, 6.3శాతం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4శాతానికి దిగి రావొచ్చని అంచనా. త్రైమాసికాల వారీగా 3.6శాతం, 3.9శాతం, 3.8శాతం, 4.4శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి విదేశీ నిల్వలు 676 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
వీటితో రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.ఇకపోతే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలు కఠినతరం కానున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో ముత్తూట్ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ వంటి రుణ జారీ సంస్థల షేర్లు భారీగా క్షీణించాయి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇటీవల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు ఆర్‌బీఐ చర్యలకు సిద్ధమవుతోందని కొన్నిరోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్‌బీఐ తాజాగా స్పందించింది. వివిధ రకాల నియంత్రణ సంస్థలు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సమన్వయం చేయడంతో పాటు, సాధ్యమైనంత వరకు రిస్క్ తగ్గించేందుకు త్వరలో సమగ్ర నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. ఎంపీసీ సమావేశ వివరాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్‌బీఐ ప్రకటనతో ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర పతనం అయ్యాయి. బీఎస్‌ఈలో ఆ కంపెనీ షేర్లు రూ.2063కు చేరాయి. ఐఐఎఫ్‌ఎల్ షేర్లు సైతం 8 శాతం మేర క్షీణించాయి. మణప్పురం షేర్లు 3 శాతం, చోళమండలం షేర్లు 4.7 శాతం మేర పడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ జారీ చేసే రుణాల్లో 98 శాతం వరకు బంగారం తాకట్టుగా పెట్టుకుని ఇచ్చేవే అధికం కావడంతో ఆ కంపెనీ షేర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. మణప్పురం 50 శాతం, ఐఐఎఫ్‌ఎల్ 21 శాతం చొప్పున మొత్తం రుణాల్లో వాటాను కలిగిఉన్నాయి. రుణాల జారీ విషయంలో ఆర్థిక సంస్థలేవీ ఒకేతరహా విధానాలు పాటించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం, వేలం వరకు ఇలా ప్రతి దానికీ విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.




