“చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వం చేసిన అపరిమిత అప్పులే కారణమని ఆరోపిస్తోంది. అవి రుణ భారాన్ని పెంచాయని వాదిస్తోంది. అయితే, ప్రస్తుత నాయకత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా, మద్దతుదారుల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. వారు అప్పులను “వనరుల సమీకరణ”గా అభివర్ణిస్తున్నారు. గతంలో ఇదే మీడియా వర్గాలు ఇదే విధమైన రుణాలను “పెరుగుతున్న అప్పులు”గా విమర్శించిన నేపథ్యంలో, ఈ దృక్పథం మార్పును స్పష్టంగా చూపిస్తోంది.”
“అప్పు చేసి పప్పుకూడు” అనే సామెత తెలుగు వారికి సుపరిచితమే! ఎందుకంటే ఇది జీవిత సత్యాన్ని కళ్లకు కడుతోంది! ఏ కాలానికైనా వర్తించే ఈ ప్రాథమిక సత్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఆధారపడి విలాసవంతమైన జీవితాన్నిగడుపుతున్న వైనాన్ని స్పష్టంచేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన తాజా నివేదికలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దుస్థికి ఈ సామెత అద్దం పడుతోంది. పెరిగిపోతున్న అప్పుల భారం, అధికమవుతున్న ఖర్చులు, నిలిచిపోయిన ఆదాయ వనరులతో రాష్ట్రం సతమతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రీత్యా గురజాడ అప్పారావు చెప్పిన “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్న మాటలను మనం మరోసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నేపథ్యంలో ఇవి ఆందోళనకరమైన రీతిలో పెరుగుతుండటాన్ని చూస్తుంటే మహాకవి గురజాడ చెప్పిన మాటలనే కొద్దిగా మార్పుచేసి “రాష్ట్రమంటే నేల కాదు రాష్ట్రమంటే అప్పులు” అనుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిజంగా ఇది చాలా బాధాకారం. సెప్టెంబర్ 2025లో ప్రచురితమైన కాగ్ నివేదిక ఆంధ్రప్రదేశ్ రుణ విధానాలపై వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగించే రీతిలో వున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే రాష్ట్రం రూ. 55,901 కోట్లు అప్పు చేసింది.
ఇదే కాలానికి రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ. 61,578 కోట్లకు ఇది దాదాపు సమానం. అంతేకాదు ఇది ఈ ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న రుణ లక్ష్యంలో 70% కావడంతో అప్పులు ఎంత వేగంగా పెరుగుతున్నదీ కళ్లముందు కనబడుతోంది. ఈవిధంగా ఆదాయం కంటే వేగంగా కొనసాగే రుణ వృద్ధి ఆర్థిక వ్యవస్థపై కలుగుతున్న తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం రూ. 79,927 కోట్లు అప్పుగా తీసుకోవాలని బడ్జెట్‌లో నిర్దేశించుకున్నప్ప టికీ, ఈ ధోరణిని ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోంది. ఇంకా ఏడు నెలల సమయం వుండగానే, రాష్ట్రం ఇప్పటికే తన అప్పుల సామర్థ్యంలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా తీసుకుంది.
