రావ్‌బహాదూర్ నాగూ సయాజీ

ఇరుగు పొరుగు
బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళి, పట్టుదలతో, అకుంఠిత పరిశ్రమతో, అంకితభావంతో అంచె లంచెలుగా జీవితంలో ఎదిగి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచిపోయిన మహనీయులెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. అలాంటి వారిలో ‘రావ్‌బహాదూర్ నాగూ సయాజీ’  ముందు శ్రేణిలో నిలుస్తారు. తెలంగాణ ప్రాంతానికి, ముంబై నగరానికి అవినాభావ సంబంధం ఉంది. మూడు వందల యాభై సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతం నుండి ముంబైకి వలసలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా నాగూ సయాజీ తల్లిదండ్రులు కూడా ముంబైకి చేరుకున్నారు. తండ్రి గడ్డివ్యాపారంలో స్థిరపడి ఆర్థికంగా కాస్త ఎదిగారు. బాల్యం నుండి తండ్రి వ్యాపారం చేస్తున్న పద్ధతిని సునిశితంగా గమనించిన నాగూ సయాజీ కూడా ఆ వ్యాపార లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు అయితే ఆయన గడ్డి వ్యాపారంలో చేరకుండా భవన నిర్మాణరంగంలోకి చేరిపోయాడు.
చిన్నప్పటి నుండి నాగూ సయాజీ దూకుడు స్వభావం కలిగినవాడే.. ఏ పని చేసినా ధైర్యంగా చేసేవాడు. భవన నిర్మాణరంగంలో అతి త్వరలోనే ఆయన మంచిపేరు సంపాదించుకున్నాడు. ఆయన నిర్మించిన కట్టడాలు దృశ్యమనోహరంగా ఉండడమే కాకుండా నాణ్యతాపరంగా ఉన్నత స్థాయిలో ఉండేవి. ఆ విషయాన్ని గమనించిన తెల్లదొరలు నాగూ సయాజీకి వివిధ భవన నిర్మాణ పనులు అప్పగించడం మొదలుపెట్టారు. ఓవల్ మైదానానికి దగ్గర్లో ఉన్న సెక్రెటేరియట్ భవనం, సుప్రసిద్ధ రాజాబాయి టవర్, బొంబై హైకోర్టు భవనం, విశ్వవిద్యాలయ గ్రంథాలయ భవనం, ముంబైకి నీటి సరఫరా చేసే రిజార్వాయర్‌లలో ఒకటైన మజ్‌గావ్‌లోని బండార్‌వాడా జలాశయం లాంటివెన్నో నాగూ సయాజీ నిర్మించాడు.
ముంబై పర్యటనకు వచ్చే జనం వీక్షించే  భవనాల్లో రాజాబాయి టవర్, ముంబై హైకోర్టు తప్పకుండా ఉంటాయి. సెక్రెటేరియట్ భవనం, ముంబై హైకోర్టు భవనాల్ని నాగూ సయాజీ 1867 లో మొదలుపెట్టి 1874లో పూర్తి చేశాడు. సెక్రెటేరియట్ భవనాన్ని కర్నల్ విల్కిన్స్ డిజైన్ చేశాడు. 12 లక్షల 80 వేలు నిర్మాణ అంచనా వ్యయంగా లెక్కించారు. కానీ, నాగూ సయాజీ 12 లక్షల 60 వేలకే నిర్మాణం పూర్తి చేయడం విశేషం. కాగా, ఈ భవన నిర్మాణానికి విదేశాల నుండి కార్మికుల్ని రప్పించాలనుకున్నారు. అయితే, నాగూ సయాజీ అందుకు ఒప్పుకోకుండా, దేశీయ శ్రామికులతోనే పనులు పూర్తి చేసి తెల్లదొరల ప్రభుత్వాధికారుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. 1864లో ముంబైలోని అత్యధిక ధనవంతుల్లో ఒకరైన శేఠ్ ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ తన తల్లిగారైన ‘రాజాబాయి’ సంస్మరణార్థం ఒక భవ్యమైన టవర్ నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించి ఆ పనుల్ని నాగూ సయాజీకి అప్పగించారు.
280 అడుగుల ఎత్తుతో టవర్‌ను నిర్మించడం ఆ కాలంలో కష్టసాధ్యమైన పనే.. అలాంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించాడు నాగూ సయాజీ. ఆ రాజాబాయి టవర్ పై భాగంలో ఏర్పాటు చేసిన గడియారం వ్యాసం పదహారున్నర అడుగులు. ఆ గుమ్మటం ఎత్తు 52 అడుగులు.. అంత భారీ టవర్‌ను నిర్మించడంలో నాగూ సయాజీ చూపిన నైపుణ్యం నేటికీ లక్షలాది మంది పర్యాటకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే ఉంది. ఇలాంటి భారీ కట్టడాల్ని ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా నిర్మించడం నాగూ సయాజీ పనితనంలోని పరిపక్వతకు మరో తార్కాణం. నాగూ సయాజీ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ‘రావ్ బహాదూర్’ బిరుదుతో సత్కరించడం అప్పటి తెలుగువారికే కాదు ఈ తరానికి కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు..
నాగూ సయాజీ సామాజిక సేవా రంగంలో కూడా తన వంతు పాత్ర పోషించేవాడు. 24 సెప్టెంబర్ 1876లో సత్యశోధక్స మాజ్ కార్యదర్శి నారాయణ్ నాగర్కర్ జారీ చేసిన విరాళాల జాబితాలో నాగూ సయాజీ అప్పట్లోనే 10 రూపాయలు సత్య శోధక్ సమాజానికి విరాళం ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. 1876లో పది రూపాయల విరాళమంటే గొప్ప మొత్తమే మరి..! 1864లో ఆంగ్లో వర్ణిక్యులర్ స్కూల్ స్థాపనకు కూడా భూరీ విరాళాలు అందించారు. 1874 లో తెలుగు వారి కోసం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు బాలికల పాఠశాల ఏర్పాటు కోసం పాటుపడ్డారు. ప్రభాదేవి ప్రాంతంలో ఇప్పటికీ ఆయన పేరు మీద ‘నాగూ సయాజీ వాడి’  ఒకటుంది. శతాబ్దాల క్రితమే పరాయి ప్రాంతంలో తెలుగు పతాకాన్ని రెపరెపలాడించిన ఎందరో మహానుభావులు.. అందులో ఒకరైన నాగూ సయాజీ నిత్యస్మరణీయులు. రావ్‌బహాదూర్ నాగూ సయాజీ తన 63వ ఏట 8 జూన్ 1890న పరమపదించారు.
– సంగెవేని రవీంద్ర, 
– సెల్ నం: 
– 99871 45310

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *