భద్రాద్రికి రాముక్కోటి్ణ శోభ

  • నేడు గోదావరి నదీ తీరంలో తెప్పోత్సవం
  • తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనాలు
  • తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌కుండా భారీ బందోబ‌స్తు

భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గురువారం గోదావరి నదీ తీరంలో స్వామి వారి హంస వాహనం విహరించనుంది. శుక్రవారం తెల్లవారుజామున వైకుంఠ రాముడిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే తెప్పోత్సవానికి భారీ ఎత్తున భక్తులు వొచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. స్వామివారిని ప్ర‌తిష్ఠించేహంస వాహనాన్ని గత పది రోజులుగా అందంగా తీర్చిదిద్దారు. ఆదివారం సాయంత్రం అధికారులు ట్రైల్‌ ‌రన్‌ ‌కూడా నిర్వహించారు. 4 గంటలకు స్వామివారు ఊరేగింపుగా మేళతాళాలతో గోదావరి నదీ తీరం వద్దకు చేరుకుంటారు.

6 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వేద మంత్రోచ్ఛరణాలతో స్వామివారిని హంసవాహనంపై ఉంచి నది విహారం చేయనున్నారు. ఐదు సార్లు నదీ తీరంలో తిరుగనుంది. ఈ సుందర దృష్ట్యాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు రానున్నారు. స్వామివారు హంసవాహనం నదీతీరంలో విహరించనున్న సమయంలో గోదావరిలో భారీగా బాణసంచా కాల్చనున్నారు.

వివిధ ఆకారాల్లో తయారు చేసిన వాటికి బాణసంచా అమర్చి కాల్చనున్నారు. అంతేకాకుండా రంగురంగుల బాణసంచాను ఆకాశంలోకి విడిచిపెడతారు. భక్తులు ఈ సుందర దృశ్యాన్ని చూసే విధంగా కరకట్ట ప్రాంగణం, గోదావరి ఒడ్డున అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు నదీ తీరంలో విహరించే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అందరూ కలిసి చూసే విధంగా సెక్టార్లను కూడా విభజించి, ఏర్పాట్లు చేశారు. గోదావరి ఒడ్డున రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలను అలంకరించారు. ఇప్పటికే గత పది రోజుల నుంచి రామాలయం రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు.

శుక్ర‌వారం నుంచి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు
భ‌ద్రాద్రిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగే వైకుంఠ ద్వారదర్శనం అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రాముడుని చూసేందుకు వొచ్చే భక్తుల కోసం సెక్టార్లను విభజించారు. విఐపి, వివిఐపిలు వొచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, తగు సూచనలు చేశారు. భక్తులు ముక్కోటి ఉత్సవాలను చూసి తరించేలా ఏర్పాట్లను చేశారు. గ్రామపంచాయ‌తీ భక్తుల కోసం తాగునీటి సదుపాయం కల్పించింది. వొచ్చిన భక్తులు అంటురోగాలు ప్రబలకుండా ఉండేందుకు రహదారులు, గోదావరి ఒడ్డు, కరకట్ట ప్రాంతం అంతా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఎటువంటి అంటురోగాలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రధాన కూడలి వద్ద మెడికల్‌ ‌క్యాంపులు ఏర్పాటు చేశారు.  భక్తుల కోసం స్వాగతద్వారాలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రతీ క్షణం సమాచారం అందించడం కోసం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో సమాచార శాఖలను కూడా ఏర్పాటు చేసింది. తొక్కిసలాటలు జ‌ర‌గ‌కుండా  వేడుక‌ల‌ను సజావుగా చూసే విధంగా జిల్లా పోలీస్‌ ‌శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ముక్కోటి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంది. భక్తులు సేదతీరేందుకు గోదావరి నదీతీరాన హట్స్‌ను ఏర్పాటు చేసారు. అంతేకాకుండా గిరిజన సంప్రదాయక వంటకాలను అందించనున్నారు. అలాగే గిరిజనులు తయారు చేసే వ‌స్తువుల‌ను కూడా ప్రదర్శించనున్నారు. భక్తులు దొంగల బారిన పడకుండా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ అం‌తరాయం కలుగ‌కుండా ట్రాఫిక్‌ ‌పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. దేవస్థానానికి వొచ్చిన భక్తులకు ప్రసాదాలు అందేలా సిద్ధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *