జమిలి ఎన్నికలపై చర్చ జరగాలి..

  • తరచూ ఎన్నికలతో పాలనా వ్యవస్థలకు విఘాతం
  • ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 27 : ‘వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం సహా, ఈ చర్చ ను ప్రోత్సహించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం దిల్లీలో నేషనల్‌ ‌కేడెట్‌ ‌కార్పస్ (ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

జమిలి ఎన్నికల ప్రతిపాదనపై చర్చను ప్రోత్సహించడం సహా, దానిలో పాల్గొనాలని ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌వలంటీర్లకు ఆయన సూచించారు. ఇది నేరుగా వారి భవిష్యత్తులతో ముడిపడిన అంశమని మోదీ చెప్పారు. ‘‘మన దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా మారిపోయింది. భారత్‌కు స్వాతంత్య్రం వొక చాలా ఏళ్లపాటు జమిలి ఎన్నికలే జరిగాయి. కొన్ని కారణాల వల్ల ఈ విధానం అమలుకు ఆకస్మిక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది దేశానికి పెద్ద సవాల్‌గా మారింది’’ అని ప్రధాని వివరించారు.

‘‘దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతుంటే పాలనా వ్యవస్థలకు విఘాతం కలుగుతుంది. వికాసం మందగిస్తుంది. జమిలి ఎన్నికల విధానంతో ఈ సమస్యలన్నీ సమసిపోతాయి. పాలనా వ్యవస్థ అవాంతరాలు లేకుండా పనిచేయగలదు. ప్రభుత్వం మరింత ఫోకస్డ్‌గా పాలనలో ముందుకు సాగగలదు’’ అని మోదీ తెలిపారు. ‘‘అమెరికాలాంటి దేశాల్లోనూ ప్రతి నాలుగేళ్లకోసారి జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. నూతన ప్రభుత్వాల ఏర్పాటు తేదీలను సైతం అక్కడి రాజ్యాంగంలో ఫిక్స్‌డ్‌గా పొందుపరిచారు’’ అని మోదీ చెప్పారు. ‘‘జమిలి ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీలో ఉన్నవాళ్లంతా లోతుగా చర్చించండి. భారతదేశ భవిష్యత్‌ ‌రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలంటే మీరంతా చర్చించుకోవడం చాలా అవసరం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *