సిద్దాంత వైఫల్యాల ప్రచారం..ఫాసిజంలోకి భారత్‌..!?

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలకు వదిలేయాలి. ప్రజా సంఘాలతో ప్రజా పోరాటాలు నిర్మించాలి. రాజకీయ పోరాటంతో ఫాసిస్ట్‌ను ఓడించలేం. ఎన్నికల రాజకీయానికి ప్రజా పోరాటాలు కావాలి. దేశంలో ఇప్పుడు తెలంగాణ తరహా పోరాటాలు కావాలి. నేపాల్ , బంగ్లాదేశ్‌, శ్రీలంక పోరాటాలు పని చేయవు. అలాంటి ఉద్యమాలు వొచ్చినా  అది వరిగడ్డి మంటల ఆరిపోతుంది..అది దోపిడీ దారులకు మరింత దోచుకోవాడానికి, ప్రజలను అణిచివేయడానికే పనికి వొస్తుంది. దూర దృష్టి, తక్షణ ఎత్తుగడలతో ప్రజా ఉద్యమ రూపాలుండాలి. కమ్యూనిస్ట్‌లు ఐక్యం కావాలి..ప్రజలతో ప్రజాసంఘాలే ఏకం కావాలి. .కాంగ్రెస్‌కు కాకుండా ప్రజా పోరాటాలకు రాహుల్ నాయకత్వం వహించాలి.  
దేశంలో గత కొంతకాలంగా మూడు సిద్దాంతాల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. మూడు  పార్టీల మధ్య సైద్ధాంతిక చర్చలు జరుగుతున్నాయి..ఆ మూడు పార్టీలు, ఆ మూడు సిద్దాంతాలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. దేశ ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతికంగా ప్రభావం చేశాయి. ఆ మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, మావోయిస్టు పార్టీలైతే. బూర్జువా ప్రజాస్వామ్యం, ఫాసిస్టు, నూతన ప్రజాస్వామిక విప్లవం ఆ మూడు పార్టీల సిద్దాంతాలు. దేశంలో కమ్యూనిస్టు పార్టీల సిద్దాంతాలున్న కొద్దిగా తేడాలున్న కాంగ్రెస్ లో  భాగంగా ఉన్నట్లే భావించాలి. ఈ మూడు పార్టీలు, ఆ సిద్ధాంతాలే దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఒకటి త్యాగాలతో కూడి ప్రజలను చైతన్యం చేస్తూ వోట్లు, సీట్లతో భవిష్యత్తు మారదని అభ్యుదయం, భౌతిక వాదాన్ని బోధిస్తూ శాస్త్రీయ దృక్పథం వైపు నడిస్తే..ఇంకోకటి  ఫాసిస్టు పాలనా, నియంతృత్వం పాలన చేస్తూ, భావవాదాన్ని ప్రొత్సహిస్తు ప్రతిఘాతుకాభృద్ధితో ప్రజలను మతం, మూఢత్వంతో తిరోగమనం వైపు తీసుకుపోతుంది. మరోకటి వోట్లు, సీట్లు బూర్జువా ప్రజాస్వామ్యమే ప్రజల జీవితాలను మార్చుతాయనే భ్రమను కల్పించి అధికార కోరికలు తీర్చుకుంటుంది.
.ప్రపంచ వ్యాప్తంగా, ఆయా దేశ  రాజకీయాల్లో వస్తున్న మార్పులు, ఫాసిస్టు పార్టీల ప్రాబల్యం వేగంగా పెరుగుతుంది.  నియంతృత్వం, అణిచివేత ప్రభుత్వాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే బూర్జువా   ప్రజాస్వామ్యం, మతవాద ఫాసిస్ట్‌, నూతన ప్రజాస్వామ్య విప్లవ సిద్దాంతాలపై దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. దేశంలో పై మూడు సిద్దాంతాల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది..త్యాగాల పార్టీలకు బోగాల పార్టీల మధ్య సైద్దాంతిక సంఘర్షణ కొనసాగుతుంది. అయితే అధునిక ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాకా, ప్రపంచ దేశాల్లో అమెరికా ఆధిపత్యం పెరిగి, పాలనలో ఆర్ధిక సంస్థల జోక్యం విపరీతరంగా పెరిగి, ఏకంగా ప్రభుత్వాలనే శాసించే స్థాయికి చేరిన క్రమంలో త్యాగాల పార్టీలకు సహజంగానే ఆదరణ  తగ్గుతుంది. ప్రజలను భ్రమల్లో ముంచే బూర్జువా  పార్టీలకు ఆదరణ  పెరుగుతుంది. కొంత ప్రజాస్వామ్య భావాలున్నట్లు కనిపిస్తున్న బూర్జువా  పార్టీలతో పోల్చుకుంటే. మత పార్టీలు, ఫాసిస్ట్‌ పార్టీలు క్రమంగా బలపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇండియాలో ఇలాంటి రాజకీయాలు ఇంకాస్తా ఎక్కువయ్యాయి.
బూర్జువా  ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్‌ పార్టీ. ఫాసిస్ట్‌ పాలన తీసుకువచ్చేందుకు బీజేపీ. నూతన ప్రజాస్వామ్యం కోసం నక్సలైట్లు పోరాటం చేస్తున్నాయి. ఇండియా ఫాసిస్ట్‌ దేశంగా మారేందుకు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య , మావోయిస్టు పార్టీల సిద్దాంతాలు బలహీనపడుతున్నాయి. దేశ రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాల్లో అమెరికా, దాని ఆర్ధిక సంస్థల ఆధిపత్యం పెరగడంతో కాంగ్రెస్‌, నక్సలైట్ల వాదనలకు ప్రజా ఆమోదం తగ్గుతూ , ఫాసిస్ట్‌ ధోరణలు బలపడుతున్నాయి. ఇప్పటికే  దేశంలో ఫాసిస్ట్‌ రాజ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై భిన్నవాదలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, మావోయిస్టులు, కమ్యూనిస్టులు వారివారి సిద్దాంతాలకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. రాజ్యాంగం అమలు, ప్రజాస్వామ్యం విషయంలో బూర్జువా  పార్టీలకు నక్సలైట్లకు మధ్య భిన్న వాదనలున్నాయి. భారత ప్రజాస్వామ్యం  మేడిపండు , రాజ్యాంగం అమలులో పక్షపాతముందని, ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉండటమే ఇందుకు కారణమని మావోయిస్టులంటే. అధికార మార్పిడి ప్రజాస్వామ్యమే అభివృద్ధి ప్రజాస్వామ్యం అని బూర్జువా  పార్టీలు వాదిస్తున్నాయి.
రాజ్యాంగబద్ద పార్టీలు, నిషేధిత పార్టీల వాదనలు ఎలా ఉన్న, దేశం ఇప్పుడు ఒక క్లిష్టపరిస్థితిలో ఉందన్నది వాస్తవం. వోట్ల పార్టీల తీరుతో  రాజ్యాంగం పట్ల  ప్రజలు అసంతృప్తితో  ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ  రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలం అవుతుండటంతో జనాల్లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతుంది. విశ్వాసాన్ని కల్పించాల్సిన పాలక వర్గాలు ఆ పని చేయడం లేదు. దీంతో ప్రజల అసంతృప్తి దారి తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాకు పోరుగునున్న దేశాలతో ప్రజల తిరుగుబాట్లు భారతీయులను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న యువత పోరాటాలు, 80 శాతం యువత ఉన్న మన దేశ యువతను ప్రభావితం చేస్తున్నాయి. అసమానతలు, అణిచివేతలు, నియంతృత్వ విధానాలు, పెరుగుతున్న నిరుద్యోగం. ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు, సంపద కొద్ది మంది వద్ద పోగు కావడం ఇలా అనేక సంతృప్తులు యువతను నిరాశా నిస్పృహలకు గురి చేస్తుంది.
