- దశాబ్ద కాలంగా గాడి తప్పిన నీటిపారుదల శాఖ
- ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం
- నీటిపారుదల శాఖ బడ్జెట్‌లో అప్పులు, వడ్డీలకే రూ.11000 వేల కోట్లు..
- తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు
- మానవ వనరులు,మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
- ఏడాదిలోనే 700 ఏఈఈలు, 1800 లష్కర్ ఉద్యగాల భర్తీ
- మరో 1300 ఉద్యగాల భర్తీకి అనుమతులు
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : నీటిపారుదల శాఖలో జనవరి మాసాంతానికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్‌నాథ్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇఎన్‌సి జెనరల్ అనిల్ కుమార్, ఇఎన్‌సి ఓడయం విజయభాస్కర్ రెడ్డి తో వేసిన ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంతకాలంగా న్యాయపరమైన అడ్డంకులు ఉన్నందునే జాప్యం జరిగిందని వాటిని అధిగమించేందుకు ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధ లో తెలంగాణ ఏఇఇల అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.
ఇఎన్సి అనిల్ కుమార్, హరేరాం, డిప్యూటీ ఇఎన్‌సి కె.శ్రీనివాస్ తో పాటు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ , సంఘం నేతలు బండి శ్రీనివాస్, నాగరాజు,సమర సేన్,సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి నీటిపారుదల శాఖ సంవత్సరానికి అప్పులకు, వడ్డీలకే 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గడిచిన ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసి తక్కువ ప్రయోజనం పొందిందని, ఆ ఫలితం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా పరిణమించిందని అన్నారు.. అటువంటి నీటిపారుదల శాఖను సంవత్సర కాలంగా గాడిలో పెడుతున్నామన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. మానవ వనరులు, మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈలను నియమించడంతో పాటు 1800 మంది లష్కర్‌లను నియమించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో 1300 ఉద్యగాల నియమాకాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతిచ్చామన్నారు. యావత్ భారత దేశంలోనే ఇక్కడి నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడి ఇంజినీర్లు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు నిర్మించారన్నారు.
ఆధునిక దేవాలయాలుగా బాసిల్లిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్ట్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదహరించారు. అటువంటి ఇంజినీర్లకు యువ ఇంజినీర్లు వారసత్వంగా ఎదగాలని ఆయన ఉద్బోధించారు. విధినిర్వహణలో సిన్సియారిటీ, నిబద్ధత, పారదర్శకత కనిపించాలని అటువంటప్పుడే ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ నీటిపారుదల శాఖా అత్యంత ప్రతిష్టాత్మకమైనదని.. అటువంటి శాఖ ప్రతిష్ఠతను నిలిపేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారు.





