ఇక్కడ ప్రతి పూటా
ఎందరో ఆడపిల్లల పొత్తి కడుపులు
సన్నని కత్తులతో కోయబడుతున్నాయి
దాన్ని మనసారా స్వాగతిస్తున్నారు వాళ్ళంతా
ఇక్కడ ప్రతి పూటా
పసిబిడ్డల దుఃఖపు అరుపులు
ఘంటానాదాల్లా వినిపిస్తున్నాయి
ఆ ఏడుపు వింటూ సంతోషిస్తున్నారందరూ
లోపల ఓ మనిషి
నొప్పులతో విలవిలలాడుతుంటే
ఆందోళనను, ఆనందాన్ని
ఏకకాలంలో ప్రదర్శిస్తున్నాయి
బయట ఆత్రుతతో నిలుచొనున్న మనసులు
ఇక్కడ చావుకు చేరువగా పోతూ కూడా
మరో మనిషిని, మరో మనిషిని
ఈ మట్టి మీద నిలబెట్టాలన్న బాధ్యతను
తలకెత్తుకొని తపిస్తున్న తల్లులు కనిపిస్తున్నప్పుడు
మొత్తం ఆడతనానికే తలవంచి మొక్కాలనిపిస్తోంది
ఇక్కడ ఎన్ని పవిత్ర దేవవృక్షాలో
పుట్టుకకు కారణభూతమైన మహిమాన్విత వృక్షాలు
ఎన్ని తాజా పూలమొగ్గలో
ముట్టుకుంటే కందిపోయేంత లేలేత మొగ్గలు
ఇక్కడంతా పురిటివాసనే అయినా
నాకిది పూల పరిమళంలాగే ఉంది
ఈ మానవ జనన కేంద్రం
నాకో రంగురంగుల పూలవనంలాగే గోచరిస్తోంది