 బీజేపీ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చట్ట బద్దమైన సంస్థలను నిర్వీర్యం చేస్తుందని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. అమెరికా కంపెనీలు, ఇండియాలో వాటి  బానిస కార్పొరేట్లకు దేశ సంపదను  దోచి పెట్టడంపై రాహుల్‌ ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే ఫాసిస్ట్ పాలకులకు మరో రూపం అయిన  మతతత్వ పార్టీలు రాజ్యామేలున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ వోట్‌ చోరీ ఉద్యమాలు, హమ్ దో..హమారా దో వంటి నినాదాలు ప్రజలకు చేరవు, సక్సెస్‌ కాకుండా కార్పొరేట్‌ నీడలో నడిచే ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తారు.ప్రజాస్వామ్య భారత దేశం ఫాసిస్ట్ దేశంగా మారేందుకు అడుగు దూరంలో ఉంది. 2047ను టార్గెట్‌ను పెట్టుకుని బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో దేశంలో ప్రజాస్వామ్య పోరాటాలు, కుల పోరాటాలు, చివరికి బూర్జువా  పార్టీలు నమ్మే మేడిపండు ఉద్యమాలు కూడా ఫాసిస్ట్‌ పోరాటాలను ముందు నిలబడటం లేదు.
నిజానికి ఇప్పుడు భారత దేశం కీలక దశలో ఉంది. బూర్జువా ప్రజాస్వామ్యం ఫాసిస్ట్ రాజ్యంగా మారే సంధి కాలంలో ఇండియాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫాసిస్ట్ సిద్దాంతానికి  ప్రజాస్వామ్య, నూతన ప్రజాస్వామ్య సిద్దాంతాలకు మధ్య చర్చ చివరి దశలో ఉంది. అయితే అధికారం, ఆర్ధిక, ప్రచార మాధ్యమాలు, అగ్రదేశం అండలు, ద్రవ్య సంస్థల మద్దతు ఉండటంతో ఫాసిస్ట్‌ సిద్దాంతం  ప్రజాస్వామ్య, నూతన ప్రజాస్వామ్య  సిద్దాంతాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. దేశంలో ప్రజా ఉద్యమాలకు, నూతన ప్రజాస్వామ్య విప్లవ పరిస్థితులకు అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. కానీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అటు కాంగ్రెస్‌ ఇటు కమ్యూనిస్ట్‌లు విఫలం అయ్యారు. నక్సలైట్ పార్టీలున్న వారికి ప్రజలతో సంబంధాలు తగ్గాయి. ప్రజలను చైతన్యం చేసే ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘాలున్నా ఫాసిస్ట్‌ పార్టీతో పోటీపడేందుకు శక్తి సామార్ధ్యాలు వారికి సరిపోవడం లేదు.
మరోవైపు రాజ్యాంగంపై ప్రజలకు విశ్వాసం తగ్గుతుంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. మావోయిస్ట్‌ పార్టీ చూపిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇప్పుడు దేశానికి అవసరమని జనాలు మాట్లాడుతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న యువత పోరాటాలు, దేశంలో ఫాసిస్ట్‌ పాలనకు వ్యతిరేకంగా రావాలని,నూతన ప్రజాస్వామ్య విప్లవం అవసరమన్న డిమాండ్ ప్రజల్లో పెరుగుతుంది.. దేశ సంపద కార్పొరేట్‌ శక్తులకు అప్పగించకుండా అడ్డుకుంటూనే..దేశాన్ని  ఫాసిస్ట్‌  వైపు తీసుకుపోతున్న బీజేపీకి నక్సలైట్లు కొరకరాని కొయ్యగా మారారు. దీంతో మావోయిస్ట్‌ పార్టీపై కేంద్రం అంతిమ యుద్దాన్ని ప్రకటించింది..ప్రజలకు ప్రత్యామ్నాయ వ్యవస్థను చూసిస్తున్న మావోయిస్ట్ పార్టీని నిర్మూలించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నాయకత్వాన్ని నిర్మిలించవచ్చు.. కానీ నాయకులను తయారు చేసుకోవడం ప్రజలకు కొత్తేమికాదు. వాస్తవానికి దేశంలో రైతులు నిరుద్యోగులు యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. అడవుల్లో అన్నలు నిర్మిలిస్తే..ఎక్కడో ఒకచోట.ఏదో ఒక రూపంలో ఉద్యమం పురుడుపోసుకుని కొత్త నాయకత్వం వస్తుంది.
