తెలంగాణ పోరులో ప్రొఫెసర్ లింగమూర్తి సార్….

“తెలంగాణ ప్రాంతంలో దిన పత్రిక లేదని వార పత్రికగా,దినపత్రికగా వెలువడిన “ప్రజాతంత్ర పత్రికను ” కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రోత్సహించారు. తెలంగాణ ఉద్యమ వార్తలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన ప్రజాతంత్రకు ప్రొఫెసర్ లింగమూర్తి సహా ఇతర అధ్యాపకులు వందల సంఖ్యలో చందాదారులను చేర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత కలిసిన ప్రతి సారి పాత రోజులు గుర్తు చేసే వారు. తెలంగాణ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదంటూ వర్తమాన రాజకీయాల పై విచారం వ్యక్తం చేసేవారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు ఒకరు ఇప్పుడు అనుభవించే వారు ఒకరు. తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రొఫెసర్ లింగమూర్తి కి అన్యాయమే జరిగింది. ఉద్యమ కారులు వెనక్కి చూసుకుంటే అందరిదీ ఒకటే అంతర్మధనం..”

-మహేందర్ కూన
జర్నలిస్ట్

తెలంగాణ తుదివిడత పోరులో  తెలంగాణ కోసం తెగించి పోరాడిన యోధులు ఎందరో ఉన్నారు.ఉద్యమ భావజాల వ్యాప్తికి విధ్యాధికులు,విద్యార్థులు,జర్నలిస్టుల పాత్ర కీలకమైంది. తొలినాళ్లలో ఎవరి పరిదిలో వారు తమవంతు కర్తవ్యంగా కదం తొక్కడం వల్లే  పిడికెడు మందితో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. మొదటి అడుగు వేసిన వారిలో కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ లింగ మూర్తి ఒకరు. తెలంగాణ రాష్ర్టం వస్తే తప్ప తెలంగాణ ప్రజలకు భవిష్యత్ ఉండబోదని  అన్ని రంగాలలో అన్యాయం దోపిడి జరుగుతోందని డాక్టర్ జయశంకర్ సార్ తో కల్సి  తెలంగాణ జెండా పట్టుకున్న వ్యక్తి ప్రొఫెసర్ లింగమూర్తి.

దొరల చేతుల్లో తెలంగాణ ఉండకూడదని ఉద్యమంలో దళిత బహుజనులను కూడగట్టి అధికారం వారికే దక్కేలా ఉద్యమం జరగాలని ఆదిశగా కృషి చేసారు ప్రొఫసర్ లింగమూర్తి. ప్రొఫెసర్ లింగమూర్తి అంటే ఆ రోజుల్లో ఓ సీరియస్ అకడమిస్ట్ అని పేరుండేది.తెలంగాణ ఉద్యమం విద్యావేత్తలు విద్యార్థుల నుండే  ప్రారంభం కావాలని  అది కాకతీయ,ఉస్మానియా యూవివర్శీటీల నుండే జరగాలని ప్రొఫెసర్ లింగమూర్తిని తెలంగాణ మహాసభ కన్వీనర్ గా ప్రతిపాదించారు.ఆయన ఇందుకు ముందు అంగీకరించక పోగా ప్రొపెసర్ జనార్దన్ రావు ఒప్పించారు.  న్యూట్రల్ గా ఉండే వారు ఉద్యమ నాయకత్వంలో  ఉంటే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అన్నిప్రజా సంఘాలతోపాటు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం ఒకే ఎజెండాతో పనిచేయాలని డాక్టర్ జయశంకర్ సార్ తో కల్సి పనిచేసారు. ఆతర్వాత ఈసంఘాలన్ని కల్సితెలంగాణ ఐక్యవేదికగా ఏర్పడ్డాయి.

కాకతీయ విశ్వవిద్యాలయం లో ప్రత్యేక పరిస్థితులు ఉండేవి.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న సమయంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆంధ్ర పెత్తందారుల పలుకుబడి బాగా నడిచే రోజులు. విశ్వవిద్యాలయం అధ్యాపకులను కాదని ఆంధ్రా వ్యక్తి  వైకుంఠం ను వైస్ ఛాన్సలర్  నియమించారు. వైకుంఠం హయాంలో  ఆయన పక్షపాత ధోరణికి ,కక్ష సాధింపు చర్యలకు అధ్యాపకులు బలయ్యారు. తనకు గిట్టని వారిని ఇతర జిల్లాలకు బదిలి చేసాడు.  వైకుంఠం విధానాలను నిలదీస్తూ ” వార్త దినపత్రికలో” వార్తలు రాసిన జర్నలిస్ట్ వంగా నారాయణ రెడ్డి పై వైస్  ఛాన్సలర్   పరువు నష్టం దావా కేసు వేసి వేధించాడు. ముందు ఉద్యోగం తీయించాలని చూసాడు. అది నెరవేరక పోవడంతో తర్వాత పరువు నష్టం దావా వేసి ఓడిపోయాడు.

