- గత పదేళ్లుగా శరవేగంగా రైల్వేల అభివృద్ధి
- చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుంది..
- చర్లపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు
- రూ. 720 కోట్లతో సికింద్రాబాద్, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధి
- కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 : రైల్వేలు రవాణ వ్యవస్థకు జీవనాడి లాంటిది. అలాంటి రైల్వేవ్యవస్థ గత పదేళ్లుగా అనేక రకాలుగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ టెర్మినల్ నిర్మాణానికి దోహదపడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నకు, అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, విద్యుదీకరణ వంటి అనేక రకాలుగా వేగవవంతంగా అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. రూ. 413 కోట్లతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సులభతరంగా వెళ్లేలా ప్రయాణికులకు ఉపయోగపడుతుందన్నారు.
రానున్న రోజుల్లో వస్తు రవాణా విషయంలోనూ ఉపయోగపడుతుందన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా చర్లపల్లి నుంచి ఘట్ కేసర్ వెళ్లనున్నాయని, చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుందని తెలిపారు. . కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్దఎత్తున ఏకకాలంలో రూ. 1350 రైల్వేస్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో కొత్త మోడల్ లో అభివృద్ధి చేస్తోంది. రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ ను ఆధునికీకరిస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. ఇన్నాళ్లు రైలు కూత వినపడని ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వేలైన్లు నిర్మించి డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చేపట్టింది. తెలంగాణలో డీజిల్ తో నడిచే రైళ్లను దశలవారీగా నిలిపివేసి 100% విద్యుదీకరణ వైపు పాలసీ మార్చి, రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తోంది. రానున్న రోజుల్లో రైల్వే ప్రమాదాలను నివారించేలా, మరింత భద్రతను కల్పించేలా కవచ్ అనే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థను తీసుకువొచ్చింది.
మొట్టమొదటిసారిగా తెలంగాణలో ట్రైన్ మార్గంలో కవచ్ సిస్టమ్ ను అమలు చేయడం జరుగుతోంది.హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేలా 5 వందే భారత్ ట్రైన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రైల్వేలకు అన్ని రకాలుగా కనెక్టవిటీ పెంచేలా సహకారం అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్షా 20 వేల కోట్ల నిధులతో నేషనల్ హైవేలు నిర్మించాం. మరో రూ. 80 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నాం. రాష్ట్రంలో 33 జిల్లాలకు.. మొత్తం 32 జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న కాజీపీట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. కాజీపీట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రైల్వే ఇంజిన్లు, రైల్వే వ్యాగన్లు, రైల్వే కోచ్ లను ఉత్పత్తి చేయనున్నారని, దీంతో సుమారు ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.
తెలంగాణలో 346 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్లను వేగవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చామని, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా కేంద్ర ప్రభుత్వం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు నిర్ణయించింది. అందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వేగవంతంగా రైల్వే లైన్ ను విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. కొమురవెల్లి లోని మల్లికార్జున స్వామి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రయాణ వెతలను తీర్చేలా కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం. పనులు వేగవంగా జరుగుతున్నాయి. రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్టును తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చర్లపల్లి రైల్వేస్టేషన్ కు అప్రోచ్ రోడ్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక ఉత్తరాలు రాసినా.. స్పందించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు ను పూర్తి చేయాలి.
హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్ గా ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ రోడ్డ నిర్మాణం కోసం సుమారు రూ. 26 వేల కోట్లు వెచ్చిస్తోంది. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.