మరోవైపు మావోయిస్ట్ పార్టీ లేకుండా చేయాలన్న బీజేపీ మైండ్ గేమ్‌తో చేస్తున్నది తప్పుడు ప్రచారం కాకపోతే. పాలకులు చెప్పుతున్నదే నిజం అయితే మావోయిస్ట్ పార్టీ చరిత్రాత్మక తప్పిదం చేసినట్లు అవుతుంది. దేశంలో కుల, వర్గ పోరాటాలు విఫలం అయ్యాయని పాలక వర్గాలు వ్యూహత్మంగా ప్రచారం చేస్తుంది..ఇప్పుడు నక్సలైట్ పోరాటాలు కూడా విఫలం అయ్యాయి అనే ప్రాపగండ మొదలు పెట్టింది..ఇది దేశానికి అత్యంత ప్రమాదం..ప్రత్యామ్నాయ పోరాటాలు, అల్టర్‌నేటివ్ సిద్దాంతాలు లేకపోతే ప్రజాస్వామ్య దేశం నియంత రాజ్యంగా మారుతుంది.రాజ్యాంగ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది.
ఒకవైపు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని బలహీనపర్చుతు, మరోవైపు మావోయిస్ట్‌ పార్టీ వర్గ పోరాటాన్ని వదిలేసిందని ప్రచారం చేయడం వల్ల దేశాన్ని కాషాయ పార్టీ ఫాసిజం లోకి తీసుకుపోవడంలో మరో అడుగు వేసిందనుకోవచ్చు..ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటిన్నది చర్చ కూడా అవసరం..రాజకీయ పార్టీల లక్ష్యం ఏంటన్న చర్చ దేశంలో జరగాలి. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, హక్కుల నేతలపై కూడా కీలక బాధ్యత ఉంది. కేంద్రం చేస్తున్న తప్పుడు ప్రచారంపై ప్రజలను చైతన్యం చేయాలి. వాస్తవాలేంటోప్రజలకు వివరించాలి..దేశాన్ని ఫాసిస్ట్‌ రాజ్యం వైపు నడిపిస్తున్న తీరును వివరించాలి . రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలకు వదిలేయాలి. ప్రజా సంఘాలతో ప్రజా పోరాటాలు నిర్మించాలి. రాజకీయ పోరాటంతో ఫాసిస్ట్‌ను ఓడించలేం. ఎన్నికల రాజకీయానికి ప్రజా పోరాటాలు కావాలి. దేశంలో ఇప్పుడు తెలంగాణ తరహా పోరాటాలు కావాలి. నేపాల్ , బంగ్లాదేశ్‌, శ్రీలంక పోరాటాలు పని చేయవు. అలాంటి ఉద్యమాలు వచ్చిన అది వరిగడ్డి మంటల ఆరిపోతుంది..అది దోపిడీ దారులకు మరింత దోచుకోవాడానికి, ప్రజలను అణిచివేయడానికే పనికి వస్తుంది. దూర దృష్టి, తక్షణ ఎత్తుగడలతో ప్రజా ఉద్యమ రూపాలుండాలి. కమ్యూనిస్ట్‌లు ఐక్యం కావాలి..ప్రజలతో ప్రజాసంఘాలే ఏకం కావాలి. కాంగ్రెస్‌కు కాకుండా ప్రజా పోరాటాలకు రాహుల్ నాయకత్వం వహించాలి.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page