కేవలం ఐదు నెలల కాలంలోనే నిర్దేశించుకున్న అప్పులో మూడువంతులు వాడేస్తే, మిగిలిన ఏడు నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఏవిధంగా నెట్టుకొస్తుందనేది ఎవరికైనా ఆందోళన కలిగించే అంశం. ఈ అప్పులు ఈవిధంగా వుంటే అమరావతి ప్రాజెక్టు కోసం వేలాది కోట్ల రూపాయల నిధులను జాతీయ, అంతర్జాతీయ వనరుల నుంచి సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో ఈ ప్రాజెక్టును “స్వయం సమృద్ధ” ప్రాజెక్టుగా చిత్రీకరించినప్పటికీ, దీనికోసం చేస్తున్న అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారడం తథ్యం. దీనికి కారణం పన్నుల ఆదాయం నిలిచిపోవడం, వడ్డీ ఖర్చులు పెరిగిపోవడంగా చెప్పాలి.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ పెరిగిన అప్పుల పాపం జగన్ ప్రభుత్వంపైకి నెట్టేసి తనను తాను సుద్దపూసగా ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతోంది. దీనికి తోడు ప్రభుత్వానికి అనుకూల మీడియా ఈ అప్పులను “వనరుల సమీకరణ “గా ఒక పంచరంగుల చిత్రంలో చూపడానికి యత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే మీడియా అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతున్నదంటూ గగ్గోలు పెట్టింది. అస్మదీయులను ఒకరకంగా, తస్మదీయులను మరోరకంగా చూపించే ఈ మీడియా, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి అర్థభాగంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ఆర్థిక లోటును ఎదుర్కొన్న నేపథ్యంలో రాష్ట్రం మరింత భారీ అప్పులు చేయాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణి ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించే ప్రమాదాన్ని పెంచుతోంది. ఇది ప్రస్తుత ప్రభుత్వం నొక్కి చెబుతున్న “రియల్ టైమ్” పాలన, కార్పొరేట్ అనుకూల విధానాలకు సవాలుగా నిలుస్తున్నది. మూలధన పెట్టుబడులను పెంచడం, ఆదాయ వనరులను మెరుగుపరచడం, కఠినమైన ఆర్థిక జవాబుదారీతనాన్ని అమలు చేయడంపై దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు నెత్తీ నోరూ మొత్తుకుంటున్నారు.
రాష్ట్రం చేస్తున్న అప్పులకు, “సంపద సృష్టి” అనే నినాదానికీ మధ్య పొంతన ఎంతమాత్రం లేదు. ఈ విషయానికి ఇటీవలి నివేదికలు కుండబద్దలు కొట్టాయి కూడా! ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే పథకాలకు, అమరావతి ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి అప్పులపై ఆధారపడటం దీర్ఘకాలికంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక విపరిణామాలకు దారితీస్తుందన్న సంగతి స్పష్టమవుతోంది. అప్పులతో “పాలనను వాణిజ్యీకరించే” ప్రమాదకరమైన ఈ ధోరణి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదముందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదని తాజా నివేదికలు, ఆర్థిక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. వేగంగా పెరుగుతున్న అప్పులు, తలకుమించిన భారంగా మారిన ప్రాజెక్టుల వ్యయంతో పాటు మరోపక్క స్తంభించిన ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్థిర నమూనాకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ కోసం అప్పులపై ఆధారపడటమనేది దీర్ఘకాలంలో రాష్ట్రాన్ని మరింత దివాలా దిశగా తీసుకెళుతుందనేది సుస్పష్టం.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుస్థిరంగా వుంటుందనుకోవడమంత అవివేకం మరోటుండబోదు. ఆంధ్రప్రదేశ్ విజన్‌తో కూడిన నాయకత్వం, ముందుగా ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అసలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, దివాలా నుంచి బయటపడటానికి మార్గాలున్నాయా అన్నదే ఆ ప్రశ్న! ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తన ప్రజాకర్షక వాగ్దానాలకు, ఆర్థిక వాస్తవికతకు మధ్య సమతుల్యతను ఎంతమేర సాధించగలదనేది కూడా మరో ప్రధాన ప్రశ్న! 2025 రుణ అంచనాలు పరిశీలిస్తే ప్రభుత్వం ఆర్థికంగా పెను సవాళ్లను ఎదుర్కొంటున్నదనేది స్పష్టమవుతోంది. అడుగు ముందుకేసే సమయంలో ప్రభుత్వం తన విచ్చలవిడి ఖర్చు విషయంలో ఆత్మావలోకనం చేసుకోవాలి.
స్థిరమైన ఆదాయాన్ని మరింతగా పెంచే పద్ధతులపై దృష్టి సారించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి “అప్పుచేసి పప్పుకూడు” అన్న చందంగా తయారైన నేపథ్యంలో సరైన ఆదాయం లేకుండా ఎంతకాలం ఈ అప్పులపై రాష్ట్ర మనుగడ కొనసాగుతుందనేది ఏలినవారికే తెలియాలి! అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం ఏ ప్రభుత్వానికైనా ఎంతవరకు సమంజసం? అధికారం అనేది బాధ్యత! అందువల్ల పార్టీలు ప్రకటించే ఉచితాలకు ఆశపడితే నిండామునిగేది తామేనన్న సత్యం ప్రజలు గ్రహించినప్పుడే ఈ దుస్థితినుంచి బయటపడేందుకు వీలవుతుంది.