వైకుంఠం ఆంధ్రపక్షపాతధోరణులు, విధానాలు నచ్చని అధ్యాపకులు,విద్యార్థులు సమరశంఖం పూరించారు. ఆదే సమయంలో తెలంగాణ కోసం సదస్సులు,సభలు ప్రాంరంభం అయ్యాయి. జిల్లా ఎస్పి తో పాటు ఇక్కడ పనిచేసిన  జిల్లా జడ్జిలు కూడ ఆంధ్ర ప్రాంతం వారే కావడంతో  ఆంధ్రవలదారులపెత్తనం పై అసంతృప్తులు నెలకొన్నాయి. ఈ కాలంలో లోనే  1997 లో తెలంగాణ సాదన కోసం ఏర్పడిన తెలంగాణ మహాసభ కు ప్రొఫెసర్ లింగమూర్తి  ఉమ్మడి వరంగల్ జిల్లా లో కన్వీనర్ గా పనిచేసారు. ఆ రోజుల్లో వరంగల్ జిల్లాలో పీపుల్స్ వార్ నక్సలైట్ల కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. తెలంగాణ ఉద్యమం తొలుత లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్ నుండే మొదలయ్యాయి. జనశక్తి లో కూర రాజన్న తో కులవర్గ పోరాట సిద్దాంతంపై విభేదించి మే 17 కామ్రెడ్స్  పేరిట విడిపోయిన మారోజు వీరన్న ప్రజా పోరాటాలు పటిష్టం చేసేందుకు అనేక కుల సంఘాలను ఏర్పాటు చేసారు. ఆయుధాలతో  పోరాటం చేసే కన్నా ప్రజల్లో ఉండి  కులవర్గ జమిలి పోరాటంతో విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించి ఈ క్రమంలోనే మారోజు వీరన్న ఆలోచనల మేరకు  తెలంగాణ మహాసభ ఏర్పిడింది.

డాక్టర్ చెరుకుసుధాకర్,వీరమల్ల ప్రకాశ్, న్యాయవాది భరత్ కుమార్, బెల్లయ్య నాయక్,నేను ( ఈ వ్యాస కర్త కూన మహేందర్) ఇంకా అనేక మంది  తెలంగాణ మహాసభలో  పనిచేసారు. తెలంగాణ మహాసభ “దళిత బహుజన తెలంగాణ కాన్సెప్ట్”  ప్రొపెసర్ లింగమూర్తి కి బాగా నచ్చింది. ప్రజాకవి కాళోజి నారాయణ రావు, కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ,  ప్రొపెసర్ సీతారామ రావు, డాక్టర్ జయశంకర్ సార్,  ప్రొపెసర్ బుర్రా రాములు,ప్రొపెసర్ జనార్దన్ రావు , గాదె ఇన్నయ్య, తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం అధ్యక్షులు కరుణాకర్,జర్నలిస్ట్ వంగ నారాయణ రెడ్డి,  ఇంకా అనేక మంది తెలంగాణ మహాసభ  సభలు సమావేశాలలో పాల్గొనే వారు.

1997అక్టోబర్ 28 న ఆయన అధ్వర్యంలో భారి ఎత్తున సదస్సు,ర్యాలి,బహిరంగ సభ ఒకేరోజు నిర్వహించారు.  పోలీసులు ఈసభకు షరతులపై అనుమతులు ఇచ్చారు. కాని ఈ బహిరంగ సభను విఫలం చేసేందుకు  అన్ని విధాలా ప్రయత్నాలు చేసారు. గ్రామాల నుండి వచ్చే వారి వాహనాలను నగర శివార్లలో  అడ్డిగించారు. వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా జనం భారి ఎత్తున ర్యాలి బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ఈ సభలో బిజెపి నాయకులు వన్నాల శ్రీరాములు,మందాటి సత్యనారాయణ రెడ్డి,సిరికొండ సంజీవ రావు, జల సాదన ఉద్యమ నేత మాజి ఎమ్మెల్సి కోడూరి వరదారెడ్డి ఇంకా అనేకమంది పాల్గొన్నారు. పోలీసుల వైఖరిపై ప్రొఫెసర్ లింగమూర్తి ఫైర్ అయ్యారు. ” తెలంగాణ  మాకోసం కాదు ప్రజల కోసం కావాలి. సీమాంధ్ర పాలకులది   ప్రాంతీయ  సామ్రాజ్యవాదం (Regional Imperialism), తెలంగాణ వారిని బానిసలుగా చూస్తున్నారు. మీకు (పోలీసులకు) ఆంధ్రపాలకుల పాలనలో తీరని అన్యాయం జరుగుతోంది.  తెలంగాణ అనివార్యం ..అన్ని వర్గాల వారు తెలంగాణ కోసం ముందుకు రావాలి అందుకే మేము ఈ సభను నిర్వహిస్తున్నాం…ఇందులో లెఫ్టిస్టులు ఉన్నారా రైటిస్టులు ఉన్నారా అని వెదుకుతారా…అందరు ఉన్నారు ఉంటారు…సభను డిస్టబ్ చేయకండి అని  ప్రొఫెసర్ లింగమూర్తి డిఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. మీరు సభను డిస్టర్బ్ చేస్తే పోలీస్ స్టేన్లోనే సభ నిర్వహిస్తామని అన్నారు. దాంతో పోలీసులు వెనక్కి తగ్గి సభకు ఆటంకాలు కల్పించ లేదు.రాత్రి 10 గంటల వరకు ఇస్లామియా కాలేజి గ్రౌండ్ లోసభ జరిగింది.

కలెక్టర్ కార్యాలయం నుండి సభ జరిగిన వరంగల్ ఇస్లామియా  కళాశాల గ్రౌండ్ వరకు తెలంగాణ రాష్ట్రం కావాలంటూ జనం నినదించారు. తుది విడత పోరులో ప్రజలను సమీకరించి జరిపిన మొదటి సభ ఇదే. పోలీసులు భగ్నం చేయాలనుకున్న సభను  ప్రొఫెసర్ లింగమూర్తి విజయవంతం చేసినందుకు జయశంకర్ సార్ అభినందించారు.  అకడమిక్ బాధ్యతల్లో  భాగంగా  ఆయన అనేక కీలక పదవులు నిర్వహించారు. 2007 నుండి 2010 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా పనిచేశారు.  ఆయన హయాంలోనే కాకతీయ యూనివర్శిటీకి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేశారు. పట్టుదలతో యూనివర్సిటీ అభివృద్దికి కృషి చేసారు.

తెలంగాణ ప్రాంతంలో దిన పత్రిక లేదని వార పత్రికగా,దినపత్రికగా వెలువడిన  “ప్రజాతంత్ర పత్రికను ” కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రోత్సహించారు. తెలంగాణ  ఉద్యమ వార్తలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన ప్రజాతంత్రకు ప్రొఫెసర్ లింగమూర్తి సహా ఇతర అధ్యాపకులు  వందల సంఖ్యలో చందాదారులను చేర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత కలిసిన ప్రతి సారి పాత రోజులు గుర్తు చేసే వారు.  తెలంగాణ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదంటూ వర్తమాన రాజకీయాల పై విచారం వ్యక్తం చేసేవారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు ఒకరు ఇప్పుడు అనుభవించే వారు ఒకరు. తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రొఫెసర్ లింగమూర్తి కి అన్యాయమే జరిగింది. ఉద్యమ కారులు వెనక్కి చూసుకుంటే అందరిదీ ఒకటే అంతర్మధనం.

తెలంగాణ కోసం పరితపించి ఓ సీరియస్ అకడమిషియన్ అయి ఉండి  ఉద్యమంలో తన వంతు  పాత్ర పోషించిన ప్రొఫెసర్ లింగమూర్తి  మిగిలి పోయిన  జ్ఞాపకాలు  పంచుకునేందుకు చాలా ఉన్నాయి. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని  లోటు.
ఉద్య భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషికి జోహార్లు …
జోహార్ ప్రొఫెసర్ లింగ మూర్తిసార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *