మగువకు రక్షణ – సమాజానికి శ్రీరామరక్ష

“గడప దాటితే గండమని, ఇంట్లో ఉంటే బందీ అని మదనపడుతున్న మహిళామణికి రక్షణ అన్నది ఎండమావిలా మారింది. అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా మారిన పల్లె పడుచులు, ఆకాశమే హద్దుగా ఎదిగినా పదోన్నతుల్లో మాత్రం అడ్డుతగిలే కార్పొరేట్ కొలువులు.. ఇలా స్త్రీ ఉనికి నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఆధునికత ముసుగులో జరుగుతున్న సైబర్ వేధింపుల నుండి మొదలుకొని, కట్నకాసుల కోసం కక్కుర్తి పడే ముసలి మనస్తత్వాల వరకు అన్నీ స్త్రీ సహనాన్ని పరీక్షించే అగ్నిపరీక్షలే.”
నేటి నవభారతంలో ‘అబల సబల అయిందని’ ఆకాశానికెత్తుతున్నా, నిజజీవితంలో అడుగుడుగునా మహిళల ఆశలు అగాధాల్లోనే అణిచివేయబడుతున్నాయి. పురిట్లోనే ఆమె ఎదుగుదలకు అడ్డుకట్ట వేసే పురుషాధిక్య పోకడలు ఒకవైపు, ‘ఆడపిల్ల అంటే అప్పుల భారమే’ అని కన్నవారే ముఖం చాటేయడం మరొకవైపు సామాజిక విషాదంగా మారాయి. భ్రూణహత్యల నుండి మొదలై, పడుచుదనాన్ని బలిపీఠం చేసే కీచకుల వరకు ప్రతి దశలోనూ వివక్ష ఆమెను ఓ నీడలా వెంటాడుతూనే ఉంది. బయట సమాజంలో మేధావులుగా చలామణి అయ్యే కొందరు పురుషపుంగవులు, ఇంటి నాలుగు గోడల మధ్య మాత్రం ఇల్లాలిని వెట్టిచాకిరీ చేసే బానిసలా చూడటం శోచనీయం.  శ్రమ దోపిడీలో ఆమెకు సాటిలేదు కానీ, వేతనాల విషయానికి వస్తే మాత్రం అన్యాయమే ఎదురవుతోంది.
సమాన పనికి సమాన వేతనం అన్నది కేవలం రాజ్యాంగ హక్కుగానే మిగిలిపోయింది తప్ప, ఆచరణలో అడియాసగానే కనిపిస్తోంది. గడప దాటితే గండమని, ఇంట్లో ఉంటే బందీ అని మదనపడుతున్న మహిళామణికి రక్షణ అన్నది ఎండమావిలా మారింది. అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా మారిన పల్లె పడుచులు, ఆకాశమే హద్దుగా ఎదిగినా పదోన్నతుల్లో మాత్రం అడ్డుతగిలే కార్పొరేట్ కొలువులు.. ఇలా స్త్రీ ఉనికి నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఆధునికత ముసుగులో జరుగుతున్న సైబర్ వేధింపుల నుండి మొదలుకొని, కట్నకాసుల కోసం కక్కుర్తి పడే ముసలి మనస్తత్వాల వరకు అన్నీ స్త్రీ సహనాన్ని పరీక్షించే అగ్నిపరీక్షలే. ఇంటికి దీపం ఇల్లాలు అనుకుంటూనే ఆమె వెలుగును ఆర్పేయడం ఏ రకమైన సంస్కారం? మాతృత్వాన్ని గౌరవించే గడ్డపైనే మగువకు మనశ్శాంతి కరువవ్వడం దేశానికే గొడ్డలిపెట్టు. చట్టాలు ఎన్ని ఉన్నా, కట్టుబాట్ల పేరిట పెట్టే కష్టాలు తీరనంత వరకు ఈ వివక్ష రక్కసి కోరల మధ్య స్త్రీ నలిగిపోతూనే ఉంటుంది.
ఇంకెన్నాళ్ళు ఇలా ?
ఎంత కాలమిలా మహిళా చైతన్యం ‘అడవిలో కాసిన వెన్నెల’లా వృధా కావాలి? ఏదో ఒక అన్యాయం జరిగినప్పుడు “చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు” స్పందించడం కాకుండా, ఆ అన్యాయం జరగకుండా చూసే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సమాజపు రక్తం పీల్చుతున్న ఈ వివక్షను రూపుమాపాలంటే కేవలం చట్టాలు ఉంటే సరిపోదు. అవి బాధితులకు కొండంత అండగా నిలవాలి. అప్పుడే మగువ కళ్లలో ఆనందం, సమాజానికి అసలైన శ్రీరామరక్ష అవుతుంది. స్త్రీ సాధికారత అనేది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులతోనే సాధ్యపడుతుంది. నేటి చదువులు కేవలం మార్కుల వేటకే పరిమితం కాకుండా, లింగ సమానత్వాన్ని నరనరాల్లో జీర్ణించుకునేలా పాఠ్యాంశాలు రూపుదిద్దుకోవాలి. చిన్నతనం నుంచే “ఆడపిల్ల బలహీనమనే” భావనను తుడిచిపెట్టి, ఆత్మరక్షణ విద్యలనే కవచాన్ని వారికి తొడిగించాలి. విద్యా సంస్థలు కేవలం అక్షరాలు దిద్దించే బడులుగా కాకుండా, ధైర్యాన్ని ఇచ్చే కేంద్రాలుగా మారాలి. ఆడపిల్లల చదువు మధ్యలో ఆగిపోవడానికి కారణమవుతున్న అడ్డంకులను వేళ్లతో సహా పెకిలించి వేయాలి.
రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు కేవలం అలంకార ప్రాయం కాకుండా, వారు నిర్ణయాధికారంలో క్రియాశీలక పాత్ర పోషించేలా పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు కావాలి. గృహ హింస నుండి అతివలను రక్షించే చట్టాలు కేవలం ‘కాగితపు పులుల్లా’ గర్జించడం మానేసి, అణగారిన మహిళకు ఆయుధాల్లా మారాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు, మొక్కుబడి కమిటీలతో కాలక్షేపం చేయకుండా, కఠినంగా అమలు కావాలి. లింగ వివక్ష చూపే సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారీ జరిమానాలు, శిక్షలు అమలు పరచడం అత్యంతావశ్యకం. న్యాయ వ్యవస్థలో సాగతీత ధోరణి ఉండకూడదు. అత్యాచార బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలో  ‘ఫాస్ట్ ట్రాక్’ కోర్టులు మెరుపు వేగంతో తీర్పులిచ్చి నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించాలి. ఆస్తి హక్కుల్లో మహిళలకు సమాన వాటా అన్నది ‘అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు’ సులభతరం కావాలి తప్ప, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే పరిస్థితి రాకూడదు. ముఖ్యంగా సైబర్ వేధింపుల విషయంలో బాధితురాలి గోప్యతను కాపాడుతూ వేటగాళ్లను వేటాడేలా చట్టాలు పదును పెరగాలి. సినిమాల్లో స్త్రీని కేవలం ‘గ్లామర్ బొమ్మ’లా చూపించే ధోరణి మారాలి. ప్రతి మగాడు తన ఇంట్లోని స్త్రీని గౌరవించడమే కాకుండా, సమాజంలోని ప్రతి మహిళను తన తోడబుట్టిన దానిలా చూసే సంస్కారాన్ని పెంపొందించుకోవాలి.
‘కూపస్థమండూకం’ కాగూడదు:
సమాజంలో మార్పు అనేది ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. అది మన ఇంటి గడప నుండే మొదలవ్వాలి. ఆడపిల్ల పుట్టగానే ముఖం చాటేయకుండా, మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఆహ్వానించే సంస్కారం ప్రతి గుండెలో మొలకెత్తాలి. ఇంటి పనుల్లోనూ, పిల్లల పెంపకంలోనూ పురుషులు భాగస్వాములు కావాలి. “ఆడపిల్ల చదువు – ఇంటికి వెలుగు” అన్న మాటను కేవలం సూక్తిగా కాకుండా, ఆమెకు ఉన్నత చదువులు చెప్పించి ఆకాశమంత అవకాశాలను అందించడం మన తక్షణ కర్తవ్యం. అప్పుడే ఆమె ‘కూపస్థమండూకం’లా కాకుండా, లోకాన్ని శాసించే ధీరవనితగా ఎదుగుతుంది. బయట ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే “మనకెందుకులే” అని ఉండటం మానవత్వం అనిపించుకోదు.
వేధింపులకు గురవుతున్న మహిళను చూసినప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా, ఆమెకు బాసటగా నిలవాలి. కట్నకాసుల వేటలో కక్కుర్తి పడే మనస్తత్వాలను అడ్డుకోవాలి. ఆడపిల్లలను కేవలం అలంకార వస్తువులుగా కాకుండా, ఆలోచనలు పంచుకునే సహచరులుగా గౌరవించడం నేర్చుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే వారిని అడ్డుకోవాలి. “ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్నారు” పెద్దలు. కాబట్టి మన ఇంటి నుండే ఈ మార్పు మొదలైతే, దేశమంతా నందనవనంలా వికసిస్తుంది. ఈ మార్పు కోసం మనం రేపటి వరకు ఆగకూడదు, ఇప్పుడే అడుగు వేయాలి. మన చిన్న మార్పు సమాజంలో పెద్ద విప్లవానికి దారితీస్తుంది. మన ఆలోచనల్లోని మురికిని వదిలిపెట్టి, సమానత్వ భావనను పెంచుకుంటేనే రేపటి తరం బంగారు భవిష్యత్తును అందుకోగలదు.
కింజరాపు అమరావతి
9494588909

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *